Share News

కాసులు కురిపిస్తున్న చికెన్‌ వ్యర్థాలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:03 AM

చికెన్‌ వ్యర్థాలు ఒకప్పుడు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు భారంగా ఉండేది... ఇప్పుడు మున్సిపాలిటీలకు ఆదాయ వనరుగా మారింది.

కాసులు కురిపిస్తున్న చికెన్‌ వ్యర్థాలు

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): చికెన్‌ వ్యర్థాలు ఒకప్పుడు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు భారంగా ఉండేది... ఇప్పుడు మున్సిపాలిటీలకు ఆదాయ వనరుగా మారింది. చేపల చెరువుల అభివృద్ధి తరువాత చికెన్‌ వ్యర్థాలతో ఆక్వా ఫీడింగ్‌ తయారీ పరిశ్రమలు వెలిశాయి. దీంతో ఈ వ్యర్థాలను మున్సిపాలిటీల నుంచి కొనుగోలు చేసే పరిస్థితులు వచ్చాయి. ఐదేళ్లుగా మున్సిపాలిటీల్లో చికెన్‌ వ్యర్థాలకు భారీ డిమాండ్‌ ఉంది. ఆక్వా పరిశ్రమలు, చికెన్‌ వ్యర్థాలతో నూనెలు తయారు చేసే పరిశ్రమలకు సంబంధించిన ఏజెన్సీలు ఈ టెండర్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. కొన్ని మున్సిపాలిటీల్లో అధికారులను మచ్చిక చేసుకుని దొడ్డిదారిన ఆర్డర్లు పొంది మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లకు రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాయి. రామగుండం నగరపాలక సంస్థలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. యేటా రూ.20లక్షల నుంచి రూ.25లక్షల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ.90వేలతోనే సరిపెట్టారు. రామగుండం నగరపాలక సంస్థ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్‌ నియమావళి పాటించకుండా ఒక ఏజెన్సీకి సేకరణ బాధ్యతలు అప్పగించింది. తరువాత ఆ ఏజెన్సీ నిబంధనలు పాటిస్తుందా లేదా అనే అజమాయిషీ చేసే పరిస్థితి కూడా లేదు. రామగుండం నగరపాలక సంస్థలో 250లకు పైగా చికెన్‌ సెంటర్లు ఉంటాయి. రోజు టన్నుల కొద్ది వ్యర్థాలు చికెన్‌ సెంటర్లలో పోగవుతాయి. బుధ, ఆదివారాల్లో ఈ వ్యర్థాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. వీటిని గుర్తింపు పొందిన ఆక్వా ఫీడింగ్‌ తయారీ పరిశ్రమలకు సరఫరా చేసే ఏజెన్సీలకు మాత్రమే వెస్టేజ్‌ తరలింపు పనులు అప్పగించాల్సి ఉంటుంది. ఇందుకు మున్సిపాలిటీలకు వేస్టేజ్‌ బరువును బట్టి ఫీజు చెల్లిస్తారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను అనుసరించి ఈ సేకరణ జరుపాల్సి ఉంటుంది. చిన్న మున్సిపాలిటీల్లో అయితే ఏజెన్సీలను పిలవడం, పెద్ద మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలోనైతే ఇంజనీరింగ్‌ విభాగం నుంచి టెండర్లను పిలుస్తారు. కానీ రామగుండంలో మాత్రం ఈ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. ఏకంగా ఒక ఏజెన్సీకి వ్యర్థాల డిస్పోజల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. అది కూడా శానిటేషన్‌ విభాగం నుంచి ఆర్డర్‌ తయారు చేశారు. చికెన్‌ వ్యర్థాలను డిస్పోజల్‌ చేసేందుకు ఒప్పుకుందని, అందుకు గాను కార్పొరేషన్‌ పరిధిలోని 139షాపుల నుంచి 2023-2025 ఆర్థిక సంవత్సరాలకు గాను ఒక్కో షాపునకు రూ.1400 చెల్లిస్తుందని ఆర్డర్‌లో పేర్కొన్నారు.

కరీంనగర్‌లో యేటా రూ.20లక్షలు...

చికెన్‌ వ్యర్థాలకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. చికెన్‌ వ్యర్థాలతో ఆక్వా ఫీడింగ్‌ తయారు చేసే కంపెనీలు గ్రామీణ స్థాయి నుంచి ఏజెన్సీలను పెట్టి సేకరణ చేస్తున్నాయి. చికెన్‌ షాపుల నిర్వాహకులకు, స్థానిక సంస్థలకు ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల నుంచి అయితే రోజు పెద్ద ఎత్తున వ్యర్థాల సేకరణకు అవకాశం ఉండడంతో పలు పరిశ్రమలు పోటీ పడుతున్నాయి. దీంతో ఏజెన్సీలు మున్సిపాలిటీలపై ఒత్తిడి తేవడంతో టెండర్లు పెట్టారు. కరీంనగర్‌లో యేటా రూ.20లక్షల ఆదాయం సమకూరుతుంది. రామగుండం నుంచి ఇంకా పెద్ద ఎత్తున వ్యర్థాలు తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. రామగుండానికి కూడా ఈ ఆదాయం ఏటా రూ.25లక్షలు దాటే అవకాశం ఉంది. కానీ కొందరు అధికారులు భారీగా గండి కొట్టారు.

చికెన్‌ వ్యర్థాలను తరలించేవారెవరు...

రామగుండం నుంచి గతంలో చికెన్‌ వ్యర్థాల తరలింపును ఒక ఏజెన్సీకి అప్పగించారు. అది కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఆ ఏజెన్సీకి ఇచ్చిన గడువు కూడా ముగిసిందని యంత్రాంగం పేర్కొంటున్నది. కానీ రామగుండంలో మాత్రం రోజు వెలువడుతున్న వ్యర్థాలు తీసుకెళుతూనే ఉన్నారు. నగరపాలక సంస్థ మాత్రం దీనిపై స్పందించడం లేదు.

వ్యర్థాల తరలింపుపై అజమాయిషీనే లేదు...

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో చికెన్‌ వ్యర్థాలను సేకరించే విషయంలో నగరపాలక సంస్థ అజమాయిషీ చేయాల్సి ఉంటుంది. తరలింపు ఏజెన్సీల నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, రోజు ఎంత సేకరిస్తున్నారు, దారి మళ్లిస్తున్నారా అనే విషయాలపై పరిశీలించాల్సి ఉంటుంది. రోజు సేకరించిన వ్యర్థాలకు సంబంధించి రికార్డు తయారు చేసి కాలుష్యనియంత్రణ మండలికి పంపాల్సి ఉంటుంది.

మాకు సమాచారమే లేదు...

నాగభూషణం, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

చికెన్‌ వ్యర్థాల తరలింపుపై మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇంజనీరింగ్‌ విభాగానికి సమాచారం ఉండే అవకాశం ఉంది. మేము వ్యర్థాల గురించి మానిటరింగ్‌ చేయడం లేదు.

Updated Date - Apr 07 , 2025 | 01:03 AM