Share News

నెలాఖరులోగా ‘భరోసా’ పూర్తయ్యేనా?

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:08 AM

ర్రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాను నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో జమ చేస్తామని పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నెలాఖరులోగా ‘భరోసా’ పూర్తయ్యేనా?

ఎదురు చూస్తున్న రైతులు

సీజన్‌ గడిచిపోతున్నా పూర్తిస్థాయిలో అందని పెట్టుబడి సాయం

ఉమ్మడి నల్గగొండ జిల్లాలో 11లక్షల మందికి పైగా రైతులు

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ) : ర్రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాను నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలో జమ చేస్తామని పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రైతు భరోసాను ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న లాంఛనంగా ప్రారంభిం చింది. ఈ రోజున పైలెట్‌ ప్రాజెక్టుగా మండలానికో గ్రామం చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 73 గ్రామాలను ఎంపిక చేసి నూరుశాతం రైతుభరోసాను అమలు చేసింది. ఆ తరువాత కొందరి రైతులకే రైతుభరోసా అందింది.

గతంలో 11సార్లు..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతి రైతుకు ఎంత భూమి ఉన్నా 11సార్లు రైతుబంధును అమలు చేసింది. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సుమారు ప్రతీ సీజన్‌లో రూ.1,450కోట్లకు పైగా రైతుబంధు వచ్చేది. ప్రస్తుతం 11లక్షల మందికి పైగా రైతులకు గతం మాదిరిగా ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏటా రెండు సీజన్లకు రూ.12వేలు చెల్లిస్తే ప్రభుత్వంపై మరింత భారం పడే అవకా శం ఉంది. ఈ పరిస్థితుల్లో తక్కువ భూమికే రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా? ఇప్పటికే చెప్పిన విధంగా సేద్యం చేస్తున్న భూమి అంతంటికీ రైతుభరోసా కల్పిస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.

రాష్ట్ర ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన, ఉమ్మడి జిల్లాలోని 73 గ్రామాల్లో, ఎంత సాగు భూమి ఉన్నా పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయాన్ని చెల్లించింది. అనంతరం మూడు ఎకరాల వరకు రైతుభరోసా నగదును రైతుల ఖాతాల్లో జమచేసింది. ఆ తరువాత ఎన్ని ఎకరాలకు రైతుభరోసా ఇస్తామనే దానిపై ప్రభు త్వం స్పష్టత ఇవ్వకుండా గందరగోళంలో పడేసింది. చివరికి సాగులో ఎంత భూమి ఉన్నా రైతుభరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన నగదు చెల్లించకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, రోడ్లకు, ఇటుక బట్టీల స్థలాలకు, వెంచర్ల స్థలాలకు రైతుబంధు పేరుతో డబ్బును వృ థా చేసిందని నాడు కాంగ్రెస్‌ ఆరోపించింది.

అభిప్రాయాలు సేకరించినా..

గత పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ అమలు చేసిన రైతుబంఽధును కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేసింది. అయితే ఆ తరువాత ప్రభుత్వం రైతుభరోసాపై రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఎన్ని ఎకరాలకు రైతుభరో సా ఇవ్వాలనే దానిపై అభిప్రాయం సేకరించిన ప్రభు త్వం దాన్ని ఆటకెక్కించింది. అభిప్రాయాలపై అసెంబ్లీ లో చర్చ పెట్టి అమలు చేస్తామని ప్రకటించిన ప్రభు త్వం దీనిపై అసెంబ్లీలో చర్చను సైతం పక్కన పెట్టిం ది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ప్రభుత్వం జనవరి 26న రైతుభరోసా ప్రక్రియను ప్రారంభించినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. దీంతో వ్యవసాయ సీజన్‌లో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక కొత్తగా పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులకు కూడా రైతుభరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారు దరఖాస్తులు చేసుకున్నారు. వారితో పాటు పాస్‌పుస్తకాల్లో చేర్పులు, మార్పులు చేసుకున్న వారికి ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాలు ఉన్న రైతులకు కూడా పెట్టుడిసాయం అందలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి రూ.24వేల కోట్లకు పైగా కేటాయించింది. అందులో రూ.18వేల కోట్లను రైతుభరోసాకే కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం ఈ నెలఖరులోగా ఐదెకరా ల వరకు రైతుభరోసా ఇస్తామని పేర్కొన్నా, అవి వస్తాయా? లేదా అనే సందేహం నెలకొంది.

ఉమ్మడి జిల్లాలో 11లక్షల మందికి పైగా రైతులు...

ఉమ్మడి నల్లగొండ జిల్లా లో సుమారు 11లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. అందులో నల్లగొండ జిల్లాలో 5.50 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 3.50లక్షల మంది, యాదాద్రి జిల్లాలో 2.10లక్షల మందికిపైగా రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21లక్షల ఎకరాల వరకు సాగు భూమి ఉంది. వరుసగా వ్యవసాయ సీజన్లు ముగుస్తున్నా ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయం అందించలేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉన్నా ఎకరానికి రూ.5వేల చొప్పున రైతుబంధు కింద వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమచేసింది. అయితే కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.7500 చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించి మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఎకరానికి రూ.6వేల జమచేసింది.

రెండు సీజన్లు ముగిసినా..

యాసంగి సీజన్‌ ముగుస్తుండగా గత వానాకాలంతో పాటు ప్రస్తుత యాసంగి, మొత్తం రెండు సీజన్లకు కలిపి పెట్టుబడి సాయం ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం కోసం రైతులు ఎదురుచూపు చూస్తున్నారు. పంటల సాగుకు చేతిలో డబ్బు లేక రైతులు అప్పులు చేస్తున్నారు. ఎకరానికి రూ.25వేల చొప్పున పెట్టుబడులు వస్తోంది. పంట పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి డబ్బు తెచ్చి రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కాంగ్రెస్‌ ఎకరాకు రూ.7,500 ఒక్కో సీజన్‌కు ఇస్తామని ప్రకటించడంతో ఎంతో ఆశాపడగా, తీరా ప్రభుత్వం ఎకరానికి రూ.6వేలు ఇచ్చేందుకు నిర్ణయించడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నెలాఖరులోనైనా రైతుభరోసాపై నిర్ణయం తీసుకుంటారా? లేక వాయిదా వేస్తారా? అని రైతులు ఆందోళనలో ఉన్నారు. వాస్తవానికి గత వానాకాలంలోనే జూన్‌ నెలాఖరులోగా రైతుభరోసా రావాల్సి ఉంది. ప్రస్తుత యాసంగి సీజన్‌ ముగుస్తున్నా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు పాలుపోవడంలేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఈ నెలాఖరులోగా రైతుభరోసాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

నెలాఖరులోగా మరో రూ.230కోట్లు: పి.శ్రవణ్‌ కుమార్‌, జేడీఏ నల్లగొండ

ఇప్పటికే మూడు ఎకరాలున్న రైతులందరికీ రైతుభరోసా నిధులను వారి ఖాతాలో జమయ్యాయి. నెలాఖరులోగా ప్రతీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసాను అమలు చేయనుంది. ప్రతీ రైతుకు పెట్టుబడిసాయం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. వ్యవసాయశాఖ పూర్తి స్థాయి డాటాను ప్రభుత్వానికి అందజేసింది. నెలాఖరు వరకు లక్షమంది రైతులకు మరో రూ.230కోట్ల మేర జమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 26 , 2025 | 12:08 AM