Human Rights Commission: లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి
ABN , Publish Date - Apr 06 , 2025 | 03:35 AM
తెలంగాణ లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమిషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్లను ఖరారు చేసింది.

మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్
ఖరారు చేసిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ.. ఇద్దరి పేర్లను గవర్నర్‌కు పంపిన ప్రభుత్వం
నేడో రేపో నియామక ఉత్తర్వుల జారీ.. సమాచార ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి?
ఆయన సీఎం కార్యాలయ కార్యదర్శి.. ఐదుగురు కమిషనర్లను నియమించాలని యోచన
ఎంపిక భేటీకి రాని కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లోకాయుక్త, సమాచార హక్కు కమిషన్, మానవ హక్కుల కమిషన్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోకాయుక్తగా హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ పేర్లను ఖరారు చేసింది. సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ (సీఐసీ)గా సీనియర్ ఐఎ్‌ఫఎస్ అధికారి జీ చంద్రశేఖర్‌రెడ్డి పేరు తుది పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎంపిక వివరాలను గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ నేడో రేపో నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. నియామకాలపై విడివిడిగా చర్చించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి పాల్గొన్నారు. లోకాయుక్తగా నియమితులు కానున్న జస్టిస్ రాజశేఖర్ రెడ్డిని గత ఏడాది జనవరిలో తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో కొనసాగుతుండగానే లోకాయుక్తగా ఎంపిక చేసింది. ఆయన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సిరసనగండ్ల గ్రామానికి చెందినవారు. 2022 మే నెలలో హైకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశారు.
ఇటీవలే వర్గీకరణ కమిషన్‌కు అక్తర్ నేతృత్వం
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది. షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణ కోసం ఇటీవలే ప్రభుత్వం షమీమ్ అక్తర్‌తో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆయన పలు దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో చర్చించి, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించాలని సూచించారు. దీనిని ప్రభుత్వం పరిశీలించి, ఇటీవలే అసెంబ్లీలో బిల్లును ఆమోదించింది. ఇలా ఎస్సీ వర్గీకరణలోవిశేషమైన సేవలు అందించిన షమీమ్ అక్తర్ సేవలను మరోసారి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆయననే మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమించాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ మేరకు షమీమ్ అక్తర్ పేరును ఖరారు చేసి గవర్నర్ ఆమోదం కోసం ఫైలును శనివారం పంపించినట్లు తెలిసింది. మానవ హక్కుల కమిషన్‌కు సాధారణంగా చైర్మన్‌తో పాటు మరో ఇద్దరు సభ్యులను నియమిస్తారు. హైకోర్టు లేదా జిల్లా కోర్టు రిటైర్డు జడ్జిని ఒక సభ్యుడిగా, మానవ హక్కుల విషయంలో నిపుణుడైన మరో వ్యక్తిని రెండో సభ్యుడిగా నియమిస్తారు. సభ్యుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నియామక ఉత్తర్వులను గవర్నర్ సోమవారం వెలువరించవచ్చని తెలిసింది.
ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్ రెడ్డి?
సీఐసీ పోస్టుకు మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరు వినిపించింది. ఆమె ఈ నెలాఖరున సీఎ్‌సగా పదవీ విరమణ చేయనున్నారు. సీఐసీగా నియమించడానికి ప్రభుత్వం ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆమె అయిష్టంగా ఉండడంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కార్యదర్శిగా ఉన్న డా. జీ చంద్రశేఖర్‌రెడ్డి పేరును పరిశీలించినట్లు తెలిసింది. ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. కానీ, ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. గతంలో చంద్రశేఖర్‌రెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీగా పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరిలో ఆయనను సీఎంవోలో కార్యదర్శిగా సీఎం రేవంత్‌రెడ్డి నియమించారు. అప్పటి నుంచి సీఎంవోలో వ్యవసాయం, పశుసంవర్థక, అటవీ శాఖల అంశాలను చూస్తున్నారు. సీఐసీగా చంద్రశేఖర్‌తో పాటు మరో ఐదుగురు రాష్ట్ర కమిషనర్లను కూడా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 10 మంది వరకు రాష్ట్ర కమిషనర్లను నియమించే అవకాశం ఉంటుంది. కానీ... ఐదుగుర్ని నియమించుకుంటే చాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకానికి సంబంధించి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర కమిషనర్ పదవులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఒకసారి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి దరఖాస్తులను ఆహ్వానించడంతో దాదాపు 400 వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీటిని పరిశీలించి, పదవులను భర్తీ చేయడం ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరంగానే మారింది. కాగా, ఉప లోకాయుక్తగా బీసీ వ్యక్తిని నియమించాలని ప్రభుత్వం యోచించినట్లు సమాచారం. సీఐసీగా చంద్రశేఖర్‌రెడ్డి నియమితులైతే... మూడు కీలక పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినట్లవుతుందని, ఈ దృష్ట్యా ఉప లోకాయుక్త పోస్టును బీసీకి ఇవ్వాలని భావించినట్లు తెలిసింది.
కేసీఆర్ గైర్హాజరు
సీఐసీ నియామకంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేత కేసీఆర్ గైర్హాజరయ్యారు. సాధారణంగా దీనిపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, సీనియర్ మంత్రితో కూడిన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఈ కమిటీలో సభ్యుడిగా ప్రతిపక్ష నేత కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. సమావేశానికి రావాల్సిందిగా నాలుగు రోజుల క్రితమే ప్రభుత్వం కేసీఆర్‌కు లిఖితపూర్వక వర్తమానం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి సీఐసీ నియామకంపై చర్చించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here