ఆపరేషన్ గరుడ
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:26 AM
జిల్లాలో ఆపరేషన్ గరుడతో ఔషధ విక్రయాల్లో అక్రమ దందా బయట పడింది. మత్తు ప్రేరేపిత డ్రగ్స్, గర్భవిచ్ఛిత్తి, వయాగ్రా మందులను పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మందుల షాపుల్లో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్ అధికారుల సంయుక్త దాడులు
(భీమవరం– ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆపరేషన్ గరుడతో ఔషధ విక్రయాల్లో అక్రమ దందా బయట పడింది. మత్తు ప్రేరేపిత డ్రగ్స్, గర్భవిచ్ఛిత్తి, వయాగ్రా మందులను పెద్ద మొత్తంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలిలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ డ్రగ్స్ తనిఖీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మూడు పట్టణాలలో ముఖ్యమైన మందుల దుకాణాల్లో తనిఖీ చేశారు. గీతా ఫార్మసూటికల్ కంపెనీలో శ్రీను అక్రమ విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా డ్రగ్స్ విభాగం అందించిన సమాచారం మేరకు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్, వయాగ్ర, గర్భవిచ్ఛిత్తి మందులు స్వాధీనం చే సుకున్నారు. నిందితుడి అరెస్టుపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
ఏడాది క్రితం సీజ్ చేసినా..
తాడేపల్లిగూడెంలో ఏడాదిక్రితం ప్రముఖ మందుల షాపును సీజ్ చేశారు. తాజాగా మరోపేరుతో మందుల షాపును తెరిచారు. గర్భవిచ్ఛిత్తి మందులు, మానసిక ఒత్తిళ్లకు సంబంధించిన మందులు డాక్టర్ సిఫార్సు ఉంటేనే విక్రయించాలి. జిల్లాలో ఏడాది నుంచి మందుల షాపులపై నిఘా పెంచడంతో ఇలాంటి మందులు విక్రయించడానికి వ్యాపారులు భయపడుతున్నారు. తాజాగా ఆపరేషన్ గరుడ పేరిట ప్రముఖ మందుల షాపుల్లో తనిఖీల్లో అక్రమ విక్రయాలను గుర్తించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
ఆసుపత్రుల్లో అధిక ధరలు
మానసిక వ్యాధులకు ప్రైవేట్ ఆస్పత్రులలో మందులు ఉంటున్నాయి. అక్కడ ఎంఆర్‌పికి విక్రయిస్తున్నారు. మనసిక ఒత్తిడి, దిగులు వంటి సమస్యలున్నవారికి ఇతర ఆరోగ్య సమస్యలకు జనరిక్ మందులు ఇచ్చి ఎంఆర్‌పీ వసూలు చేస్తున్నారు. ఇటీవల ప్రైవేట్ మందుల షాపుల్లో విక్రయాలపై రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. వైద్యుల సిపార్సు చేసిన మందుల చీటీ నకలు తీసుకుంటున్నారు. అది కూడా వారానికి సంబంధించిన మందులను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బిల్లులు లేకుండా మందులను రప్పించి విక్రయిస్తున్న వైనాలు బయట పడుతున్నాయి. కొందరు ఏజెంట్లు నేరుగా మందుల షాపులకు తెచ్చి విక్రయిస్తున్నారు. వాటికి బిల్లులు లేకపోవడంతో తనిఖీలు నిర్వహించినపుడు మందుల షాపుల యజమానులు బయట పడుతున్నారు. ఏజెంట్లు, తయారీ కంపెనీలపై ఎటువంటి చర్యలు లేవు.
ఏలూరు నగరంలో..
ఏలూరు క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఏలూరులోని సద్భావన మెడి కల్ షాపు, ఉదయ్ జనరిక్ మెడికల్ షాపు, లైఫ్ ఫార్మసీ, నూజివీడు బాలాజీ ఫార్మసీలో తనిఖీలు నిర్వహించగా గడువుతీరిన మందులు, నిల్వ ల్లో తేడాలు, గర్భ విచ్ఛిత్తి మాత్రలు, మత్తు బిళ్లలు, గర్భం రాకుండా, సెక్స్ సామర్ధ్యం పెంచే మందులు ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడులు శుక్రవారం రాత్రి కూడా కొనసాగిస్తున్నారు. దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వ రరావు, విజిలెన్స్ సీఐలు శివరామకృష్ణ, ప్రసాద్ కుమార్, భీమ డోలు సీఐ యుజె విల్సన్, ఏలూరు త్రి టౌన్ సీఐ వి కోటేశ్వరరావు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, విజయవాడ, రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఈగల్ టీమ్ బృందాలు పాల్గొన్నాయి. మెడికల్ షాపులపై దాడులు కొనసాగుతున్నాయని తెలియ డంతో జిల్లాలోని పలు మెడికల్ షాపులు తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇలాంటి షాపులను కూడా అధికారులు గుర్తించినట్లు తెలు స్తోంది. భవిష్యత్‌లో ఈషాపులపై దాడులు చేసే అవకాశాలు ఉన్నాయి.
తణుకులో పెద్ద ఎత్తున మందులు స్వాధీనం
తణుకు, మార్చి 21(ఆంధ్రజ్యోతి): తణుకు పట్టణంలోని పలు మందు ల షాపుల్లో ఈగల్, విజిలెన్స్, జౌషధ నియంత్రణ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. విజిలెన్స్ ఎస్‌పి వి.శ్రీరామ్‌బాబు ఆధ్వర్యంలో ఎస్.ఐ కె.సీతారామ్ సమక్షంలో తనిఖీలు జరిగాయి. తంగిరాల వీధిలోని భవనం లో అనధికారంగా మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పెంజర్ల నాగేశ్వరరావు వద్ద అనధికారంగా ఉన్న మత్తు ఉత్ర్పేరక మందు లు, గర్భ విచ్ఛిత్తి మందులు, లైంగిక సామర్ధ్యం కోసం అంటూ మందులు అమ్ముతున్నట్లు గుర్తించారు. రావులపాలెం కు చెందిన బచ్చు వెంకట సుబ్బారావు నుంచి మందులు కొనుగోలు చేస్తున్నాడని, ఏప్రిల్ 24 నుంచి ఇప్పటివరకు రూ.6 లక్షలు ఫోన్‌పే చెల్లింపులు గుర్తించారు. నాగేశ్వరరా వుపై డ్రగ్, కాస్మొటిక్స్ యాక్టు 1940 అండర్ సెక్షన్ 18సి ప్రకారం కేసు నమోదు చేసినట్లు చెప్పారు. శ్రీచిత్ర మెడికల్స్, గీతా పార్మసీలలో కూడా తనిఖీలు నిర్వహించారు. ఈగల్ సీఐ సూర్యచంద్రరావు, సీసీఎస్ సీఐ రాంబాబు, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, విజిలెన్స్ ఏఈ ఎం.అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ముమ్మర తనిఖీలు
తాడేపల్లిగూడెం పట్టణంలోని పోర్ట్‌గేట్ మెడికల్ షాపు లైసెన్స్, జీఎస్టీ ఇతర అంశాలపై విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అబుదలి ఆలి, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం ఆరా తీశారు. అత్తిలిలోని సత్య కృష్ణ మెడికల్ షాపులో భీమవరం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అబిద్‌అలీ పెద్ద ఎత్తున మందులను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకాతిరుమలలోని మందుల షాపులలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్ జీవణి, విజిలెన్స్ సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ రంజిత్‌కుమార్, ఏఈ శ్రీనివాసరావు, ఈగల్ టీం సభ్యులు సూర్యచక్ర తదితరులు తనిఖీలు చేపట్టారు.