పంట తడి..రైతు కంటతడి
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:48 PM
పంటలను కాపాడుకునేందుకు రైతులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. నోటికాడికొచ్చిన పంట ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక తడి ఇస్తే పంట చేతికి వస్తుందని ట్యాంకర్లతో మడులు తడుపుతూ అప్పులపాలవుతున్నారు.

పంటలను కాపాడుకునేందుకు రైతులు నీటిని కొనుగోలు చేస్తున్నారు. నోటికాడికొచ్చిన పంట ఎండిపోతుండటం చూసి తట్టుకోలేక తడి ఇస్తే పంట చేతికి వస్తుందని ట్యాంకర్లతో మడులు తడుపుతూ అప్పులపాలవుతున్నారు. ఒక తడి తర్వాత మరో తడి ట్యాంకర్లతో నీరు కొనుగోలు వరి పంటకు పోస్తున్నారు.
- (ఆంధ్రజ్యోతి-మోత్కూరు)
యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంతమేర మూసీ నీరు అందుతుండగా మిగతా మండలాలు బావులు, బోర్లపై ఆధారపడి రైతులు సాగుచేస్తున్నారు. ఆలేరు, గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లోని కొంతభాగం బిక్కేరు వాగు వెంట ఉండటంతో చేతిబోర్లతో పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది (2024-25) వర్షాలు లేక చెరువులు, కుంటలు నిండలేదు. బిక్కేరు వాగు పారలేదు. బీమలింగంకాల్వ సౌకర్యం ఉన్నా కూరెళ్ల, పాలడుగు చెరువులు కూడా నిండలేదు. దీంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గాయి. సాగునీరు ఉన్నంత మేరకే వరి సాగు చేశారు. గతంలో నాలుగు ఎకరాలు సాగు చేసే రైతు ఈ యాసంగిలో ఒకటిరెండు ఎకరాలే పంట వేశాడు. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టాడు. ముదురుతున్న ఎండలతో భూగర్భజలాలు తగ్గి వేసిన కొద్దిపాటి పంట కూడా ఎండిపోతోంది. వరి ఈని, అర్రవంచుతున్న దశలో ఎండిపోతున్న పంటను వదిలిపెట్టలేక ఒక తడి ఇస్తే పంట చేతికి వస్తుందన్న ఆశతో పలువురు రైతులు ట్యాంకర్లతో నీరు పోసి కాపాడుకునే ప్రయ త్నం చేస్తున్నారు. ఒక్కో రైతు ట్యాంకర్ల కొద్దీ నీటిని కొనుగోలు చేసి పోస్తూ అప్పులపాలవుతున్నారు.
ట్యాంకర్ నీటితో పారేది రెండు, మూడు గుంటలు..
కొందరు రైతుల వరి పంట చిరుపొట్ట దశలోనే ఎండిపోయింది. వరుస తడులకు తిప్పుతూ పారించిన దాంట్లోనూ కొంత ఈని, గొలుసులు(గింజలు) దశలో ఎండిపోతోంది. ఒకట్రెండు తడులు ఇస్తే పంట చేతికి వస్తుందని భావించిన రైతులు ఒకరిని చూసి మరొకరు తడులు ఇస్తూనే ఉన్నారు. తీరా లెక్క చూసుకుంటే ఎకరాకు రూ.20వేల నుంచి 30 వేల ఖర్చువస్తోంది. ట్యాంకర్ నీటికి రూ.150, పొలం వద్దకు ట్యాక్టర్ రవాణా చార్జి రూ.500 నుంచి రూ.600. మొత్తం ఒక్కో ట్యాంకర్‌కు రూ.650 నుంచి రూ.750 ఖర్చవుతోంది. వరి చేను నీళ్లమీద ఉన్నప్పుడు పోస్తే 8ట్యాంకర్లకు ఎకరం పారుతోంది. ఎండిన తర్వాత పోస్తే ఒక్కో ట్యాంకరుకు 2, 3 గుంటలే పారుతుందని రైతులు చెబుతున్నారు.
గొర్రెలు, పశువులకు మేతగా పంట
వరి ఈని కంకి దశలో ఉంది.మరో పన్నెండు రోజులు నీరు పారిస్తే పంట చేతికి వస్తుంది. ట్యాంకర్లతో పోస్తే అప్పులపాలు కావడమే తప్ప తమకు మిగిలేమి ఉండదకున్న కొందరు రైతులు ఎండిపోయిన వరి చేనులో పశువులు, గొర్రెలు మేపుకోవడానికి ఇస్తున్నారు. వరి మేతకు ఇస్తే కొందరు గొర్రెల పెంపకం దారులు ఇంతో, అంతో డబ్బులు కూడా ఇవ్వడం లేదని, గొర్రె ఎరువు ఇస్తామని మేపుకుంటున్నారని కొందరు రైతులు చెప్పారు. ఎండిన వరి పంటకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
40 ట్యాంకర్ల నీరు పోశా...
ఈ యాసంగిలో నాకు ఉన్న బోరుబావి కింద ఒక ఎకరన్నర భూమిలో వరి సాగు చేశా. పంట మొదట్లో నీరు బాగానే ఉన్నా, రోజుకింత తగ్గింది. వరుస తడులకు తిప్పా. వరి ఈని గొలుసు ఎర్రబారుతోంది. దీంతో ఒకట్రెండు తడులు ఇస్తే పంట చేతికి వస్తుందన్న ఆశతో రూ.650కి ట్యాంకర్ చొప్పున మొదట నాలుగు ట్యాంకర్ల నీరు పోశా. అర ఎకరం నీరు తిరిగింది. ఎండలు ఎక్కువ కావడంతో త్వరగా పొలంలో తడి ఆరింది. మరోసారి ఆరు ట్యాంకర్లు, ఆ తర్వాత తొమ్మిది ట్యాంకర్ల చొప్పున ఇప్పటికి 40 ట్యాంకర్ల నీరు కొని పోశా. రూ.26 వేలు ఖర్చయ్యింది. అర ఎకరాకు సాగు పెట్టుబడి ఖర్చు రూ.12,500 కలిపి మొత్తం రూ.38,500 ఖర్చయ్యింది. అర ఎకరంలో 20 బస్తాల ధాన్యం వస్తుంది. అంటే 14 క్వింటాళ్లు. ప్రభుత్వ మద్ద తు ధర రూ.2300లకు విక్రయిస్తే రూ.32,200 వస్తాయి. ఇంకా రూ.6,300 నష్టమే. నా రెక్క ల కష్టం వృథానే. ఎండిన పంటకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
- జిట్ట బిక్షం, రైతు, ఆరెగూడెం