బరి తెగింపు
ABN , First Publish Date - 2021-01-16T05:36:24+05:30 IST
సంక్రాంతి పర్వదినాల ముసుగులో పోలీ సులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా మూడు రోజుల పాటు అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయి.

యథేచ్ఛగా సాగిన కోడి పందేలు
గుండాట, పేకాట నిర్వహణ
చేతులు మారిన కోట్లాది రూపాయలు
ప్రేక్షక పాత్రలో పోలీసులు
ఏలూరు రూరల్, జనవరి 15: సంక్రాంతి పర్వదినాల ముసుగులో పోలీ సులు, ప్రజా ప్రతినిధుల సాక్షిగా మూడు రోజుల పాటు అసాంఘిక శక్తులు పేట్రేగిపోయాయి. లక్షలు ఫణంగా పెట్టి కోడి పందేలు, గుండాట, పేకాటలు వంటి జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. మండలంలో లక్షలాది రూపా య లు చేతులు మారినట్టు సమాచారం. పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్ప వని పోలీసులు పండగకు ముందు హెచ్చరికలు జారీ చేసినా ఎక్కడా పందే లను అడ్డుకున్న దాఖలాలు కానరాలేదు. చొదిమెళ్ళ, తంగెళ్ళ మూడి, కోడేలు, జాలిపూడి, చాటపర్రు, శ్రీపర్రు, గుడివాకలంక, పైడిచింతపాడు తదితర ప్రాం తాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు జరిగాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో సైతం పందేలు జరిగాయి. బరులు నిర్వహించిన ప్రతిచోట పేకాట, గుండాట వంటి శిబిరాల నిర్వహణకు స్థలాలను వేలం పాట ద్వారా కేటాయించి నిర్వాహకు లు సొమ్ము చేసుకున్నారు. చిన్న బరుల్లో రూ.20 వేల వరకూ గరిష్టంగా పందే లు సాగగా, పెద్ద బరుల్లో రూ. రెండు లక్షల వరకూ నడిచాయి. మద్యం ధర లు పెంచేసి విక్రయించడంతో చాలాచోట్ల గొడవలు జరిగాయి. బరుల వద్ద పెద్దఎత్తున బెల్టు షాపులు ఏర్పాడు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించు కోలేదు.
అధికార పార్టీ కనుసన్నల్లోనే..
పోలీసుల హెచ్చరికలు తాటాకు చప్పుడులే అయ్యాయి. పందేలే కాదు కోత ముక్క, పేకాట, గుండాటలు భారీగా జరిగాయి. అధికార పార్టీ నేతల కను సన్నల్లో బరులు గీయడంతో పోలీసులు పక్కకు తప్పుకున్నారు. అన్నింటికి ఓ రేటు నిర్వహించిన నిర్వాహకులు పందెం రాయుళ్ళ నుంచి భారీగా దండు కున్నారు.
కోజాకు భలే డిమాండ్
కోజాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రికమండేషన్లు చేయించుకుని మరీ కోజాల కోసం ప్రయత్నించారు. కీలక ప్రజా ప్రతినిఽధులు, ద్వితీయ శ్రేణి నాయకులు, వివిధ శాఖల అధికారులకు కోజాలను కానుకగా పంపించారు. తింటే పందెం కోడి మాంసం తినాలనే సామెతను దృష్టిలో ఉంచుకుని కోజా మాంసాన్ని వేలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో కోజా మూడు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకూ ధర పలికింది.
పెదపాడు మండలంలో..
పెదపాడు : అటు రెవెన్యూ.. ఇటు పోలీసుల ఆంక్షల నడుమ కత్తి కట్టిన కోడిపుంజు బరిలోకి దిగింది. మండలంలో పాతపెదపాడు, కలపర్రు గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించగా, పలు గ్రామాల్లో కోసాటలు, గుండాటలను నిర్వహించారు. పందెంరాయుళ్లతో పాటు పందేలను తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో బరులు కిక్కిరిసిపోయాయి. కోడిపందేలు, పేకాటల్లో లక్షలాది రూపాయలు చేతులు మారాయి.
పెదవేగి మండలంలో..
పెదవేగి : మండలంలో సంప్రదాయం పేరుతో గ్రామాల్లో కోడిపందేలు యఽథేచ్ఛగా సాగాయి. తెల్లవారింది మొదలు ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి వరకు కోడిపందేలను నిర్విరామం గా వేశారు. పందేలకు జతగా కోసాట, గుండాట వంటి జూదాలు ముమ్మరంగా నిర్వహించారు. దీంతోపాటు మద్యం ఏరులై పారింది. కొండలరావుపాలెం, విజయరాయి, జానంపేట, లక్ష్మీపురం, కూచింపూడి, వేగివాడ గ్రామాల్లో కోడిపందేలు భారీ ఎత్తున జరిగాయి. పందే లు జరిగిన ఈ మూడురోజుల్లో రూ.కోట్లలో సొమ్ము చేతులు మారినట్టు స మాచారం. ప్రతిచోటా కోసాట, లోపలా, బయటా, గుండాట వంటివి బహిరంగంగా నిర్వహించారు. పందేల నిర్వాహకులు పందేలకు అనుబంధంగా రూ.లక్షల్లో సొమ్ము తీసుకుని ఈ జూదాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. పందేలను అడ్డుకుంటామని చెప్పిన పోలీసులు ఎక్కడా మచ్చుకు కూడా కానరాలేదు.
దెందులూరు మండలంలో..
దెందులూరు : మండలంలో కోడిపందేలు యథేచ్ఛగా సాగాయి. మండలంలోని దెందులూరు, గంగన్నగూడెం, గాలాయిగూడెం, కొవ్వలి, దోసపాడు గ్రామాల్లో పందేలు నిర్వహించారు. పేకాట, గుండాట యథేచ్ఛగా సాగాయి.

