సౌకర్యంగా నిత్యాన్నదానం
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:29 AM
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో అసంపూర్తిగా నిలిచిన పనులకు ఒక్కొక్కటిగా మోక్షం కలుగుతోంది. గుట్టలో పెండింగ్ పనుల పూర్తికి సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉండటంతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి అసంపూర్తి పనులపై దృష్టి సారించారు.

త్వరలో అన్నదాన సత్ర భవనం ప్రారంభం
సుమారు రూ.20లక్షల వ్యయం
రెండు ప్రభుత్వశాఖలు, దాత భాగస్వామ్యంతో నిర్మాణం
ఒకేసారి 2వేల మంది భక్తులకు భోజన సౌకర్యం
15 ఎకరాల స్థలం వేద పాఠశాలకు కేటాయింపు
రూ.8కోట్లతో భవనం నిర్మించేందుకు నిధులు విడుదల
(ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట) : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి సన్నిధిలో అసంపూర్తిగా నిలిచిన పనులకు ఒక్కొక్కటిగా మోక్షం కలుగుతోంది. గుట్టలో పెండింగ్ పనుల పూర్తికి సీఎం రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉండటంతో, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి అసంపూర్తి పనులపై దృష్టి సారించారు. తొలుత అన్నదాన సత్రం, వేద పాఠశాలతో పాటు పలు సివిల్ పనులు పూర్తి చేయనున్నారు.
నృసింహుడి క్షేత్రంలో పెండింగ్ పనులపై పూర్తిస్థాయి నివేదికను వైటీడీఏ అధికారులు ఇ ప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.70 నుంచి 80శాతం పూర్తయిన పనులపై సీఎం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వీటిని తొలుత పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్నదా న సత్ర భవన నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, మౌలిక వసతులు కల్పించాల్సి ఉండటంతో అధికారులు ఈ భవన ప్రారంభంపై దృష్టిసారించా రు. దీంతోపాటు క్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సిటీలో వేద పాఠశాల భవనానికి కేటాయించిన 15 ఎకరాల్లో సుమారు రూ.8కోట్లతో భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రెండింటికీ ఒకేసారి
యాదగిరి క్షేత్రంలో భక్తులకు నిత్యాన్నదానం బృహత్ కార్యంలా సాగుతోంది. స్వయంభువు దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన సత్రం ప్రారంభించగా, తొలుత 200 మందితో ఆ తర్వా త 500 మందికి చేరింది. కాలక్రమేణా భక్తుల రాక గణనీయంగా పెరగడంతో నిత్యాన్నదానా న్ని మరింత విస్తృత పరిచారు. ఆ తర్వాత వార్షి క బ్రహ్మోత్సవాల సందర్భంగా 1,000 నుంచి 1,500 మంది భక్తులకు భోజన సదుపాయం కల్పించారు. ప్రస్తుతం గండిచెరువు సమీపంలో అరకొర సౌకర్యాల నడుమ దీక్షాపరుల మండపంలో నేలపైనే భక్తులు భోజనం చేస్తున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అదే పరిసరాల్లో నూతన అన్నదాన సత్ర భవనం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఈ భవనాన్ని వైటీడీఏ అధికారులు ప్రారంభించనున్నారు. అదేవిధంగా వేద పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహిస్తామనిఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.
15 ఎకరాల్లో వేద పాఠశాల
కొండకింద వేద పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అరకొర వసతుల నడుమ ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది, విద్యార్థుల కష్టాలు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాన్ని పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. విశాలమైన, అన్ని వసతులు కలిగిన భవనంలో పాఠశాల కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రానికి అభిముఖంగా ఉన్న పెద్దగుట్టపై టెంపుల్ సీటీలో వైటీడీఏ అధికారులు 15 ఎకరాలు కేటాయించగా, సుమారు రూ.8 కోట్లతో భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అత్యాధునిక హంగులతో భవనం నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.
రూ.20కోట్లతో ఆధునిక అన్నసత్రం
హరేరామ హరే కృష్ణ, ఇస్కాన్ వంటి ఆధ్యాత్మిక సంస్థలతో చేసిన సంప్రదింపుల ప్రకారం కొండ కింద ప్రత్యేక ప్రణాళికతో గండిచెరువు సమీపంలో వైటీడీఏ అన్నసత్రం భవనానికి డిజైన్ రూపొందించింది. ఆరు ఎకరాల్లో సుమారు రూ.20కోట్లతో ఆధునిక అన్నప్రసాద భవనం నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావ రి జిల్లా గణపవరం గ్రామానికి చెందిన వేగేశ్న అనంతర కోటీ రాజు ఈ సత్రానికి రూ.14కోట్లు విరాళంగా ఇచ్చారు. మిగత పనులకు కావాల్సిన నగదును వైటీడీఏ (భవనం పునాదులు), దేవస్థానం (గ్యాస్‌స్టౌవ్, పైపులైన్, బాయిలర్లు, ఇత ర సామగ్రి) భాగస్వామ్యంతో అన్నదాన సత్ర భవన నిర్మాణం పూర్తిచేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వంట పరికరాలు, పాత్రలు శుభ్రం చేసే యంత్రాల సేకరణ పూర్తయింది. ముందుగా యాదగిరిగుట్ట స్వర్ణ దివ్య విమాన రాజగోపుర మహాకుంభాభిషేక మహోత్సవం (2025 ఫిబ్రవరి 23న), తిరిగి మార్చి 1వ తేదీ నుంచి జరిగిన వార్షిక బహ్మోత్సవాల నాటికే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి అనుకున్నా వాయిదా పడుతూ వచ్చింది. దాత సమయం ఇవ్వకపోవడంతో ప్రారంభం వాయిదా పడింది. ప్రస్తుత వేసవిలో భక్తుల ఇబ్బందులు తప్పించేందుకు సత్రం ప్రారంభానికి ఆలయ వర్గాలు యోచించాయి. దాత వస్తున్నట్లు సమాచారం అందడంతో మరో 10 రోజుల్లో సత్రం భవనాన్ని ప్రారంభించి నిత్యం 2వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు.
1987 నుంచి అన్నదానం ప్రారంభం
యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో పూర్వకాలం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అన్న సదుపాయం కల్పించేవారు. దేవస్థానం నిధులతో రామానుజ కూటంలో పూజా విధులు నిర్వహించే అర్చకులకు, బ్రాహ్మణ సత్రంలో స్వామిని దర్శించుకునే బ్రాహ్మణలు, ఇతర ప్రముఖులకు అన్నపానియాల సదుపాయం సమకూర్చేవారు. బ్రహ్మోత్సవాలు, ఇతర విశేష వేడుకల్లో మాత్రం కొండపైగల శ్రీరామ్ భవన్‌లో భక్తులకు భోజన సదుపాయం కల్పించేవారు. కాలక్రమేణ భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అన్నప్రసాదానికి ఆదరణ కూడా అదేస్థాయిలో అధికమవడంతో 1987లో శాశ్వత అన్నదాన పథకానికి విరాళాల సేకరణ ప్రారంభించి అప్పటి ఈవో బి.సుబ్బారావు శ్రీకారం చుట్టారు. అన్నదానంకోసం రూ.516నుంచి ఆపైన విరాళాలు అందజేసిన భక్తుల గోత్రనామాలపై అర్చనలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. తొలుత కొండపై రోజుకు 200 మంది, ఆ తర్వాత 500 మంది, ప్రతీ శని, ఆదివారాలు, ఇతర పర్వదినాలు, విశేష రోజుల్లో 1000 నుంచి 1500 మంది వరకు భోజన సదుపాయం కల్పించేవారు. ప్రస్తుతం రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఇప్పుడు జన్మదినం, వివాహ వార్షికోత్సవం వంటి శుభ కార్యక్రమాల సందర్భంగా అన్నదాన పథకంలో చేరిన భక్తుల గోత్రనామార్చనలు నిర్వహించే విధంగా మార్పులు చేశారు.
అన్నదాన పథకానికి రూ.25.37 కోట్ల నిధి
భక్తుల విరాళాలతో ప్రారంభించిన అన్నదాన పథకానికి అనతికాలంలోనే విశేష ఆదరణ లభించింది. కొండపై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించడమేకాక ఇతర భక్తులకు అన్నసదుపాయం కల్పించేందుకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. అందులో భాగంగానే అన్నదానం కోసం భక్తుల నుంచి వచ్చిన విరాళాలు రూ.25.37కోట్లు సమకూరాయి. ఈ నిధిని బ్యాంకులో డిపాజిట్ చేయగా వచ్చిన వడ్డీతో భక్తులకు అన్నప్రసాద వితరణ అందిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో ప్రారంభిస్తాం : ఏపూరి భాస్కర్‌రావు, ఈవో, యాదగిరిగుట్ట, దేవస్థానం
నిత్యాన్నదాన భవనం ప్రారంభానికి అంతా సిద్ధం చేశాం. భవన నిర్మాణ దాత కూడా అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం. భవనం అందుబాటులోకి వస్తే నిత్యం రెండు వేల మంది భక్తులకు అన్నదానం చేసే వీలుంటుంది. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దగుట్టపై 15ఎకరాల్లో సుమారు రూ.8కోట్లతో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ రెండు కార్యక్రమాలు ఒకేసారి నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశాం. భక్తులకు వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం.