Kishan Reddy: స్థాయికి మించి రేవంత్ మాటలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:41 AM
ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ కులంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ప్రధాని మోదీ కులంపై అవాస్తవాలు
హామీలను నెరవేర్చే శక్తి కాంగ్రె్‌సకు లేదు : కిషన్‌రెడ్డి
నల్లగొండటౌన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ కులంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 1994లో గుజరాత్‌లో కాంగ్రెస్ హయాంలోనే మోదీ కులాన్ని బీసీల్లో కలిపారని చెప్పారు. నల్లగొండ బీజేపీ కార్యాలయంలో శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ కంటే కాంగ్రె్‌సపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పదేళ్లకు వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ సర్కారు, రేవంత్‌రెడ్డి పాలనపై ఏడాదికే వ్యతిరేకత మొదలైందని చెప్పారు.
రేవంత్‌రెడ్డి నిత్యం అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, అందుకే ఏడాదిలోపే అపఖ్యాతి మూట గట్టుకున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుకావడం లేదని, వాటిని అమలు చేసే స్తోమత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. గతంలో ఎమ్మెల్సీలుగా గెలిచిన వారంతా మూకుమ్మడిగా అధికార బీఆర్‌ఎ్‌సలో చేరడంతో ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పక్షాన మాట్లాడే వారు కరువయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాది పూర్తయిందని.. అసలు అది ఎటు పోయిందని నిలదీశారు. బీసీ సంఘాల డిమాండ్‌కు తాము అండగా ఉన్నామని పేర్కొన్నారు.