Share News

అధికారికంగా ప్రకటిస్తే 24 గంటల్లో బీసీ కోటా అమలు

ABN , Publish Date - Apr 04 , 2025 | 04:17 AM

రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చని చెబుతున్న బండి సంజయ్‌.. కేంద్ర మంత్రిగా అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రంలో 24 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ చేశారు.

అధికారికంగా ప్రకటిస్తే 24 గంటల్లో బీసీ కోటా అమలు

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర మంత్రి పొన్నం సవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చని చెబుతున్న బండి సంజయ్‌.. కేంద్ర మంత్రిగా అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రంలో 24 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ చేశారు. ముస్లింలకు రిజర్వేషన్లు వద్దని వాదిస్తున్న బీజేపీ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు గురించి మాట్లాడాలని పేర్కొన్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుందని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. ఏపీలో ముస్లింలకు రిజర్వేషన్లు తీసేసిన తర్వాతే కేంద్ర మంత్రులు జీ కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అరవింద్‌.. తెలంగాణ గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఏపీలో రంజాన్‌ మాసంలో ఉద్యోగులకు రిలీఫ్‌ ఇస్తే నోరెత్తని బండి సంజయ్‌.. తెలంగాణలో ఇస్తే మాత్రం రాద్దాంతం చేశారని అన్నారు.


బీజేపీ చేస్తే ఒప్పు.. కాంగ్రెస్‌ పార్టీ చేస్తే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు 70శాతం ముస్లిం, మైనారిటీలకు ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేశామని (వీడియో ప్రదర్శిస్తూ) మంత్రి పొన్నం గుర్తు చేశారు. దీనికి కేంద్ర మంత్రిగా బండి సంజయ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీకి కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరు నాల్కలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి.. బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీని ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల గురించి అడగాలని సూచించారు. అందులోనూ మైనార్టీలకు రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని నిలదీయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయలేని పక్షంలో ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ముస్లిం ల పేరుతో తెలంగాణలోని బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.


బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం: మహేష్‌ కుమార్‌ గౌడ్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పాలనలో పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ఆస్తుల ధ్వంసంపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్‌, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్‌, మక్కాన్‌ సింగ్‌ ఠాకూర్‌తో కలి సి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రభుత్వ భూములను వారి అనుయాయ సంస్థలకు కారుచౌకగా కేటీఆర్‌ కట్టబెట్టారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్‌ పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికలకల్లా రాష్ట్ర ముఖచిత్రంలోనే బీఆర్‌ఎస్‌ ఉండదన్నారు. హెచ్‌సీయూ భూములు సర్కార్‌వేనని, విపక్షాలు దురుద్దేశంతోనే అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లుపై బీజేపీ నేతలు చిత్తశుద్ధిని చాటుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటే సీఎం రేవంత్‌ సహా అందరం కలిసి వస్తామన్నారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న మోదీ.. తెలంగాణలో ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 04:17 AM