జీహెచ్‌ఎంసీ.. మూణ్నాళ్ల ముచ్చట
ABN , First Publish Date - 2021-04-15T07:05:02+05:30 IST
ఏసీ, ఏటీఎం, కేఫ్ టేరియా, బేబీ ఫీడింగ్ రూమ్

నిరూపయోగంగా ఏసీ బస్ షెల్టర్‌లు
అలంకార ప్రాయంగా ఫీడ్ ది నీడ్ రిఫ్రిజిరేటర్లు
చుక్క నీరు లేని వాటర్ ఏటీఎంలు
పనికి రాని పబ్లిక్ టాయిలెట్లు
పట్టించుకోని అధికారులు
ఒప్పందాలను ఉల్లంఘించినా చేష్టలుడిగి చూస్తోన్న వైనం
నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో పౌరులకు ఇబ్బందులు
అల్లాపూర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : అల్లాపూర్ డివిజన్ పరిధి పండిత నెహ్రూనగర్ రాధాకృష్ణ హౌసింగ్ సొసైటీ పార్కు వద్ద రెండేళ్ల క్రితం వాటర్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. అది కొద్ది రోజులే పని చేసింది. నిర్వహణాలోపం, నీటి కొరతతో అది మరుగున పడింది.
బౌద్ధనగర్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : బౌద్ధనగర్ జామై ఉస్మానియాలో పబ్లిక్ టాయిలెట్ అధ్వానంగా పనికిరాకుండా ఉంది. జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మోడ్రన్ పబ్లిక్ టాయిలెంట్‌ను తొలగించేశారు. ఫలితంగా సీతాఫల్‌మండి నుంచి జామై ఉస్మానియా వరకు పబ్లిక్ టాయిలెట్ లేక వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చిలకలగూడ గాంధీబొమ్మ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎం రెండేళ్లుగా పని చేయడం లేదు.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి) : ఏసీ, ఏటీఎం, కేఫ్ టేరియా, బేబీ ఫీడింగ్ రూమ్, మోడ్రన్ టాయిలెట్, దివ్యాంగులు, పిల్లలకు ఉపయుక్తంగా ఉండేందుకు అంటూ గ్రేడ్-1 బస్ షెల్టర్లు నిర్మించారు. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ షెల్టర్లలో ఒక్క చోట కూడా ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్లు కూడా లేకపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు లోనికి వెళ్లడం లేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ)లో భాగంగా నాలుగు గ్రేడ్‌లుగా బస్ షెల్టర్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. గ్రేడ్‌ను బట్టి 10 నుంచి 25 యేళ్ల వరకు ప్రైవేట్ ఏజెన్సీలకు లీజుకు అప్పగించింది. అప్పటి వరకు షెల్టర్‌ల మెయింటెనెన్స్ బాధ్యత ఆయా సంస్థలదే. షెల్టర్లపై ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్న సంస్థలు వాటి నిర్వహణ, సదుపాయాల కల్పనను గాలికొదిలేశాయి. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ పట్టించుకోవడం లేదు.
దాహం.. దాహం...
పాదచారులు, వాహనదారులు దాహార్తీ తీర్చుకునేందుకు గ్రేటర్‌లో 140 వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. వాటిలో ఏ ఒక్కటీ ప్రస్తుతం పని చేయడం లేదు. వేసవిలో నీరు తాగకపోవడంతో డీ హైడ్రేషన్‌కు దారి తీసే ప్రమాదముంది. దీనిని దృష్టిలో ఉంచుకొని వాటర్‌బోర్డు సరఫరా చేస్తోన్న సురక్షిత తాగునీటిని నామమాత్రపు ధరకు నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చే క్రమంలో వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డులు శ్రీకారం చుట్టాయి. రూపాయికి గ్లాస్, రూ.2కు లీటర్ నీటిని తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. కాయిన్లు వేసి నీటిని పట్టుకునేలా కాయిన్ స్లాట్‌లు ఏర్పాటు చేశారు. కాయిన్ స్లాట్‌లు పలు ప్రాంతాల్లో ధ్వంసమయ్యాయి. 24 గంటలపాటు నీరు అందుబాటులో ఉంటుందని చెప్పగా.. ఒక్క ఏటీఎంలో కూడా నీటి సరఫ రా జరగడం లేదు. గ్లాసులు కూడా చాలా చోట్ల కనిపించడం లేదు.
ఫీడ్ లేని రిఫ్రిజిరేటర్లు
జీహెచ్‌ఎంసీ, ఓ స్వచ్ఛంద సంస్థ కలిసి ఆహారం వృథా కాకుండా అన్నార్ధుల ఆకలి తీరేలా ఫీడ్ ది నీడ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. పలు ప్రాంతాల్లో రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేశాయి. షెల్టర్, విద్యుత్ కనెక్షన్ జీహెచ్‌ఎంసీ సమకూరిస్తే, రిఫ్రిజిరేటర్‌ను స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. చాలా చోట్ల రిఫ్రిజిరేటర్లు అలంకారప్రాయంగా మారాయి. మొదట్లో కొందరు ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లలో పెట్టారు. అవసరార్ధులు తీసుకున్నారు. ఏ రోజుకారోజు పరిశీలించి రిఫ్రిజిరేటర్లలో మిగిలిన ఆహారంలో పాడైనవి, తేదీ ముగిసినవి తీసేయాలి. ఆహారం పాడకుండా ఉండాలంటే విద్యుత్ సరఫరా ఉండాలి. నిర్వహణలోపంతో కొన్ని చోట్ల రిఫ్రిజిరేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
పనికి రాని పబ్లిక్ టాయిలెట్లు...
బహిరంగ మల, మూత్ర విసర్జనరహితంగా గ్రేటర్‌ను తీర్చిదిద్దే క్రమంలో ప్రారంభించిన ప్రాజెక్టు దారి తప్పింది. కొన్ని జోన్లలో ఇప్పటికే టాయిలెట్ల నిర్వహణ బాధ్యతలను అధికారులు ఏజెన్సీలకు అప్పగించారు. సికింద్రాబాద్, కూకట్‌పల్లి వంటి జోన్లలో ఇంకా ఏజెన్సీల ఎంపిక జరుగలేదు. ఏజెన్సీలు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనూ మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంది. పలు ప్రాంతాల్లో కమోడ్‌లు, నల్లాలు, ప్రెస్ డోర్లు, మగ్గులు చోరీకి గురవుతున్నాయి. దుర్గంధపూరితంగా మారిన టాయిలెట్లను వినియోగించుకునే పరిస్థితి లేదు. కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ మరుగుదొడ్ల వైపు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
లూ - కెఫేలు... వ్యాపార అడ్డాలు...
లగ్జోరియస్ టాయిలెట్ల వినియోగం పేరిట పలు ప్రాంతాల్లో లూ-కెఫేల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ అను మతి ఇచ్చింది. నామమాత్రపు అద్దెకు ప్రధాన రహదారుల పక్కన స్థలాలను వ్యాపారులకు కేటాయించింది. ఒప్పందం ప్రకారం పౌరుల ఉచిత వినియోగానికి స్ర్తీలు, పురుషుల కోసం వేర్వేరుగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. కొంత స్థలంలో టీ, కాఫీ, స్నాక్స్ వంటివి విక్రయించుకోవాలి. 170 చదరపు అడుగుల్లో కెఫే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఫుట్‌పాత్‌లపై స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. కొన్ని చోట్ల టాయిలెట్లకు తాళాలు వేసి నిర్ణీత విలువ మేర షాపింగ్ చేస్తేనే టాయిలెట్లు వినియోగించుకోవాలనే షరతు పెడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందిన తర్వాత ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలో కొంత మేర పరిస్థితి మారింది. ఒప్పందం ప్రకారం 100 ప్రాంతాల్లో లూ-కెఫేలు ఏర్పాటు చేయాలని మొదట భావించారు. ఇప్పటి వరకు 13 చోట్ల మాత్రమే ఆ సంస్థ ఏర్పాటు చేసింది. వాస్తవంగా పౌరుల టాయిలెట్ల సౌకర్యం ప్రధానోద్దేశంగా లూ-కెఫేల ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చారు. అసలు ఉద్దేశ్యం పక్కన పెట్టి ధనార్జన లక్ష్యంగా ఆ సంస్థ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. బిజినెస్ ఎక్కువగా జరుగుతుందనుకున్న చోట మాత్రమే కెఫేలు ఏర్పాటు చేస్తోంది.