Share News

MLC Election: టీచర్స్‌ ఎమ్మెల్సీ కోసం పోటాపోటీ

ABN , Publish Date - Feb 24 , 2025 | 04:16 AM

రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థుల్లో పోటాపోటీ నెలకొంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ప్రచారం తారస్థాయికి చేరింది.

MLC Election: టీచర్స్‌ ఎమ్మెల్సీ కోసం పోటాపోటీ

గెలుపు కోసం చెమటోడ్చుతున్న అభ్యర్థులు.. ఉపాధ్యాయ సంఘాల మధ్యే ప్రధాన పోటీ

  • అభ్యర్థులను బరిలో దించని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌

  • ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలని టీచర్ల తాపత్రయం

  • హోరాహోరీ పోటీలో ఎవరు నెగ్గుతారని ఉత్కంఠ

నల్లగొండ, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న నల్లగొండ - ఖమ్మం - వరంగల్‌ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థుల్లో పోటాపోటీ నెలకొంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థుల ప్రచారం తారస్థాయికి చేరింది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిని బరిలో నిలపగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కంటే, ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీనే ఎక్కువగా ఉంది. సిటింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి యూటీఎఫ్‌ నుంచి బరిలో ఉండగా.. పీసీసీ అధికార ప్రతినిధి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ-టీఎస్‌ నుంచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, బీజేపీ నుంచి పులి సర్వోత్తమ్‌రెడ్డి, బీసీ సంఘాల మద్దతుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ సహా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ స్థానంలో గెలవడం ద్వారా ఉపాధ్యాయ వర్గాల్లో తమ పట్టును చాటేందుకు ప్రధాన అభ్యర్థులు, సంఘాలు పోటాపోటీగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 12 జిల్లాల పరిధిలోని ఈ నియోజకవర్గంలో 25,797మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది.


గెలుపునకు వ్యూహ ప్రతివ్యూహాలు

పార్టీలపరంగా బీజేపీ మాత్రమే అభ్యర్థిని నిలబెట్టగా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రత్యక్షంగా ఎవరికీ మద్దతివ్వడం లేదు. దీంతో సంఘాల మద్దతు, ఉపాధ్యాయులను నేరుగా కలవడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు. అధిక సభ్యత్వాలు ఉన్న యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ, టీపీఆర్‌టీయూ నేరుగా అభ్యర్థులను బరిలో దింపగా.. ఇతర సంఘాలు, ఈ సంఘాలకు సంబంధం లేని ఉపాధ్యాయుల మద్దతు కోసం మిగిలిన అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. హైస్కూల్‌ ఉపాధ్యాయుల ఓట్ల విషయంలో అన్ని సంఘాలకు రమారమి సమాన అవకాశాలు ఉంటాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులు, కేజీబీవీ టీచర్లు, భాషా పండిట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఎయిడెడ్‌ స్కూళ్ల టీచర్ల విషయంలో.. సంఘాలతో సంబంధం లేకుండా వారి సమస్యల ఆధారంగా ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో వారి మనసు గెలుచుకునేందుకు ప్రధాన అభ్యర్థులంతా ప్రయత్నాలు చేస్తున్నారు. జీవో 371తో పాటు, స్పౌస్‌ బదిలీలు, పెండింగ్‌ డీఏలు ఈ ఎన్నికలో ప్రఽధాన భూమికను పోషిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయులకు ఆయా సందర్భాల్లో వారి పోరాటాలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులోనూ మద్దతుగా ఉంటామని అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు. వీటితో పాటు రాష్ట్రంలో కులగణన నేపథ్యంలో బీసీ నినాదం సైతం ఈ ఎన్నికలో తెరమీదకు వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ఈ ఎన్నికలో బీసీ నినాదంతో బరిలో ఉండటం ఆసక్తి రేపుతోంది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా బీజేపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. అయినా ఒకటి, రెండు రోజుల్లో అంతర్గతంగానైనా కీలక అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తంగా హోరాహోరీ పోటీ నెలకొనడంతో ఈ ఎన్నికపై ఉపాధ్యాయవర్గాలతో పాటు, రాజకీయ, ఉద్యోగ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.


నాలుగో పర్యాయం జరగనున్న ఎన్నిక

ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ తర్వాత ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎన్నిక జరగబోతోంది. 2007లో జరిగిన మొదటి ఎన్నికలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గెలుపొందారు. 2013లో పీఆర్‌టీయూ అభ్యర్థి పూల రవీందర్‌, 2019లో యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం నర్సిరెడ్డి, రవీందర్‌ బరిలో నిలవడం గమనార్హం.

Updated Date - Feb 24 , 2025 | 04:16 AM