Tummala: రైతులకు మేలు చేస్తే ఓర్వలేకున్నరు
ABN , Publish Date - Apr 03 , 2025 | 05:25 AM
రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని, కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబంపై మంత్రి తుమ్మల ధ్వజం
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగింది
పంట ఉత్పత్తులను మద్దతుధరతో కొంటున్నాం
పామాయిల్‌కు ఏడాదిలో 8500 పెరిగిన ధర
సన్నాలకు బోన్‌సతో రైతులకు మేలని వ్యాఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగిందని, కనీస మద్దతు ధరకు పంట ఉత్పత్తుల కొనుగోలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్నాల సాగు వద్దని, వరి వేస్తే ఉరి వేసుకున్నట్లని ప్రకటించిన రోజులు పోయి.. సన్నాలకు బోనస్ ఇచ్చి, పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసే రోజులు వచ్చాయని పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బోనస్ అమలుతో రాష్ట్రంలో సన్నాల సాగు 60శాతానికి పెరిగిందని, రైతులకు మేలు జరిగిందని తెలిపారు. పీడీఎ్‌సలో సన్నాలు పంపిణీ చేసి దేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని నిలబెట్టినట్లు తెలిపారు. రైతులకు ఏడాదిలో తమ ప్రభుత్వం రూ.34,667కోట్లు చెల్లిచండం చూసి.. కల్వకుంట్ల కుటుంబం ఓర్వలేకపోతున్నదని ధ్వజమెత్తారు. గతంలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని వారు.. ఇప్పుడు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన తమను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇచ్చి, వివిధ సబ్సిడీ పథకాల కింద రైతులకు దక్కాల్సిన రూ.15 వేలకు ఎగనామం పెట్టారన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆ పథకాలను పునరుద్ధరించామని తెలిపారు. రైతుభరోసాను రూ.12 వేలకు పెంచి... రెండు నెలల్లోనే రూ. 5057.77 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. గతంలో పామాయిల్ సాగును పట్టించుకోలేదని, ఇష్టారీతిన కంపెనీలకు అనుమతులిచ్చి సాగును తగ్గించేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏడాదిలో గెలల ధర రూ.8,500పైగా పెరిగిందని తెలిపారు. రైతుబీమా పథకంలో చేరిన రైతులకు ప్రీమియం కూడా ప్రభుత్వమే భరిస్తున్నదని వివరించారు. బీఆర్‌ఎస్ నేతలు విమర్శించినంత మాత్రాన రైతులు నిజాలు తెలుసుకోకుండా ఉండరన్నారు. ఇప్పటికైనా కల్లబొల్లి కబుర్లు చెప్పడం మానేయాలని హితవు పలికారు.