శభాష్! మిసెస్ శ్యామల
ABN , First Publish Date - 2021-03-24T07:34:09+05:30 IST
నాలుగేళ్ల కిందటి వరకు స్విమ్మింగ్ అంటే తెలియదు. కానీ నేడు... గజ ఈతగాళ్లను మించిపోయారు. అలలకు ఎదురెళ్లి ‘పాక్ జలసంధి’ని ఈదేశారు.

నాలుగేళ్ల కిందటి వరకు స్విమ్మింగ్ అంటే తెలియదు.
కానీ నేడు... గజ ఈతగాళ్లను మించిపోయారు.
అలలకు ఎదురెళ్లి ‘పాక్ జలసంధి’ని ఈదేశారు. ఆవిడే శ్యామల.
నాలుగు పదులు దాటిన తరువాత ఈత మొదలెట్టి... నలభై ఏడేళ్ల వయసులో అరుదైన ఘనత సాధిచిన తొలి తెలుగు వనిత ఆమె. ఓ సాధారణ మహిళకు ఇంతటి సాహసం ఎలా సాధ్యమైంది..! శ్యామల మాటల్లోనే...
నీళ్లంటే నాకు చచ్చేంత భయం. ఈ ఫోబియాతోనే చాలా కాలం నీళ్లకు దూరంగా ఉన్నా. అయితే ఒత్తిడిని జయించాలన్న తపనతో ఎలాగో ఈత మొదలుపెట్టాను. ఒక్కసారి నీళ్లలోకి దిగి ఈదడం నేర్చుకున్నాక ఆ భయాలన్నీ పోయాయి.
నిన్నమొన్నటి వరకు నేనో సాధారణ మహిళను. పెళ్లి చేసుకున్నాను. భర్త, పిల్లలు. సంసారంలో ఎవరికీ ఏ లోటూ లేకుండా చేసుకుపోవాలి. దాంతోపాటు మాకు యానిమేషన్ స్టూడియో ఒకటి ఉండేది. పదేళ్లు తెలుగు రాష్ట్రాల్లోని యానిమేషన్ ఇండస్ర్టీలో నేనే తొలి మహిళను. ప్రొడ్యూసర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా, రైటర్‌గా సొంతగా చాలా యానిమేషన్ చిత్రాలు చేశాం. అందులో నష్టాలు వచ్చాయి. స్టూడియో మూసేశాం. ఇది నన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. సాధారణంగా నలభై ఏళ్లు దాటిన దగ్గరి నుంచి ఆడవారిలో రకరకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతుంటాయి. వీటి నుంచి బయటపడడానికి నేను ఎంచుకున్న మార్గం స్విమ్మింగ్.
నీళ్లంటే భయం...
ఇది 2016లో విషయం. అంటే స్విమ్మింగ్ ప్రారంభించాలనుకున్న సంవత్సరం. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నాకు అప్పటి వరకు ఈత రాదు. ఎప్పుడూ సరదాకి కూడా ఎక్కడా ఈదే ప్రయత్నమూ చేయలేదు. ఎందుకంటే... నీళ్లంటే నాకు చచ్చేంత భయం. ఈ ఫోబియాతోనే చాలా కాలం నీళ్లకు దూరంగా ఉన్నా. అయితే ఒత్తిడిని జయించాలన్న తపనతో ఎలాగో ఈత మొదలుపెట్టాను. ఒక్కసారి నీళ్లలోకి దిగి ఈదడం నేర్చుకున్నాక ఆ భయాలన్నీ పోయాయి.
మలి అడుగుకు స్ఫూర్తి...
ఈత కొలనులోకి దిగాక స్విమ్మింగ్‌ను ఆస్వాదించడం మొదలుపెట్టాను. రాను రాను అది ఇష్టంగా మారింది. దీంతో పోటీల వైపు దృష్టి మరలింది. ఆ దిశగా సాధన షురూ చేశాను. మూడు నెలలకే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. తొలి ఈవెంట్‌లోనే కాంస్య పతకం వచ్చింది. ఆ పతకం నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది. కావల్సినంత ఆత్మవిశ్వాసాన్ని, మలి అడుగుకు కావల్సిన స్ఫూర్తిని ఇచ్చింది. ఇక అక్కడి నుంచి ప్రతి పోటీలో పతకాలు గెలుస్తూనే ఉన్నాను. ఇదే ఉత్సాహంతో ‘ఓపెన్ వాటర్’ ఈవెంట్‌లో పాల్గొన్నాను. ఇది జాతీయ స్థాయి పోటీ. 1.5 కిలోమీటర్లు. దేశంలో ఎవరైనా పోటీపడవచ్చు. 2019లో విజయవాడ కృష్ణా నదిలో జరిగిన ఆ ఈవెంట్‌లో స్వర్ణ పతకం నెగ్గాను. ఆ తరువాత రెండేళ్లు కూడా తొలి స్థానం నాదే.
లెజెండ్ రికార్డ్ బద్దలు...
ఇవన్నీ ఒక ఎత్తయితే తాజాగా బంగాళాఖాతంలోని పాక్ జలసంధిని ఈదడం నా జీవితంలోనే మధురమైన ఘట్టం. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధను్‌షకోటి వరకు 30 కిలోమీటర్లు ఈదాను. తెల్లవారుజామున 4:15కు ప్రారంభించాను. చిమ్మ చీకటి. సముద్ర హోరు. నిర్విరామంగా ఈదుతూ 13 గంటల 43 నిమిషాల్లో పూర్తి చేశాను. పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళను నేనే. అంతేకాదు... ప్రపంచంలో రెండో మహిళను. గతంలో పశ్చిమ బెంగాల్ లెజెండ్ స్విమ్మర్ బులా చౌదరి 13:55 గంటల్లో లక్ష్యాన్ని చేరారు. నేను ఆమె కంటే తక్కువ సమయంలో ఈది ఆ రికార్డును తిరగరాశాను. బులా చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకున్నారు. ఈతలో ఆమె దిట్ట. నాలుగేళ్ల కిందట స్విమ్మింగ్ మొదలుపెట్టిన నేను ఆమెను అధిగమించానంటే చాలా గర్వంగా ఉంది. మొత్తం మీద ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 14 మంది ఈ జలసంధిని దాటారు.
అంబాసిడర్‌లా చూసుకున్నారు...
ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ‘భారత్-శ్రీలంక ఫ్రెండ్‌షిప్ స్విమ్మింగ్’ అని పేరు పెట్టారు. శ్రీలంకకు ఒక అంబాసిడర్‌లా వెళ్లాను. వాళ్లూ ఒక రాయబారిని ఎలా గౌరవిస్తారో అంతటి గౌరవమర్యాదలు నాకూ ఇచ్చారు. హైకమిషన్ అడ్వైజర్ కెప్టెన్ వినోద్ సూద్ దీన్ని ప్రారంభించారు. ఆద్యంతం ఆయన నాకు సహాయ సహకారాలు అందించారు. దీనికి ముందు నేను ఐపీఎస్ అధికారి రాజీవ్ త్రివేదీ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్నాను. ఆయనే నాకు మార్గదర్శి.
నీవల్ల ఏమవుతుందన్నారు...
పాక్ జలసంధిని ఈదడమంటే ఇంగ్లిష్ చానల్‌ను దాటినట్టే. రెండింటికీ పెద్ద తేడా ఏమీ లేదు. అంతే దూరం... అదే తరహా సముద్ర పరిస్థితులు. చాలా కఠినంగా ఉంటుంది. అయితే ఇంగ్లిష్ చానల్‌లో నీరు చల్లగా ఉంటుంది. అదొక్కటే వ్యత్యాసం. పాక్ జలసంధి ఈదాలనుకొంటున్నట్టు చెప్పినప్పుడు సన్నిహితులు, స్నేహితులు ‘ఈ వయసులో నీవల్ల ఏమవుతుంద’న్నారు. కానీ నేను మనోధైర్యం కోల్పోలేదు. ఈదిన మార్గం షార్క్‌లకు నెలవు. నాతో పాటు 13 మంది సహాయక సిబ్బంది వెంట వచ్చారు. వారిలో 9 మంది బోట్‌కు సంబంధించిన డైవర్స్, లైఫ్‌గార్డ్స్, ఒక డాక్టర్ ఉన్నారు. సహాయం కోసం నా స్నేహితురాలిని కూడా తీసుకువెళ్లాను.
ఆ మూడు గంటలూ...
నాన్‌స్టా్‌పగా ఈదడమంటే... మధ్య మధ్యలో ఆహారం తీసుకోవచ్చు. అయితే చాలా నిబంధనలు ఉంటాయి. సహాయక సిబ్బందిని కానీ, బోట్లను కానీ... దేన్నీ ముట్టుకోకూడదు. ఫుడ్ తీసుకొనేటప్పుడు కూడా! ఉప్పు నీటిలో అన్ని గంటలంటే చర్మం అంతా పాడైపోతుంది. లోతు ఎంతో తెలియదు. చాలా భయమేస్తుంది. గజ ఈతగాళ్లకు కూడా కష్టమే. ఇవన్నీ పెద్దగా ఇబ్బందులనిపించలేదు కానీ... చివరి మూడు గంటలు తీరాన్ని చేరే క్రమంలో కెరటాలతో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. పెద్ద పెద్ద అలలు... బలంగా మీదకు వస్తున్నాయి. గాలిని బట్టి వాటి దిశ కూడా మారుతుంటుంది. ఆ సమయంలో తీరాన్ని చేరడం చాలా కష్టమనిపించింది. అలలు వెనక్కి నెడుతుంటే మనం ముందుకు వెళ్లడం సామాన్యం కాదు కదా! అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ధైర్యంగా పోరాడాను. గమ్యం చేరాను. అప్పుడు అర్థమైంది... నిజంగా ఇది పెద్ద సాహసమని!
ఇంట్లోవాళ్లు భయపడ్డారు...
మాది తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోట అయినా పాతికేళ్ల కిందటే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. మా వారు గోలి మోహన్ రిలయన్స్ కంపెనీలో ఇంజనీర్. మా అబ్బాయి పవన్ విహారీ బీటెక్ చదువుతున్నాడు. పాక్ జలసంధి ఈదడానికి వెళుతున్నానని చెప్పగానే ఇంట్లో వాళ్లు, సన్నిహతులు భయపడ్డారు. కానీ మనం ఒకటి ఇష్టపడ్డప్పుడు మనకి ఇష్టమైన వాళ్లు కూడా ప్రోత్సహిస్తారు కదా! అలానే మావాళ్లూ! భయపడినా భుజం తట్టారు. నేను ఇంతటి సాహసం చేయబోతున్నానని చెప్పగానే ఎంపీ కల్వకుంట్ల కవిత గారు నాకు అన్ని విధాలా మద్దతుగా నిలిచారు. ‘మీలాంటి అథ్లెట్లు మన రాష్ట్రానికి కావాల’ంటూ ప్రోత్సహించారు. హైదరాబాద్ రాగానే నన్ను ప్రత్యేకంగా అభినందించారు.
లక్ష్యం... పూర్తయిన తరువాతే...
తరువాతి లక్ష్యం ఏమిటని అంతా అడుగుతున్నారు. అయితే ముందే చెప్పడం నాకు నచ్చదు. ఏదైనా సాధించిన తరువాత దాని గురించి చెప్పుకొంటే విలువ ఉంటుంది కదా! నలభై ఏడేళ్ల వయసులో చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా శరీరం సహకరించదు. అయితే మనం ఒక లక్ష్యం పెట్టుకుని క్రమశిక్షణతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ఈతైనా... మరొకటైనా వయసుతో సంబంధం లేదు. అది మన శరీరానికి అలవాటు చేసే పద్ధతిని బట్టే ఆధాపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి... ఏదీ ఒక్క రోజులో రాదు. శ్రమించాలి. అంకితభావంతో ప్రయత్నించాలి. నేటి తరానికే కాదు... ఏతరం వారికైనా నేనిచ్చే సలహా... స్టే ఫిట్.. స్టే హెల్దీ.
హనుమా


