ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 12:55 AM
యాసంగిలో రైతులు పండించిన వరి కోత దశకు చేరింది. మరో రెండు మూడు వారాల్లో జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకోనున్నాయి. ధాన్యం కొనుగోలు చేసేందుకు సేకరణ కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.

జిల్లాలో 2,98,912 ఎకరాల్లో సాగు
5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
దాదాపు 4.50 లక్షలకుపైగా టన్నుల కొనుగోలు లక్ష్యం
(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): యాసంగిలో రైతులు పండించిన వరి కోత దశకు చేరింది. మరో రెండు మూడు వారాల్లో జిల్లావ్యాప్తంగా వరికోతలు ఊపందుకోనున్నాయి. ధాన్యం కొనుగోలు చేసేందుకు సేకరణ కేంద్రాలు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి కోత దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ రెండో వారంలోగా చేతికొచ్చే అవకాశం ఉంది.
జిల్లాలో ప్రస్తుతానికి మూసీ పరివాహక ప్రాం తాల్లో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కల్లాల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కల్లాల్లోకి ధాన్యం వచ్చే పరిస్థితిని బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మొదటి విడత కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో యాసంగిలో 2,98,912 ఎకరాల్లో సాగు చేశారు. 5లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో దాదాపు 370కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 230 కేంద్రాలు, ఐకేపీ 122, వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి నాలుగు కేంద్రాల్లో కొనుగోలు చేయనున్నారు. అన్ని కేంద్రాలకు సరిపడా గోనె సంచులు, టార్పాలిన్లు, వరిని కొలిచే కాంటాలు, వరి తేమ ను చూసే పరికరాలను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి రైతుల వద్ద దాదాపు 4.50లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉంది. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే జిల్లాలో సన్న వరి సాగును రైతులు సాగు చేయలేదు. వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వేలో తేలడంతో, జిల్లాలో ఎవరైనా సాగుచేసిన పక్షంలో సాధారణ రకం ధాన్యం కేంద్రాల్లోనే సన్న ధాన్యం కేంద్రాల ను ఏర్పాటు చేయనున్నారు.
గోదాములు, మిల్లుల్లో ధాన్యం నిల్వకు చర్యలు
యాసంగిలో పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు గోదాములు రైస్ మిల్లుల్లో సరిపడా స్థలం ఉండటంతో రవాణా సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ధాన్యం నిల్వ చేసేందుకు పౌరసరఫరాల శాఖకు చెందిన ఐదు గోదాముల్లో 38,000 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌సీఐ గోదాముల్లో 1,25,000 మెట్రిక్ టన్నులు, ఐదు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 7,800 మెట్రిక్ టన్నులు, 40 రైస్ మిల్లుల్లోనూ లక్షకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసే సామర్థ్యం ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు, రైస్‌మిల్లులకు, గోదాములకు తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అకాల వర్షాలు వచ్చిన పక్షంలో ధాన్యం తడిసే అవకాశం ఉన్నందున, గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ధాన్యం సేకరణ వీలైనంతా వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.
ధాన్యం సేకరణకు సన్నాహాలు చేస్తున్నాం : పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ హరికృష్ణ
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జిల్లాలో మొత్తం 370 వరకు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఈ మేరకు అన్ని శాఖల అధికారుతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలు చోట్ల వరికోతలు ఏప్రిల్‌లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నాం. మొదటి విడతగా పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంచేసింది. కేంద్రాలకు గోనె సంచులు, వరి కొలిచే యంత్రాలు, తేమ పరికరాలను పంపిణీ చేయనున్నాం. కొనుగోళ్లపై సిబ్బందికి అవగాహన కల్పించాం. జిల్లాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.