Mutton Price Rise: హైదరాబాద్‌లో చికెన్‌కు పడిపోయిన డిమాండ్.. మటన్ చేపల ధరలకు రెక్కలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:48 PM
బర్డ్ ఫ్లూ భయాల కారణంగా హైదరాబాద్‌లో మటన్, చేపల ధరలకు రెక్కలొచ్చాయి. గత వారంతో పోలిస్తే ధరలు ఏకంగా 17 శాతం మేర పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో (Hyderabad) చికెన్ ధరలు అంతకంతకూ పడిపోతుండటంతో మటన్, చేపల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ధరాభారం తట్టుకోలేక జనాలు గగ్గోలు పెడుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా గత కొన్ని రోజులుగా ప్రజలు చికెన్ పేరు చెబితే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. అంత ఆందోళన అవసరం లేదని నిపుణులు చెబుతున్నా పరిస్థితిలో మార్పుల రాలేదు. దీంతో, కోళ్ల ఫారం యజమానుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.
గత వారం రోజుల్లో మటన్‌కు డిమాండ్ ఏకంగా 40 శాతం పెరిగిందని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఫలితంగా వాటి రేట్లు కూడా 17 శాతం మేర పెరిగాయి. వారం క్రితం కేజీ మటన్ ధర రూ.850 కాగా ప్రస్తుతం అది రూ.1000కి చేరుకుంది. చేపల ధరల్లో కూడా ఇదే మార్పులు కనిపిస్తు్న్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కేజీ రూ.50 నుంచి రూ.100 వరకూ ధరలు పెరిగాయని అంటున్నారు.
మరోవైపు, బర్డ్ ఫ్లూ భయాలు పెళ్లి వేడుకలపైనా పడింది. ఇప్పటికే అనేక మంది విందుభోజనాల్లో చికెన్‌కు బదులు మటన్, చేపలను చేరుస్తున్నారు. ధరలు ఎక్కువైనా వెనక్కు తగ్గకుండా మటన్, చేపల వైపు మళ్లుతున్నారు. బర్డ్ ఫ్లూ భయాలు ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఫలితంగా ఒకప్పుడు చికెన్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటే ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని అంటున్నారు. అయితే, ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందనేది దానిపై ఇంకా స్పష్టత లేదు.
Read Latest and Telangana News