Share News

క్రీడలకు ప్రోత్సాహం

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:51 PM

కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. హాస్టల్‌లో తాగునీరు ఏర్పాటు చేసింది

క్రీడలకు ప్రోత్సాహం
టెన్నిస్‌ ఆడుతున్న హాస్టల్‌ విద్యార్థులు

హాస్టల్‌ విద్యార్థులకు క్రీడా పరికరాలు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం

సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

వెల్దుర్తి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. హాస్టల్‌లో తాగునీరు ఏర్పాటు చేసింది. అలాగే ఫ్యాన్లు, డోర్లు, కిటికీలు, మరుగు దొడ్లకు మరమ్మతులు చేసేందుకు రూ.25 లక్షలు నిధులు మంజూరు చేసింది. అలాగే చదువుతో పాటు క్రీడా పరికరాలను కూడా ఏర్పాటు చేసింది.

పరికరాల అందజేత

విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రీడా పరికరాలను అందజేస్తోంది. విద్యార్థుల సౌకర్యార్థం చెస్‌, క్యారమ్‌ బోర్డులు, టెన్నికాయిట్‌ రింగ్స్‌, షటిల్‌ కాక్‌ బ్యారెల్స్‌, షటిల్‌ బ్యాట్‌లు, షటిల్‌ నెట్‌లు, స్కిప్పింగ్‌ రోప్స్‌, డిస్క్‌త్రో బాల్స్‌, షాట్‌ఫుట్‌, వాలీబాల్స్‌, నెట్స్‌, జావెలిన్‌ త్రో బాంబూ స్టిక్స్‌ వంటి క్రీడా పరికరాలు హాస్టల్‌కు అందజేసింది. దీంతో విద్యార్థులు తమ కిష్టమైన క్రీడల్లో రాణించేందుకు అవకాశం ఏర్పడింది.

రోజూ గంటపాటు క్రీడలు..

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఈమేరకు రోజూ గంటపాటు క్రీడల్లో పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

క్రీడలతో మానసికోల్లాసం

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా అవసరం. హాస్టల్‌ విద్యార్థులకు మేము ప్రతిరోజు క్రీడల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చాం. - ఉస్మాన్‌, వార్డెన్‌, ఎస్సీ హాస్టల్‌, వెల్దుర్తి.

క్రీడలతో ఒత్తిడి దూరం

నిత్యం చదువుతో కుస్తీ పడే మాకు క్రీడలతో ఒత్తిడి దూరమవుతుంది. ఆటలు ఆడడం ద్వారా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. - వినోద్‌ , విద్యార్థి

Updated Date - Mar 22 , 2025 | 11:51 PM