Share News

5 రెట్ల అభివృద్ధే లక్ష్యం!

ABN , Publish Date - Mar 20 , 2025 | 06:06 AM

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాబోయే పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.17.26 లక్షల కోట్లు (200 బిలియన్‌ డాలర్లు) అని..పదేళ్లలో దీన్ని రూ.86.30 లక్షల కోట్లకు చేర్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.

5 రెట్ల అభివృద్ధే లక్ష్యం!

పదేళ్లలో 86 లక్షల కోట్లకు ఆర్థిక వ్యవస్థ.. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. ఇదే తెలంగాణ నమూనా

  • ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నాం

  • అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్‌

  • బడ్జెట్‌ ప్రసంగంలో భట్టి

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రాబోయే పదేళ్లలో ఐదు రెట్లు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పరిమాణం రూ.17.26 లక్షల కోట్లు (200 బిలియన్‌ డాలర్లు) అని..పదేళ్లలో దీన్ని రూ.86.30 లక్షల కోట్లకు చేర్చే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన.. ఈ మూడు అంశాలతో తెలంగాణ నమూనాను యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ రైజింగ్‌-2050’ ప్రణాళికతో రాష్ట్రంలో పాలనను కొనసాగిస్తున్నామన్నారు. ‘రాష్ట్రానికి ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ సమగ్ర, స్థిరమైన అభివృద్ధితో తెలంగాణను నిర్మిస్తాం. ప్రతి పౌరుడికీ విద్య, ఆరోగ్యం, ఉపాధి, సామాజిక భద్రతను కల్పించే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడమే మా లక్ష్యం’ అని వెల్లడించారు. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు అందరూ కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, కూలీలు, ఐటీ నిపుణులు.. ఇలా ప్రతి ఒక్కరినీ తమ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు బలోపేతం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శాసనసభలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం వ్యయం రూ.3,04,965 కోట్లుగా, రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లుగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు. భట్టి బడ్జెట్‌ ప్రసంగం 101 నిమిషాల పాటు కొనసాగింది. ‘‘ప్రజాప్రతినిధులుగా తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే అవకాశం, బాధ్యత మనపై ఉన్నాయి. సమష్టి కృషితో తెలంగాణను దేశానికే తలమానికంగా నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. విభేదాలను అధిగమించి, నిర్మాణాత్మక చర్చలో పాల్గొని కలిసికట్టుగా పనిచేయడం మన విధి. రాజకీయాలకతీతంగా సభ్యులంతా బడ్జెట్‌లో సూచించిన ప్రగతిశీల చర్యలకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి’’ అని భట్టి విజ్ఞప్తి చేశారు. దశాబ్దకాలంగా అనేక సవాళ్లను ఎదుర్కొన్న రాష్ట్రం.. ప్రస్తుతం అభివృద్ధి బాటలో నడుస్తోందని గుర్తుచేశారు. కుల, మత భేదాల్లేకుండా అందరి అభ్యున్నతికి వనరుల పంపకం జరగాలన్న లక్ష్యంతో బడ్జెట్‌ను రూపొందించామని ప్రకటించారు. పదేళ్ల అరాచక పాలనతో ఛిద్రమైన తెలంగాణను గాడిలో పెడుతూ.. లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖకు 23,373 కోట్లను ప్రతిపాదించారు. 40ు ప్రభుత్వ నిధులు, 60 ు ప్రైవేట్‌ డెవలపర్ల పెట్టుబడితో 2028 దాకా 17 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. హోంగార్డుల రోజువారీ వేతనాన్ని రూ.921 నుంచి 1000కి పెంచినట్లు ప్రకటించారు.


అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తున్నామని భట్టి చెప్పారు. అందులో భాగంగానే మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టామన్నారు. స్వచ్ఛ ఇంధనం, సుస్థిర అభివృద్ధితో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి మెగా మాస్టర్‌ ప్లాన్‌-2050ని రూపొందించామని పేర్కొన్నారు. 19 ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడానికి స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో కార్యాచరణను అమలు చేస్తున్నామని.. ఇందుకోసం పురపాలక శాఖకు రూ.17,677 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రైతు భరోసాకు 18 వేల కోట్లు

25.35 లక్షల మంది రైతులకు రూ.20,616.89 కోట్లు రుణమాఫీ చేసినట్లు భట్టి తెలిపారు. వ్యవసాయ శాఖకు రూ.24,439 కోట్లు ప్రతిపాదించారు. పశువుల టీకాల కోసం వెటర్నరీ బయోలాజికల్‌ పరిశోధనా సంస్థను మామిడిపల్లికి తరలించి, రూ.300 కోట్లతో భారీగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పాత్రను పునరుద్ధరించి, భూ సమస్యలను వేగంగా పరిష్కరించే పాలనా వ్యవస్థను తీసుకొస్తున్నామని వివరించారు. త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులను జారీ చేయనున్నామన్నారు.


మహాలక్ష్మితో 149 కోట్ల ఉచిత ప్రయాణాలు

మహాలక్ష్మి పథకంతో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని భట్టి తెలిపారు. రూ.500కే సిలిండర్‌ పథకం కోసం రూ.433.20 కోట్లు, గృహ జ్యోతి కింద 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తుకు రూ.1775.15 కోట్లు సబ్సిడీగా చెల్లించామని వివరించారు. హైదరాబాద్‌ నలువైపులా శాటిలైట్‌ టౌన్‌షి్‌పలను ఏర్పాటు చేసి, అల్పాదాయవర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ సముదాయాలకు ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

యంగ్‌ ఇండియా స్కూళ్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ఇతర వర్గాల విద్యార్థులందరినీ ఒకే గొడుగు కిందికి తేవడానికి యంగ్‌ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి ప్రకటించారు. 58 స్కూళ్లు నిర్మించడానికి రూ.11,600 కోట్లతో అనుమతులు ఇచ్చామని వివరించారు. మైనారిటీ గురుకులాలను యంగ్‌ ఇండియా గురుకులాల్లో విలీనం చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ యువతను నిపుణులుగా తీర్చిదిద్దడానికి ఫ్యూచర్‌ సిటీలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని నెలకొల్పాలని నిర్ణయించినట్లు భట్టి ప్రకటించారు.


సామాజిక సమానత్వం కోసం ఎస్సీ వర్గీకరణ

సామాజిక సమానత్వం కోసం రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉప కులాలను మూడు వర్గాలుగా విభజించాలని నిర్ణయం తీసుకున్నట్లు భట్టి చెప్పారు. రానున్న నాలుగేళ్లలో 2.1 లక్షల మంది పోడు రైతులకు ఇందిర గిరి జలవికాసం కింద రూ.12,600 కోట్లతో సోలార్‌ పంపుసెట్లు అందించనున్నట్లు ప్రకటించారు. ఎస్సీ సంక్షేమానికి రూ.40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ.17,169 కోట్లు ప్రతిపాదించారు. 96 శాతం కవరేజ్‌తో బీసీ కుల గణన సర్వే చేశామన్నారు. గ్రేటర్‌ పరిధిలో విద్యుత్తు అంతరాయాల నిరోధానికి అమలవుతున్న విద్యుత్తు అంబులెన్స్‌ సర్వీ్‌సను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నామన్నారు.

తగ్గిన నిరుద్యోగిత

కేంద్ర గణాంక శాఖ సర్వే ప్రకారం 2023 జూలై నుంచి సెప్టెంబరు మధ్య తెలంగాణ నిరుద్యోగిత రేటు 22.9 శాతంగా ఉండగా.. 2024 జూలై-సెప్టెంబరు మధ్య 18.1 శాతానికి తగ్గిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్య శిక్షణ, నియామకాల వల్లే ఇది సాధ్యమైందని భట్టి గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాల యువత కోసం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించామన్నారు.


ఇందిర మహిళా శక్తి మిషన్‌..

ఇందిర మహిళా శక్తి మిషన్‌ కింద రూ.20 వేల కోట్ల రుణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి చెప్పారు. 214 ఇందిర మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించామని, 22 ఇందిర మహిళా శక్తి భవనాల కోసం రూ.110 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రతి మండలంలో పొదుపు సంఘాలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు స్థాపించి, ధాన్యం మిల్లింగ్‌ చేసి, ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను అప్పగించనున్నట్లు చెప్పారు.

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

2023-24 2024-25 2024-25 2025-26

(వాస్తవ) (బడ్జెట్‌ అంచనా) (సవరించిన అంచనా) (బడ్జెట్‌ అంచనా)

రెవెన్యూ వసూళ్లు 1,69,293 2,21,242 2,02,107 2,29,720

మూలధన వసూళ్లు 61,496 69,572 64,501 74,646

మొత్తం వసూళ్లు 2,30,789 2,90,814 2,66,608 3,04,366

రెవెన్యూ వ్యయం 1,68,514 2,20,945 1,96,219 2,26,982

మూలధన వ్యయం 43,917 33,487 33,088 36,504

రుణాలు, అడ్వాన్సులు 6,860 19,626 19,626 21,351

రుణాల చెల్లింపు 12,532 17,001 17,001 20,028

మొత్తం వ్యయం 2,31,825 2,91,059 2,65,934 3,04,865

రెవెన్యూ మిగులు 779 297 5,888 2,738

ద్రవ్య లోటు 49,977 49,255 46,764 54,010

Updated Date - Mar 20 , 2025 | 06:06 AM