Share News

వైద్యులు సమయపాలన పాటించాల్సిందే

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:04 PM

కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణపేట జిల్లా సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ మంగళవారం తనిఖీ చేశారు.

వైద్యులు సమయపాలన పాటించాల్సిందే

- కోస్గి ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీలో సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

కోస్గి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కోస్గి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని నారాయణపేట జిల్లా సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ మంగళవారం తనిఖీ చేశారు. ‘వైద్యులు రారే(ఏ)రీ..?’ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంపై రోగుల మండిపాటు’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తా కథనానికి ఆయన స్పందించారు. ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులుండి కూడా అందుబాటులో ఉండకుంటే ఎలా అని వైద్యులపై మండిపడ్డారు. నేటి నుంచి ప్రతీరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యులందరూ అందుబాటులో ఉండాలని, 12 గంటల తర్వాత ఎవరో ఒకరు విధుల్లో ఉండాలన్నారు. సూపరింటెండెంట్‌ సైతం ఏదో ఒకరోజు డ్యూటీ చేయాలని సూచించారు. ఏదేమైనా విధి నిర్వహణలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు.

ముగ్గురు వైద్యులు రాజీనామాకు సిద్ధపడ్డారా..?

ప్రస్తుతం సూపరింటెండెంట్‌తో కలుపుకొని ఆరుగురు వైద్యులు కోస్గి ఆసుపత్రిలో పని చేస్తున్నారు. అందులో ఐదుగురూ కాంట్రాక్ట్‌ వైద్యులే. అయితే వైద్యుల మధ్య సఖ్యత లేకపోవడంతో అందులో ముగ్గురు రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం.

Updated Date - Mar 18 , 2025 | 11:04 PM