Betting: బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:48 PM
Betting addiction బెట్టింగ్ యాప్‌ల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సూచించారు. ఐపీఎల్ సీజన్ వేళ.. యువత బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు సంపాదించవచ్చన్న ఆలోచనతో అప్పులపాలు కావద్దని హెచ్చరించారు.

112, 100కి సమాచారం ఇవ్వండి
63099 90800కూ కాల్ చేయొచ్చు
వివరాలు గోప్యంగా ఉంచుతాం
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ యాప్‌ల బారిన పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని యువతకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సూచించారు. ఐపీఎల్ సీజన్ వేళ.. యువత బెట్టింగ్‌లకు పాల్పడి డబ్బులు సంపాదించవచ్చన్న ఆలోచనతో అప్పులపాలు కావద్దని హెచ్చరించారు. శనివారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిస్తే 112, లేదా 100, లేదా 6309990800 నెంబర్లకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. బెట్టింగ్‌లను అడ్డుకోవడమంటే ప్రస్తుత దశలో ఓ కుటుంబాన్ని ప్రాణాలతో కాపాడటమే. బెట్టింగ్ యాప్‌లపై, పాత నేరస్థులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌లకు సహకరించే వారిపై పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. డీఐజీ ఆదేశాల మేరకు జిల్లాలో యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడే వారి వివరాలు సేకరిస్తున్నాం. గతంలో క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో పట్టుబడిన వారిపై కూడా ప్రత్యేక నిఘా ఉంచాం. చట్టవ్యతిరేకంగా బెట్టింగ్‌లకు పాల్పడితే కఠినచర్యలు తప్పవు. బెట్టింగ్‌లకు బానిసై అప్పులు చేసి ఆర్థిక సమస్యలు ఎదుర్కోలేక యువత ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు గతంలో పోలీసులు గుర్తించినట్లు నా దృష్టికి వచ్చాయి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై రౌడీషీట్లు తెరుస్తామ’ని హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా పిల్లల తీరుపై శ్రద్ధ వహించాలని సూచించారు.