Road Accidents in Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఘోర రోడ్డుప్రమాదాలు.. పరిస్థితి ఎలా ఉందంటే..
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:26 AM
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. గాంధారిలో అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి కారు దూసుకెళ్లింది.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ (గురువారం) రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వివిధ జిల్లాల్లో జరిగిన వాహన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కొలపల్లి గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును డీసీఎం వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు బాధితులను హుటాహుటిన జోగిపేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బాధితుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, క్షతగాత్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది. వీరంతా మహారాష్ట్రలోని పండరిపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శంచుకుని బస్సులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. గాంధారిలో అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి కారు దూసుకెళ్లింది. పోలీసులు రోడ్డుపక్కన నిలబడి ఉండగా.. వేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టింది.
ఈ ఘటనలో కానిస్టేబుల్ రవి కుమార్(40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. సుభాశ్ అనే మరో కానిస్టేబుల్‌కి తీవ్రగాయాలు అయ్యాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోనూ తీవ్ర విషాదం నెలకొంది. రాజక్కపేట శివారులో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా రేకులకుంట ఎల్లమ్మ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కాగా, వీరంతా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామస్థులుగా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Pavel Stepchenko Retirement: 23 ఏళ్లకే రిటైర్మెంట్.. రికార్డులు సృష్టించిన యువకుడు..
Gold and Silver Prices: ఉలిక్కి పడేలా చేస్తున్న బంగారం, వెండి ధరలు.. రోజు రోజుకూ..