ఉగాది తర్వాత వరి కోతలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:57 AM
ఉగాది తర్వాత జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎండలు ముదరాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఉగాది తర్వాత జిల్లాలో యాసంగి వరి కోతలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే ఎండలు ముదరాయి. వడగళ్ల వానలు పడుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతాంగం వీలైనంత త్వరగా వరి కోతలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఉగాది తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో వరి కోతలు ప్రారంభించే అవకాశమున్నది. దీంతో జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.
జిల్లా 336 కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 3.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 239 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 48, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 45, హాకా ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో సన్న, దొడ్డు రకం వరి విత్తనాలను వేర్వేరుగా కొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు.
యాసంగిలో 2.66 లక్షల ఎకరాల్లో వరి సాగు
జిల్లాలో యాసంగిలో 2,66,896 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 1,99,051 ఎకరాల్లో దొడ్డు, 67,845 ఎకరాల్లో సన్న రకం వరి సాగు జరిగింది. ఇందులో సుమారు 40 వేల ఎకరాల్లో విత్తనపంట ప్రధానంగా హుజురాబాద్ రెవెన్యూ డివిజన్‌లో సాగైంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈసారి 5,86,723 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. దిగుబడిలో 4,57,817 మెట్రిక్ టన్నులు దొడ్డు రకం, 1,28,906 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం వస్తుందని అంచనా వేశారు. రైతుల సొంత అవసరాలు, సీడ్ దిగుబడి కింద 2,26,713 మెట్రిక్ టన్నులు మినహాయిస్తే 3,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావించి ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు 2,74,946 మెట్రిక్ టన్నుల దొ డ్డు వరి ధాన్యం, 85,054 మెట్రిక్ టన్నుల సన్న రకం వరి ధాన్యం వస్తుందని భావిస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు
కలెక్టర్ పమేలా సత్పతి యాసంగి వరి ధాన్యం కొనుగోలు కోసం అధికారులతో సమావేశం నిర్వహించి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ధాన్యం పరిపక్వానికి వచ్చిన తర్వాతనే కోతలు చేపట్టేలా చూడాలని, ఇందుకు రైతులకు హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసేందుకు యంత్రాలు, గోనె సంచులు, టార్పాలిన్లను అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 7,472 టార్పాలిన్లు అవసరం కాగా 4,955 ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటిని తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్యాడీ క్లీనర్లకు మరో 15 ప్యాడీ క్లీనర్లను కొనుగోలు చేసి తెప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని, 24 గంటలపాటు కొనుగోలు కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని, తేమ యంత్రాలను నీడలో ఉంచేలా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. సన్న ధాన్యం గుర్తించేందుకు ప్రతి నాలుగైదు కేంద్రాలకు ఒక వ్యవసాయాధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ఆ అధికారి గ్రెయిన్ కాలిఫర్‌తో వరి ధాన్యాని కొలిచి సన్న రకాన్ని నిర్ధారిస్తారు. వరి గింజ ఆరు మిల్లీమీటర్ల పొడవు, 2 మిల్లీమీటర్ల వెడల్పు ఉంటేనే సన్నరకంగా గుర్తిస్తారు. సెర్ప్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య జిల్లాలోనూ పెరిగే అవకాశాలున్నాయి.