Medigadda Barrage: డిజైన్ లోపాలతోనే మేడిగడ్డ కుంగింది
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:03 AM
భీకర వరదను తట్టుకునే వ్యవస్థలు లేకపోవడమే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమని ఐఐటీ రూర్కీ నిపుణుల నమూనా అధ్యయనం తేల్చింది.

ఐఐటీ రూర్కీ అధ్యయనంలో నిర్ధారణ
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): భీకర వరదను తట్టుకునే వ్యవస్థలు లేకపోవడమే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతినడానికి కారణమని ఐఐటీ రూర్కీ నిపుణుల నమూనా అధ్యయనం తేల్చింది. గేట్ల నుంచి వేగంగా దూకే వరదలో ఉండే పీడన శక్తిని నిర్వీర్యం చేయడానికి టెయిల్‌పాండ్ ప్రతిపాదించ లేదని, దీంతో దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంది. డిజైన్లు, డ్రాయింగుల్లో లోపాలతోనే బ్యారేజీ కుంగిందని తెలిపింది. 2020-23 మధ్యకాలంలో వరుసగా నాలుగేళ్లు వరదలు రావడంతో బ్యారేజీ దిగువన మట్టి క్రమంగా కొట్టుకుపోయి గుంతలు సీకెంట్ పైల్స్ వరకు విస్తరించాయని, బుంగలను పూడ్చడంలో తాత్సారం చేయడంతో తీవ్రత పెరిగి బ్యారేజీ కుంగిపోవడానికి దారితీసిందని తేల్చింది.
జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ సిఫారసుతో ఈ అధ్యయనం చేయించారు. అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌డీఎ్‌సఏకు పంపింది. కాగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై తక్షణమే నివేదిక అందించాలని కోరుతూ ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌కు ఈఎన్‌సీ (జనరల్) అనిల్‌కుమార్ లేఖ రాశారు. ఎన్‌డీఎ్‌సఏ నిపుణుల కమిటీ సూచించిన పరీక్షలన్నీ నిర్వహించి, వివరాలు సమర్పించామని పేర్కొన్నారు.