Share News

అభివృద్ధికి దూరంగా ఆవాస గ్రామం

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:13 AM

మండలంలోని చాడ మదిర గ్రామం గడ్డగొల్లబావి అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి.

అభివృద్ధికి దూరంగా ఆవాస గ్రామం
రోడ్డుపై పారుతున్న మురుగు నీరు

మోటకొండూరు, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చాడ మదిర గ్రామం గడ్డగొల్లబావి అభివృద్ధికి దూరంగా ఉంది. గ్రామంలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. ఆ గ్రామంలో 50 కుటుంబాలు, 300మంది జనాభా ఉంది. గ్రామానికి రోడు,్డ రవాణ, మంచి నీరు వంటి కనీస వసతులు లేక పోవడంతో గ్రామస్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీల్లో అండర్‌ డ్రైనేజీ నిర్మించకపోవడంతో రోడ్లపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఈగలు, దోమలు ఇళ్లలోకి వస్తుండడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఉదయం పాల సరఫరా నుంచి.. ఏ చిన్న పనికైనా మోటకొండూరుకు వెళ్లాల్సిందే. విద్యార్థులు పాఠశాలకు వేళ్లాలంటే చాడ గ్రామానికి నాలుగు కిలోమీటర్లు, మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. గ్రామంలో కనీసం వాటర్‌ ఫిల్టర్‌ కూడా లేదు. మంచి నీరు, రేషన సరుకులు, పిఛన్ల కోసం పక్క గ్రామం చాడకు వెళ్లాలంటే వృద్ధులు, దివ్యాంగులు నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి రావాలంటే నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గ్రామానికి ఆటో, బస్సు సౌకర్యం లేకపోవడంతో పిల్లలు, గర్భిణులు, వృద్ధుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. రాత్రి వేళల్లో, అత్యవసర సమయల్లో ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని ద్విచక్ర వాహనాలపై నాలుగు కిలోమీటర్లు పరుగులు పెట్టాల్సిందే. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వాగ్ధానాలు ఇచ్చి వారి పబ్బం గడుపుకుని మళ్లీ తిరిగి గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడంలేదంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా గ్రా మంపై చిన్న చూపు చుస్తున్నారని వాపోతున్నారు. రోడ్డు, రవాణ, విద్యుత, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక వసతుల కోసం..

గ్రామంలో వీధిలైట్లు, అండర్‌ డ్రైనేజీ, సీసీరోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపిస్తున్నా రు. రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. పాలకులు, అధికారులు గ్రామ సమస్యలను పరిష్కరించి కనీస వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు.

రోడ్డు రవాణా సౌకర్యం కల్పించరూ..

గడ్డగొల్లబావి నుంచి నిత్యావసరాల కోసం మండల కేంద్రానికి రావాలంటే రోడ్డు సరిగా లేకపోవడంతో పాటు గుంతల మయంగా మరడంతో ప్రయా ణం నరకప్రాయంగా మారింది. మోకాళ్ల లోతుగా గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికైన అధికారులు స్పందించి రోడ్డు, రవాణ సౌకర్యం కల్పించాలి.

-బెజ్జంకి అంజిరెడ్డి, గడ్డగొల్లబావి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

మండలంలోని చాడ మధిర గ్రామం గడ్డగొల్ల బావిలో నెలకొన్న సమస్యలు వాస్తవమే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించి, సమస్యలను పరిష్కరిస్తాం. ముఖ్యం గా వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా నెలలో ఒక రోజు గడ్డగొల్లబావిలోనే పింఛన ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం.

-ఇందిరా, ఎంపీడీవో, మోటకొండూరు

Updated Date - Apr 01 , 2025 | 01:13 AM