Land Value Increase: ఏటా భూముల విలువ పెంపు!
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:35 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడేళ్ల వరకు.. అంటే 2021 వరకు ప్రభుత్వం భూముల విలువలను పెంచలేదు. 2021లో 20ు.. 2022లో 33ు మేర పెంచారు. ఆ తర్వాత మూడేళ్లు అవుతున్నా.. పెంపు దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.

అప్పుడే ఎక్కువ లావాదేవీలు జరిగేచోట అదనపు ఆదాయం
హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏటా భూముల విలువలను పెంచాలి. ఈ చర్య వల్ల ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల నుంచి సర్కారుకు అదనపు ఆదాయం వస్తుంది..’’ అని రిజిస్ట్రేషన్ల శాఖ నియమించిన థర్డ్‌పార్టీ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. విలువల పెంపు శాస్త్రీయంగా ఉండాలని.. భూముల వాస్తవ విలువ, పుస్తక విలువకు మధ్య వ్యత్యాసాన్ని జాగ్రత్తగా సవరించాలని సూచించింది. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ తక్కువగా భూవిలువలు ఉన్నాయని, వాటిని కూడా శాస్త్రీయంగా సవరించాల్సిన అవసరముందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడేళ్ల వరకు.. అంటే 2021 వరకు ప్రభుత్వం భూముల విలువలను పెంచలేదు. 2021లో 20ు.. 2022లో 33ు మేర పెంచారు. ఆ తర్వాత మూడేళ్లు అవుతున్నా.. పెంపు దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అయితే.. ఆదాయం పెరగాలంటే.. భూవిలువల పెంపులో జాప్యం ఉండకూడదని థర్డ్‌పార్టీ ఏజెన్సీ నివేదిక పేర్కొంది. ఇందుకోసం మహారాష్ట్ర మాదిరిగా(ఏటా 2ు) పెంపు తప్పనిసరి అని సూచించింది.
పొంతన లేని ధరలు
హెచ్‌ఎండీఏ పరిధిలో పలు ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధికి, అక్కడి భూముల విలువకు పొంతన ఉండడం లేదని, అలాంటి ప్రాంతాల్లో అధ్యయనం చేసి, ధరలను శాస్త్రీయంగా సవరించాలని థర్డ్‌పార్టీ ఏజెన్సీ నివేదిక ప్రభుత్వానికి సూచించింది. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లోనూ శాస్త్రీయంగా భూముల విలువలను పెంచడం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను వివరించింది. తెలంగాణలోనూ ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయని పేర్కొంది. ఉదాహరణకు శేరిలింగంపల్లి, కొండాపూర్‌లలో పుస్తక విలువ ప్రకారం గజం భూమి ధర రూ.26,700. కానీ, అక్కడ బహిరంగ మార్కెట్ ధర రూ.లక్షకు పైగా ఉంది. 10-15 ఏళ్ల క్రితం వరకు మారుమూల ప్రాంతంగా ఉండే మోకిలలో ఇప్పటికీ గజం ధర రూ.2,300గా ఉంది. ఫోర్త్ సిటీగా అభివృద్ధి చెందుతున్న మహేశ్వరంలో ఈ ధర రూ.2,100గా ఉంది. ఇక్కడ వాస్తవ మార్కెట్ ధరలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. శాస్త్రీయంగా ధరలు పెంచాలని ఆ నివేదిక ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న భూముల విలువలను కనిష్ఠంగా 30ు.. గరిష్ఠంగా 50ు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పెంపు ఒకే సారి కాకుండా.. దశల వారీగా ఉంటుందని సమాచారం. తొలుత 30ు వరకు పెంచి.. ఆ తర్వాత మార్కెట్ పుంజుకునే తీరును బట్టి 50శాతంగా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుడు అమలు చేస్తుందనే దానిపై అధికారవర్గాలు ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే.. ఉగాది లేదా స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ పెంపు ఉంటుందని సూత్రప్రాయంగా తెలిసింది. నిజానికి రిజిస్ట్రేషన్ల శాఖకు 65ు ఆదాయం అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ రూపంలో వస్తోంది. మిగతా 35శాతం వాటాలో ఓపెన్ ప్లాట్లు, గృహాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ప్రతి చదరపు అడుగుకు ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ విలువపైనా దృష్టిసారించనున్నట్లు సమాచారం.