Telangana Govt Rice Export: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం
ABN , Publish Date - Mar 26 , 2025 | 03:27 AM
తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల క్రితం ప్రకటించిన బియ్యం ఎగుమతిని మొదలు పెట్టింది. 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ ఓడ రేవుకు పంపించి, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయడానికి శ్రీకారం చుట్టింది.

కాకినాడ ఓడ రేవుకు చేరిన బియ్యం బస్తాలు
తొలుత 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి
4-5 రోజుల్లో ఫిలిప్పీన్స్‌కు బయలుదేరనున్న నౌక
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): విదేశాలకు తెలంగాణ బియ్యాన్ని ఎగుమతి చేస్తామని ఆరు నెలల క్రితం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... తొలి అడుగు వేసింది. తొలిసారిగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించి... తెలంగాణ నుంచి ఏపీలోని కాకినాడ ఓడ రేవుకు పంపించింది. బియ్యం బస్తాలను ప్రస్తుతం ఓడలో లోడు చేస్తున్నారు. ఇది నాలుగైదు రోజుల్లో పూర్తి కాగానే ఫిలిప్పీన్స్‌కు పయనమవుతాయి. ఆ ఓడపై ‘తెలంగాణ రైస్ టు ఫిలిప్పీన్స్’ అని బ్యానర్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లోగోను కూడా ముద్రించారు. ఇండియా, ఫిలిప్పీన్స్ జాతీయ పతాకాలను కూడా ముద్రించారు. ఇప్పటివరకు రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, ఎగుమతిదారులు మాత్రమే విదేశాలకు బియ్యం విక్రయించేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా బియ్యం ఎగుమతులు చేయటానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. ఆరు నెలల క్రితం ఫిలిప్పీన్స్ ప్రభుత్వంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదం అయ్యాయి. తెలంగాణ నుంచి లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం దిగుమతి చేసుకునేందుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట్రానికి డిమాండ్ లేఖను పంపింది. అయితే బియ్యంలో నూక శాతం 5 శాతానికి మించి ఉండకూడదని, 95 శాతం ప్రధాన బియ్యం (హెడ్ రైస్) ఉండాలని షరతు విధించింది. ఫిలిప్పీన్స్ షరతుతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో చర్చించారు.
ముడి బియ్యం సరఫరా చేయాలని కోరారు. 25 శాతం నూకలకు బదులుగా, 5 శాతం నూకలతో బియ్యం సరఫరా చేస్తే... మిగిలిన 20 శాతానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. బియ్యం సరఫరా చేసిన రైస్ మిల్లర్లకు క్వింటాలుకు రూ.300 చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తంమీద తెలంగాణ నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులకు మాత్రం అడుగుపడింది. రైస్ మిల్లర్ల నుంచి ఎప్పటికప్పుడు బియ్యాన్ని సేకరిస్తూ... విడతల వారీగా లక్ష మెట్రిక్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం గమనార్హం. ఇదిలాఉండగా కాకినాడ ఓడరేవు నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యంతో ఓడ బయలుదేరే రోజున మంత్రి ఉత్తమ్ కాకినాడకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే మంత్రి పర్యటన ఇంతవరకు ఖరారుకాలేదు.
ఇవి కూడా చదవండి:
Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి
Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ