ధాన్యం కొనుగోళ్లకు యాక్షన్‌ప్లాన్
ABN , Publish Date - Mar 29 , 2025 | 01:07 AM
యాసంగి సాగులో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరు అందక దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. వరికోతలకు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.

- జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో వరిసాగు
- దిగుబడి అంచనా 3.67 లక్షల మెట్రిక్ టన్నులు
- పౌరసరఫరాల ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం
- జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
యాసంగి సాగులో రైతులు నానా కష్టాలు పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగునీరు అందక దిగుబడిపై ఆందోళన చెందుతున్నారు. వరికోతలకు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు వడగళ్ల వర్షాలు, తెగుళ్లు పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం మార్కెట్‌కు వస్తుందని, అందుకు అనుగుణంగా కొనుగోళ్లు చేసే దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో యాసంగిలో 1.82 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో ప్రధానంగా 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరిసాగు అనుగుణంగా దిగుబడిపై పౌర సరఫరాల శాఖ యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన క్వింటాలుకు ధాన్యం ధర ఏ గ్రేడ్ రూ.2320, బి గ్రేడ్ రూ.2300 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
ఫ ఏప్రిల్‌లో కొనుగోళ్లకు సన్నద్ధం..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజనల్‌లో 1.78లక్షల ఎకరాల్లో వరి సాగు ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. 2.92 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం, 8 వేల మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందులో 67 వేల మెట్రిక్ టన్నులు మిల్లర్లు నేరుగా కొనుగోలు చేస్తారని అంచనా వేశారు. పౌర సరఫరాల శాఖ ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి లక్ష మెట్రిక్ టన్నులు, మేలో 1.88 లక్షల మెట్రిక్ టన్నులు, జూన్‌లో 79 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌లోకి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ ఏప్రిల్‌లో 75 వేలు, మేలో 1.68 లక్షలు, జూన్‌లో 63 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు.
ఫ జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని గ్రామాల్లోని రైతులకు అందుబాటులో ఉండే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు. ఐకేపీ ద్వారా 172 కేంద్రాలు, సింగిల్ విండోల ద్వారా 57 కేంద్రాలు, డీసీఎంఎస్ ద్వారా 6 కేంద్రాలు, మెప్మా ద్వారా 6 కేంద్రాల ఏర్పాటుకు యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఉపయోగించడానికి గన్నీ బ్యాగులు కొత్తవి 18.70లక్షలు, ఇప్పటికే ఉపయోగించినవి 15.90 లక్షలు అందుబాటులో ఉన్నాయి. కొనుగోళ్ల కోసం టార్ఫాలిన్లు, ఇన్నోవింగ్ మిషన్లు, పాడీ క్లీనర్‌లు, మాయిశ్చరైజ్ మీటర్లు, వేయింగ్ మిషన్లు, అస్క్ రిమూవర్స్ వంటి పరికాలు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో వరి సాగు... (ఎకరాల్లో)
మండలం వరి
గంభీరావుపేట 18,000
ఇల్లంతకుంట 24,000
ముస్తాబాద్ 20,000
సిరిసిల్ల 4,800
తంగళ్లపల్లి 19,000
వీర్నపల్లి 9,100
ఎల్లారెడ్డిపేట 16,850
బోయినపల్లి 12,500
చందుర్తి 16,000
కోనరావుపేట 17,800
రుద్రంగి 4,700
వేములవాడ 5,150
వేములవాడ రూరల్ 10,450
--------------------------------------------------------------
మొత్తం 1,78,350
--------------------------------------------------------------