Share News

చిన్నారుల కోసం ముందు‘చూపు’

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:50 AM

చిన్నారుల నుంచి పెద్దపిల్లల వరకు అద్దాలతోని పాఠశాలలు, కాలేజీలకు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. ఏ తరగతి గదికి వెళ్లినా కొందరు పిల్లలైనా అద్దాలతో కనిపిస్తారు. సర్వేంద్రియాల్లో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చూపు లేకపోతే మనిషి నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదం ఉంది.

చిన్నారుల కోసం ముందు‘చూపు’

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

చిన్నారుల నుంచి పెద్దపిల్లల వరకు అద్దాలతోని పాఠశాలలు, కాలేజీలకు పరుగులు తీస్తూ కనిపిస్తున్నారు. ఏ తరగతి గదికి వెళ్లినా కొందరు పిల్లలైనా అద్దాలతో కనిపిస్తారు. సర్వేంద్రియాల్లో కళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. చూపు లేకపోతే మనిషి నిర్వీర్యంగా మారిపోయే ప్రమాదం ఉంది. అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన కళ్లకు వాతావరణ కాలుష్యాలు, విటమిన్లు, పోషకాహార లోపాల కారణంగా జబ్బులు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జాతీయ అంధత్వ నివారణ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ప్రతి చిన్నారిని పరీక్షించే విధంగా వంద రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు కంటి పరీక్షలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, రాష్ట్రీయ బాలస్వస్థ విభాగం అధికారి డాక్టర్‌ నయిమా పర్యవేక్షించారు. వంద రోజులపాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆప్తమాలజీ నిపుణులు పరీక్షలు చేయనున్నారు.

జిల్లాలో 31,992 మంది చిన్నారులకు పరీక్షలు..

చిన్నారులకు కంటి సమస్యలను ముందస్తుగానే గుర్తించేందుకు అంధత్వ నివారణ వారోత్సవాల్లో భాగంగా ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 587 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో సిరిసిల్ల ప్రాజెక్ట్‌ పరిధిలో 362 కేంద్రాలు, వేములవాడ పరిధిలో 225 కేంద్రాల్లో ఉన్న 31,992 మంది చిన్నారులకు పరీక్షలు చేయనున్నారు. ఆరు బృందాలుగా ప్రతిరోజు 120 మంది చొప్పున పరీక్షలు చేసే దిశగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం, కోడిగుడ్లు, పౌష్టికాహారాన్ని చిన్నారులకు అందిస్తున్నారు. ఈక్రమంలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అద్దాలు కూడా అందిస్తారు. ముందుగానే గుర్తిస్తే చూపు మందగించడాన్ని అరికట్టవచ్చని భావిస్తున్నారు. చిన్నారులకు నేత్ర పరిరక్షణ, ఆరోగ్యసూత్రాలపై అవగాహన కూడా కల్పిస్తారు. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటి పరీక్షల కోసం రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌లో 6 నెలల నుంచి 2 సంవత్సరాలలోపు పిల్లల్లో బాలికలు 4,392 మంది, బాలురు 4,472 మంది ఉన్నారు. 2 నుంచి 3 సంవత్సరాల వరకు బాలికలు 4,441 మంది, బాలురు 4,583 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు బాలికలు 6,978 మంది, బాలురు 6,926 మంది ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలను తల్లిదండ్రుల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు.

ఫ తొమ్మిది రకాల అంశాలపై పరిశీలన..

రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలతో పాటు తొమ్మిది అంశాలుగా చిన్నారులను పరిశీలిస్తారు. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఉద్వేగ అభివృద్ధి, సునిశిత చాలక నైపుణ్యాలు, భాష, మాట్లాడే నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఆటలు, ఉద్దీపన నైపుణ్యాలతోపాటు తల్లిదండ్రులు, పిల్లల ఎదుగుదల, పెరుగుదలలో ఎదుర్కొంటున్న అవాంతరాలు, ఇబ్బందులను అంగన్‌వాడీ టీచర్‌ దృష్టికి తీసుకరావాలి. మెడికల్‌ అధికారి ద్వారా తగిన చికిత్సకు కౌన్సెలింగ్‌, ఇతర శస్త్ర చికిత్సలకు సిఫార్సు చేస్తారు.

ప్రణాళిక ప్రకారం కంటి పరీక్షలు..

- కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా చిన్నారులు, విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొమ్మిది రకాల అంశాలను పరిశీలిస్తారు. బస్వాపూర్‌ అంగన్‌వాడీ కేంద్రంలో వైద్య పరీక్షలను పరిశీలించి ఏమైనా లోపాలు గుర్తించిన పిల్లలకు మందులు అందజేయాలని సూచించారు. ఎక్కువ ఇబ్బంది పడే విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించాలి.

చిన్నారులకు ఎంతో ఉపయోగం..

- డాక్టర్‌ రజిత, జిల్లా వైద్యాధికారి

అంగన్‌వాడీ కేంద్రాల్లో నేత్ర పరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షలు చిన్నారులకు ఎంతో ఉపయోగపడుతాయి. జిల్లాలో 587 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ప్రారంభించాం. ఆరు సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రత్యేక ప్రశ్నావళి ప్రకారం నిర్ణీత సమయానికి అభివృద్ధి దశలను అందుకుంటున్నారా, వెనబడుతున్నారా, మైలురాళ్లు చేరుతున్నారా, రిస్క్‌ అంశాలను గుర్తించడానికి ఈ స్మార్ట్‌ చెక్‌ ఎంతో ఉపయోగపడుతుంది.

Updated Date - Apr 08 , 2025 | 12:50 AM