Share News

విజయోస్తు..!

ABN , Publish Date - Mar 21 , 2025 | 02:57 AM

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు.

విజయోస్తు..!

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. పకడ్భంధీగా విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా శుక్రవారం నుంచి పరీక్షలు నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేశారు. విద్యారంగంలో ఉన్నత చదువులకు విద్యార్థికి తొలిమెట్టుగా పదో తరగతి నిలుస్తుంది. పదవ తరగతిలో విద్యార్థులందరూ మెరుగైన ఫలితాలు పొందే విధంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వార్షిక పరీక్షల కోసం ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను చదివించారు. ఈ సారి గ్రేడింగ్‌లకు బదులు మార్కులనే ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను చదివించింది. ఈ నెల 21న ప్రారంభమయ్యే పరీక్షలు ఒకేషనల్‌, సంస్కృతం పరీక్షలు కలిపి ఏప్రిల్‌ 2వ తేది వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎన్నో ఆశలతో విజయం సాధించాలనే తపనతో పరీక్షలకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలో భద్రపరిచిన పరీక్షపత్రాలను ఆయా మండలాల పోలీస్‌ స్టేషన్లకు పంపించారు. తొలిసారిగా విద్యార్థులకు ఆన్సర్‌ షీట్లు బుక్‌లెట్‌ రూపంలో అందించనున్నారు.

హాజరుకానున్న 6,768 మంది విద్యార్థులు

జిల్లాలో పది పరీక్షలకు 6768 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో బాలురు 3051 మంది, బాలికలు 3717 మంది ఉన్నారు. ఫెయిలైన విద్యార్థులు 14 మంది ఉన్నారు. ఇందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 116 మంది ఉండగా బాలురు 66 మంది, బాలికలు 50 మంది ఉన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 3028 మంది విద్యార్థులు ఉండగా బాలురు 1680 మంది, బాలికలు 1348 మంది, మోడల్‌ స్కూల్‌లో 590 మంది ఉండగా బాలురు 285 మంది, బాలికలు 305 మంది, కేజీబీవీలో 508 మంది బాలికలు చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 1452 మంది విద్యార్థులు ఉండగా బాలురు 791, బాలికలు 661 మంది ఉన్నారు. మైనార్టీ వేల్ఫేర్‌ ఫాఠశాలలో 74 మంది ఉండగా బాలురు 29. బాలికలు 45 మంది ఉన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్‌లో 74 మంది విద్యార్థుల్లో బాలురు ఒకరు, బాలికలు 73 మంది, తెలంగాణ వేల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో 520 మంది ఉండగా బాలురు 78. బాలికలు 442 మంది ఉన్నారు. ట్రైబల్‌ వేల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో బాలికలు 143 మంది ఉన్నారు.

సీసీ కెమెరాల నిఘా

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లుగానే సీసీ కెమెరాలను ఈసారి కూడా కొనసాగిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 35 పరీక్ష కేంద్రాలను రెగ్యులర్‌ విద్యార్థుల కోసం ఒక పరీక్ష కేంద్రం ఒకసారి ఫెయిలైన విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. పరీక్ష నిర్వహాణకు 461 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఇందులో 350 మంది ఇన్విజిలేటర్లు, 35 చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 35 డిపార్ట్‌మెంట్‌ అధికారులు, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ సెంటర్‌కు ఒకరి చోప్పున 35 మందిని నియమించారు, మరో రెండు ప్లయింగ్‌ బృందాలు, 8 మంది రూట్‌ అఫీసర్లతో పాటు పరీక్ష కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలను అత్యవసర వైద్య సేవలకు నియమించారు. ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులు ఎలాంటి టెన్షన్‌ పడకుండా సమయానికి వెళ్లడం మంచిది. విద్యార్థులు 8.30 గంటల వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 9.35 నిముషాల వరకు విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 నిముషాల వరకు పరీక్ష రాసే వీలు కల్పించారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కంపోజిట్‌ కోర్సు సంబంధించి 20 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయించారు. సైన్స్‌ పరీక్షలు రెండు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరగనుంది. పరీక్ష కేంద్రంలోకి అరగంట ముందు నుంచి పంపిస్తారు. 9.30 తరువాత ఐదు నిమిషాల వరకు విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి వెళ్లడానికి ఆవకాశం కల్పించారు.

టైం టేబుల్‌ ఇలా....

21న మొదటి లాంగ్వేజ్‌ పరీక్ష తెలుగు, 22న రెండవ లాంగ్వేజ్‌ పరీక్ష హిందీ, 24న ఇంగ్లీష్‌, 26న మ్యాథ్స్‌, 28న సైన్స్‌ (పిజికల్‌సైన్స్‌) 29న సైన్స్‌ (బయోలజీకల్‌ సైన్స్‌), ఏప్రిల్‌ 2న సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు...

పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్‌లో 9441440849 ఫోన్‌నంబరుతో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షలకు సంబంధించిన సందేహాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

- విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల యూనిఫాం వేసుకోకూడదు

- ఓఎంఆర్‌ షీట్‌ తమదని ధ్రువీకరించుకున్న తర్వాత పరీక్షలు రాయాలి

- హాల్‌టికేట్‌ నెంబర్‌ వేయవద్దు

- సెల్‌ఫోన్లు, క్యాలికులేటర్లు వంటి ఎలక్ర్టానిక్‌ వస్తువులు తీసుకవెళ్లవద్దు

- పరీక్ష కేంద్రానికి ఎలాంటి కాగితాలు, జిరాక్స్‌ పేపర్లు తీసుకవెళ్లవద్దు

- పరీక్షకు ఐదు నిముషాల ఆలస్యం మాత్రమే సడలింపు ఉంటుంది. 9.30కి పరీక్ష ప్రారంభం కానుంది. ఆ ప్రకారం 9.35 నిముషాలకు మాత్రమే అనుమతి ఇస్తారు.

- పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత 15 నిమిషాలు బార్‌ కోడ్‌ షీట్‌, ఆన్సర్‌ షీట్‌ ఎలా నింపాలో ఇన్విజిలేటర్‌ ద్వారా తెలుసుకోవాలి.

- ఎలాంటి గుర్తింపు వివరాలకు ఆన్సర్‌ షీట్‌లపై రాయవద్దు

Updated Date - Mar 21 , 2025 | 02:57 AM