డీసీసీబీకి కాసుల వర్షం
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:39 AM
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోంది. 103 ఏళ్ల బ్యాంకు చరిత్ర లో ఇప్పటి వరకు కేవలం రూ.900కోట్ల టర్నోవర్ ఉండ గా, ప్రస్తుతం రూ.2,850కోట్లకు పైగా టర్నోవర్‌కు చేరుకుంది.

రికార్డు స్థాయిలో లాభాలు
రాష్ట్రంలో రెండో స్థానం
రూ.2850కోట్లకు పైగా టర్నోవర్
ఎన్‌పీఏ 1.85శాతం నుంచి 1.38శాతానికి తగ్గుదల
పెరిగిన పంట, బంగారంపై రుణాలు, డిపాజిట్లు
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోంది. 103 ఏళ్ల బ్యాంకు చరిత్ర లో ఇప్పటి వరకు కేవలం రూ.900కోట్ల టర్నోవర్ ఉండ గా, ప్రస్తుతం రూ.2,850కోట్లకు పైగా టర్నోవర్‌కు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.2,300 కోట్ల టర్నోవర్ ఉండగా, ప్రస్తుతం అదనంగా రూ.550. 81కోట్ల టర్నోవర్ సాధించింది. మరో రూ.150 కోట్లు సాధిస్తే రూ.3వేల కోట్ల టర్నోవర్‌తో మరింత లాభాల బాటలో పయనించే అవకాశం ఉంది.
డీసీసీబీలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆడి ట్ ప్రకారం నికర లాభం రూ.42.31కోట్లు సాధించింది. 2023-24లో రూ.31కోట్లు లాభం ఉండ గా,అదనంగా రూ.12.31కోట్లు లాభాలు సా ధించింది. పాలకవర్గం ఎంసీ (మేనేజింగ్ కమిటీ) మీటింగ్‌లతో పాటు మహాజన సభలను నిర్వహిస్తూ అటూ సొసైటీ చైర్మ న్లు, బ్యాంకుల సీఈవోలు, అధికారులు, ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ డీసీసీబీ లాభాల బాటలో ముందుకెళ్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీబీ పరిధి లో మొత్తం 107 సొసైటీలు ఉన్నాయి. రైతులకు రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడంతో పాటు రికవరీ కూడా అంతే వేగంగా చేస్తున్నా రు.వాణిజ్య బ్యాంకుల కంటే అధికంగా రుణాలు మంజూరు చేశారు.బంగారంపై రుణాలు ఈ ఆర్థి క సంవత్సరంలో రూ.328.35కోట్ల నుంచి రూ.623. 91కోట్లకు పెరిగింది. అంటే అదనంగా రూ.295.56 కోట్ల మేర రుణాలు మంజూరు చేశారు. కొన్నేళ్ల క్రితం రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ స్థానం చివరి నుంచి రెండోదిగా ఉండగా, ప్రస్తుతం పైనుంచి రెండో స్థానానికి చేరింది. దీంతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రంతో పాటు ఆర్‌బీఐ వద్ద గుర్తింపు లభించింది.
పెరగనున్న కొత్త బ్రాంచ్‌లు, సొసైటీలు
ఉమ్మడి జిల్లాలో బ్రాంచ్‌ల సంఖ్య పెంచనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో డీసీసీబీకి 36బ్రాంచ్‌లు ఉండగా, అదనంగా మరో ఐదు బ్రాంచ్‌లను త్వరలో ప్రారంభించనున్నారు.దీనికి తోడు మరో ఐదు బ్రాంచ్‌లను ప్రతిపాదిస్తూ డీసీసీబీ అధికారులు ఆర్‌బీఐకి నివేదిక సమర్పించారు. గత ఆర్థిక సంవత్సరంలో తిప్పర్తి, ఆత్మకూర్, గరిడేపల్లి, నారాయణపూ ర్,దామరచర్లలో బ్రాంచ్‌ల ఏర్పాటుకు ఆర్‌బీఐ నుంచి అనుమతి లభించింది. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిర్యాలగూడ-2, శాలిగౌరారం, పెద్దవూర, మోతె, చిలుకూరు, నాంపల్లిలో ఆరు కొత్త బ్రాంచ్‌ల కోసం ఆర్‌బీఐ అనుమతి కోసం పంపించారు. ఇప్పటికే 107 సొసైటీలు ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 నుంచి 60 కొత్త సొసైటీలు ఏర్పాటు చేసి రైతులకు మరింత చేరువ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా గొర్రెలు, నాటుకోళ్ల పెంపకానికి ఎన్‌ఎల్‌ఎం స్కీం ప్రారంభించడంతో పాటు గోదాముల నిర్మాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు పెంచ డం,ఎరువుల అమ్మకం ద్వారా సొసైటీలను బలోపేతానికి కృషి చేస్తున్నారు.
1.38 శాతానికి తగ్గిన నిరర్థక ఆస్తులు
2023-2024లో 1.85శాతంగా ఉన్న ఎన్‌పీఏ(నిరర్థక ఆస్తులు) ప్రస్తుతం 1.38శాతానికి చేరడంతో బ్యాంకు లాభాలు గడించింది. బ్రాంచ్ విస్తరణతో పాటు సొసైటీల బలోపేతం, ఆధునికీకరణ తో రైతులకు సేవలను విస్తరించడంతో బ్యాంకు పురోగతికి చేరుకుంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, రైతులకు సత్వరమే సేవలు అందించడం, వాణి జ్య బాంకులకు దీటుగా రుణాలు అందిస్తుండటంతో లాభాలు పెరిగాయి. రానున్న రోజుల్లో స్వలకాలిక, దీర్ఘకాలిక, బంగారం, విద్య, వ్యక్తిగత రుణాలను పెంచే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతుల్లో సైతం అవగాహన పెరిగింది. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లిస్తున్నారు. వడ్డీ భారం పడకముందే రుణాలు తిరిగి చెల్లించి రెన్యూవల్ చేసుకుంటున్నారు. దాదాపు 95శాతం మేర రైతులు సకాలంలోనే రుణాల చెల్లింపు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు రాకముందే రైతులే స్వయంగా వచ్చి రుణాలు చెల్లించి అవసరమైనంతా తిరిగి రుణం తీసుకునేలా రెన్యూవల్ చేసుకుంటున్నారు. దీనికి తోడు మార్ట్‌గేజ్ రుణాలు అంటే భూములను తనఖా పెట్టి రుణాలు పొందుతున్న వారి సంఖ్య పెరిగింది. వారందరికీ ప్రోత్సాహకాలు కల్పిస్తూ సకాలంలో రుణాలు చెల్లించేలా చూస్తుండటంతో డీపాల్టర్ల సంఖ్య కూడా తగ్గింది.
బ్యాంక్ అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం కృషి: - కుంభం శ్రీనివా్‌సరెడ్డి, డీసీసీబీ చైర్మన్
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎ్‌సలు, బ్రాంచ్‌లు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లు లాభాల బాటలో తీసుకెళ్లేలా పాలకవర్గం కృషి చేస్తోందని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లాభాల బాటలో పయనించిన సందర్భంగా బుధవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సీఈవో శంకర్‌రావు, డైరెక్టర్లు పాశం సంపత్ రెడ్డి, గుడిపాటి సైదులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 103 ఏళ్లలో లేని అభివృద్ధిని తమ పాలకవర్గం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. ఏటా నిర్వహిస్తున్న ఆడిట్ ద్వారా డీసీసీబీ పెద్ద ఎత్తున అఽభివృద్ధికి చేరుకుందనే విషయం స్పష్టమైందన్నారు. ప్రస్తుత పాలకవర్గం బాధ్యతలు చేపట్టాక రూ.2,850కోట్లకు పైగా బ్యాంక్ టర్నోవర్ చేరుకోవడంతో డీసీసీబీకి రాష్ట్ర స్థాయిలో రెండో స్థా నం లభించిందన్నారు. త్వరలో మరో రెండు నెలల్లో రూ.3వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటామని, డిపాజిట్లను పెంచుకోవడం, బంగారం రుణాలను, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను రైతులకు అందించడం తో పాటు రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గం ప్రణాళికాబద్ధం గా ముందుకెళ్తోందన్నారు. డీసీసీబీ బ్యాంకు అభివృద్ధికి సహకరించిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.