Share News

Interest Payments: వడ్డీ చెల్లింపులకే 14.2% సొమ్ము హరీ

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:00 AM

రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపులు పెద్ద గుదిబండగా మారుతున్నాయి. అప్పులు పెరిగినకొద్దీ... వడ్డీ భారం అధికమవుతోంది. రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో ఒక్క వడ్డీ చెల్లింపులకే 14.2 శాతం మేర నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి.

Interest Payments: వడ్డీ చెల్లింపులకే 14.2% సొమ్ము హరీ

రెవెన్యూ వ్యయంలో వడ్డీ భారం ఎక్కువే.. దేశంలోనే ఆరో స్థానంలో తెలంగాణ

  • ప్రధాన రాష్ట్రాల సగటుతో పోలిస్తే అధికమే

  • 2023-24లో వడ్డీలు, కిస్తీలకు రూ.61,691 కోట్లు

  • బడ్జెట్‌ రుణాల కంటే కార్పొరేషన్‌ రుణాల వడ్డీ ఎక్కువ

  • ఆర్థిక స్థితి బాగా లేక వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓడీల బాట

  • ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక దృక్పథం-2025’లో వెల్లడి

హైదరాబాద్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి వడ్డీ చెల్లింపులు పెద్ద గుదిబండగా మారుతున్నాయి. అప్పులు పెరిగినకొద్దీ... వడ్డీ భారం అధికమవుతోంది. రాష్ట్ర రెవెన్యూ వ్యయంలో ఒక్క వడ్డీ చెల్లింపులకే 14.2 శాతం మేర నిధులు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడంలో దేశంలోనే తెలంగాణ ఆరో స్థానంలో నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘తెలంగాణ సామాజిక, ఆర్థిక దృక్పథం-2025’ స్పష్టం చేసింది. ఇంత భారీ స్థాయిలో వడ్డీలు చెల్లించడానికి ప్రధాన కారణం ఏటేటా పెరుగుతున్న రాష్ట్ర అప్పులేనని వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తన రెవెన్యూ వ్యయంలో కేవలం వడ్డీ చెల్లింపులకే 14.2 శాతం నిధులను వెచ్చించిందని తెలిపింది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల వడ్డీ చెల్లింపుల సగటు 12.7 శాతం కంటే తెలంగాణ వడ్డీ చెల్లింపులు అధికమని వివరించింది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే ఆరో స్థానంలో నిలుస్తోంది. హరియాణా (18.9ు), పశ్చిమబెంగాల్‌ (18ు), కేరళ (17.7ు), పంజాబ్‌ (17.5ు), తమిళనాడు (16.8ు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. 14.1 శాతంతో గుజరాత్‌ తెలంగాణ కంటే కాస్త మెరుగ్గా ఏడో స్థానంలో నిలుస్తోంది.


వేస్‌ అండ్‌ మీన్స్‌పై ఆధారపడక తప్పడం లేదు

అప్పులకు వడ్డీ, కిస్తీల చెల్లింపులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, ఫలితంగా ప్రభుత్వం స్పల్పకాలిక రుణాల బాట పట్టిందని తెలిపింది. రాబడులు, రెవెన్యూ వ్యయం మధ్య సమతూకం లోపించి, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) వంటి స్పల్పకాలిక రుణాలు తెచ్చుకోవాల్సి వస్తోందని వివరించింది. ఈ ఓడీకి వెళ్లే అత్యవసర పరిస్థితులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది. 2017-18లో ఓడీ తెచ్చుకున్న రోజులు 5 మాత్రమే ఉండగా... 2023-24లో అవి 121 రోజులకు పెరిగాయని వివరించింది. వేస్‌ అండ్‌ మీన్స్‌కు సంబంధించి 2016-17లో 34 రోజులు ఉండగా, 2023-24లో 154 రోజులకు పెరిగాయని తెలిపింది. ఇలాంటి స్వల్పకాలిక రుణాలపై ఆధారపడడం వల్ల కూడా వడ్డీ భారం పెరగుతుందని, ఇది ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోందని పేర్కొంది.


రాష్ట్ర అప్పు రూ.7,38,707 కోట్లు

2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పుఈ సంవత్సరం ఫిబ్రవరి నాటికి రూ.4,37,223 కోట్లకు చేరింది. ఇవి కాకుండా కార్పొరేషన్ల కోసం తీసుకున్న అప్పు మరో రూ.3,01,484 కోట్లు కూడా ఉందని, దీనితో కలిపితే రాష్ట్ర అప్పు రూ.7,38,707 కోట్లకు చేరిందని తెలిపింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి, బడ్జెట్‌పరంగా తీసుకున్న అప్పునకు 2014-15లో రూ.6,954 కోట్లను వడ్డీలు, కిస్తీల రూపంలో చెల్లించగా... 2023-24లో అది రూ.36,866 కోట్లకు చేరింది. బడ్జెట్‌కు ఆవల తీసుకున్న అప్పులను కూడా కలిపితే... 2014-15లో కిస్తీలు, వడ్డీల చెల్లింపులు రూ.7,254 కోట్లు ఉండగా... 2023-24లో రూ.61,691 కోట్లకు చేరాయి. పైగా... బడ్జెట్‌ రుణాలకు సగటున 7.49 శాతం వడ్డీ రేటు ఉండగా... కార్పొరేషన్ల రుణాలకు 8.93 శాతం నుంచి 11.50 శాతం మేర వడ్డీ రేట్లు పలికాయని తెలిపింది. ఇలా వడ్డీ చెల్లింపుల భారం పెరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలవుతుందని పేర్కొంది.

Updated Date - Mar 21 , 2025 | 05:00 AM