Share News

ప్రాణం తీసిన ఈత సరదా

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:50 PM

ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ విద్యార్థికి ఈత రాకపోవడంతో కాల్వఒడ్డుపై కూర్చుని ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడి మృతిచెందాడు.

ప్రాణం తీసిన ఈత సరదా

స్నేహితులతో కలిసి కాల్వలో ఈతకెళ్లిన విద్యార్థి

ఒడ్డుపై కూర్చుని జారుతూ నీళ్లలో పడి గల్లంతైన వైనం

నల్లగొండ క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. స్నేహితులతో కలిసి వెళ్లిన ఆ విద్యార్థికి ఈత రాకపోవడంతో కాల్వఒడ్డుపై కూర్చుని ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడి మృతిచెందాడు. మంగళవారం నల్లగొండ జిల్లా నల్లగొండ మండల పరిధిలో ఈ సంఘటన జరిగింది. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం గ్రామానికి చెందిన పోతుగంటి ఉదయ్‌కుమార్‌(20) నల్లగొండలో హాస్టల్‌లో ఉంటూ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఆరుగురు స్నేహితులతో కలిసి మండల పరిధిలోని దండెంపల్లిలో ఉన్న ఏఎంఆర్‌పీ కాల్వ వద్ద ఈతకు వెళ్లాడు. విద్యార్థుల్లో ముగ్గురికి ఈత రాగా, మరో ముగ్గురికి ఈత రాదు. ముగ్గురూ ఈత కొడుతున్న క్రమంలో ఇద్దరితో కలిసి ఉదయ్‌కుమార్‌ కాలువ ఒడ్డుపై కూర్చున్నాడు. విద్యార్థులు కాల్వలో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈత కొడుతూ వెళ్లారు. ఈ సమయంలో ఉదయ్‌కుమార్‌ కాల్వలో క్రమంగా జారుతూ నీళ్లలో మునిగిపోయాడు. కాల్వలో లోతు ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. తోటి విద్యార్థులు కేకలు వేయంతో పొలాల వద్ద ఉన్న వారు వచ్చి చూసి పోలీసులకు సమచారం ఇచ్చారు. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ సైదాబాబు సిబ్బందితో కలిసి ఫైర్‌, మత్యశాఖ అధికారులు, సిబ్బంది సహకారంతో ఉదయ్‌ మృతదేహాన్ని కాల్వ నుంచి బయటికి తీశారు. ఉదయ్‌కుమార్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సైదాబాబు తెలిపారు.

Updated Date - Mar 25 , 2025 | 11:50 PM