Share News

లేఖ.. రాయలేక

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:48 AM

ఒకప్పుడు దూరంలో ఉండేవారి కులాసా లు ఇంటికి వచ్చే పోస్ట్‌కార్డ్‌(ఉత్తరం) ద్వారా నే తెలిసేవి. మనసులోని మాటలను, అన్ని విషయాలను సమగ్రంగా రాసి ఎదుటి వారి కి చేరువ చేసేలా గతంలో పోస్ట్‌కార్డులను విస్తృతంగా వాడేవారు.

లేఖ.. రాయలేక

కనుమరుగవుతోన్న ఉత్తరం

సోషల్‌మీడియా రాకతో ఉక్కిరిబిక్కిరి

ఒకనాటి అనుబంధాల తీపిగుర్తు

పెరిగిన సాంకేతికతతో కనుమరుగు

రాసేవారూ కరువు

‘తొలిసారి మిమ్మల్ని చూసిందీ మొదలు’ అంటూ సాగే పాటను 1990 దశకంలోని ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాకు బలం ఈ పాటైతే, ఆ పాటకు మూలం ఓ లేఖ. సినిమా మొత్తం లేఖ చుట్టే తిరుగుతుంటుంది. చూడకుండానే లేఖ రాసిన వ్యక్తిని ప్రేమించేలా చేస్తుందీ ఆ లేఖ.

‘అమ్మానాన్న నేను బాగానే ఉన్నా, ఏ దిగు లు పెట్టుకోకండి. ఇప్పుడు సెలవులు లేవు. దసరా పండుగకు వస్తా’ అని సైన్యంలో ఉన్న కుమారుడు రాసే లేఖ ఆ తల్లిదండ్రులకు భరోసాతో పాటు ధైర్యాన్నీ ఇస్తుంది. లేఖకు అంతటి బలం ఉంటుంది.

‘నీకు పొరబోతుందీ అంటే నేను తలుచుకున్నానని అర్థం.. నిన్నెవరూ తలచేవారు లే రంటే నేను ఈ భూమి మీదనే లేనని అర్థం’ అంటూ ప్రియురాలికి రాసిన ప్రియుడి లేఖ వారి హృదయాల ముడివేసే ఓ బంధం.

ఒకప్పుడు దూరంలో ఉండేవారి కులాసా లు ఇంటికి వచ్చే పోస్ట్‌కార్డ్‌(ఉత్తరం) ద్వారా నే తెలిసేవి. మనసులోని మాటలను, అన్ని విషయాలను సమగ్రంగా రాసి ఎదుటి వారి కి చేరువ చేసేలా గతంలో పోస్ట్‌కార్డులను విస్తృతంగా వాడేవారు. భావ వ్యక్తీకరణకు ఒకనాడు ఎంతో ఉపయుక్తంగా ఉన్న లేఖ లు నేడు కనుమరుగయ్యే దశకు చేరుకున్నాయి.

- (ఆంధ్రజ్యోతి-యాదగిరిగుట్ట రూరల్‌)

ఉత్తరాలు రాయడం అంటే ఒకనాడు ఎంతో అద్భుతంగా, ఆనందపారవశ్యంగా ప్రతి ఒక్కరి లో అనిపించేది. సాంకేతికత పెరిగిన నేటి తరంలో పెన్నుపట్టి తన స్నేహితులకు, ఆత్మీయులకు లేఖలు రాసేవారే కనుమరుగయ్యారు. ఛాటింగ్‌ల ఉధృతిలో ఉత్తరం బతుకు ఉక్కిరిబిక్కిరిగా మారిపోయింది. ఉత్తరం రాకకోసం పోస్ట్‌బాక్స్‌ ఖాళీగా ఎదురుచూస్తోంది. లేఖా రచ న ఒక సృజనాత్మకమైన ప్రక్రియ. ఇది సాహిత్య రంగంలో పేరు పొందింది. అంతటి ఘనచరిత్ర కలిగిన లేఖలను రాసే అలవాటూ ఈ తరం మరిచిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాసేవా రు లేక, మరోవైపు చదివే వారు కూడా కనిపించక అలనాటి మానవ సంబంధ, అనుబంధ సమాచార మాద్యమమైన లేఖ(ఉత్తరం) సమా జం నుంచి దూరమయ్యే దుస్థితికి చేరుకుంది.

బట్వాడా నుంచి స్పీడ్‌పోస్ట్‌

పోస్టాఫీసుల ద్వారా రిజిస్టర్‌ పోస్ట్‌, స్పీడ్‌ పోస్ట్‌, ఆసరా పింఛన్ల పంపిణీ, మ నిఆర్డర్‌, సేవింగ్‌, ఇన్సూరెన్స, పార్శిల్‌, కమ్యూనికేషన్‌, కరస్పాండెంట్‌ ఉత్తరాలు, బల్క్‌ లెటర్లు, శ్రీరాముడి తలంబ్రాలు అందిస్తున్నారు. దీనికి తోడు వార,మాస పత్రికలను ఇళ్లకు చేరవేస్తున్నారు.

క్లుప్తంగా.. మీమ్స్‌తో...

మారుతున్న కాలానుగుణంగా సమాచార మార్పిడిలోనూ చాలా మార్పులొచ్చాయి. ఉత్తరాల తర్వాత ఇంట్లో ల్యాండ్‌లైన ఫోన్లు వాడేవారు. ఆ తర్వాత సెల్‌ఫోన్లు, ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లతో సమాచార మార్పిడి అత్యంత వేగంగా రూపొంతరం చెందింది. ఒకనాడు రోజుల్లో చేరే సమచారం ఇప్పుడు క్షణాల్లో అరచేతుల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో ఉత్తరం రాసే వారు కరువయ్యారు. అప్పట్లో సుదీర్ఘంగా రాసే లేఖల నియమాలు కూడా ఇప్పటి మెసేజ్‌, ఛాటింగ్‌లలో కనీసం కనిపించడం లేదు. సోషల్‌మీడియాలో ఇప్పుడు మీమ్స్‌(బొమ్మల) రూపంలో భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు. దీంతో సృజనాత్మకంగా రాసే అలవాటూ పోతోంది. అపురూపమైన లేఖలను ఆ రచనా సంప్రదాయ పద్ధతిని కాపాడి భావితరాలకు ఆ వారసత్వాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యోగక్షేమాల ప్రత్యుత్తరాలు తగ్గిపోయాయి

పోస్టాఫీస్‌ ద్వారా ఎక్కు వ శాతం యోగాక్షేమాలకు చెందిన ఉత్తరాలు తగ్గుముఖం పట్టాయి. ఫోన్ల ద్వారా ఛాటింగ్‌, మెసేజ్‌లతో సమాచారం వస్తుండటంతో ఉత్తరాలు తక్కువయ్యాయి. మిగతా సేవలు అన్నింటినీ అందిస్తూ సంపూర్ణంగా అందిస్తున్నాం. ఇతర సేవలపై పోస్టాఫీసులకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది.

- వెంకటస్వామిగౌడ్‌, పోస్ట్‌మన, యాదగిరిగుట్ట

ఉత్తరాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయేవి

గత 50 ఏళ్ల కిందట ఉత్తరాలు తీపి జ్ఞాపకాలుగా ఉండేవి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా ఉత్తరాలు ఎప్పుడెప్పుడు వస్తాయని వాటికోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఉత్తరాలు చదివితే ఎంతో మధురంగా ఉండేవి. చుట్టుపక్కల ప్రజల కు ఉత్తరాలు వస్తే ఇంటికి వచ్చి చదివించుకొని ఆనందపడేవారు. యోగాక్షేమాల ఉత్తరాలు కనుమరుగు కావడం బాధాకరం. గతంలో ఉత్తరాలు వస్తే వాటిని పెట్టెల్లో, బీరువాల్లో భద్రంగా దాచిపెట్టుకున్న సంఘటనలూ ఉన్నాయి.

- మల్లేశం, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు

Updated Date - Apr 02 , 2025 | 12:48 AM