పనిలో కీలకం.. అయినా పట్టించుకోరేం..!
ABN , First Publish Date - 2021-05-28T14:18:07+05:30 IST
కరోనా కట్టడిలో కీలకంగా పనిచేస్తోన్న సిబ్బంది ప్రాణాలు రిస్క్‌లో పడుతున్నాయి...

- మహమ్మారిపై పోరాటం
- ప్రాణాలు కోల్పోతున్న పలువురు
- పెద్ద దిక్కును కోల్పోవడంతో రోడ్డున పడుతోన్న కుటుంబాలు
- మాస్క్‌లు, గ్లౌస్‌లూ ఇవ్వని జీహెచ్‌ఎంసీ
- కొవిడ్ ఫండ్ కేటాయించి పరిహారం ఇవ్వాలంటున్న సంఘాలు
హైదరాబాద్ సిటీ : కరోనా కట్టడిలో కీలకంగా పనిచేస్తోన్న సిబ్బంది ప్రాణాలు రిస్క్‌లో పడుతున్నాయి. కొందరు వైరస్ బారిన పడుతుండగా.. మరికొందరు మహమ్మారికి బలవుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారూ బాధితుల్లో ఉంటుండడం గమనార్హం. ఫ్రంట్ లైన్ వారియర్స్‌తోపాటు వారి కుటుంబాలపైనా ప్రభావం పడుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం పకడ్బందీగా పనులు చేయిస్తోన్న అధికారులు.. క్షేత్రస్థాయి సిబ్బంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోగా.. దురదుదృష్టవశాత్తు వైరస్ సోకినా.. ప్రాణాలు పోయినా వారికి అండగా నిలవడం లేదు. పారిశుధ్య కార్మికుల నుంచి ఎంటమాలజీ వర్కర్ల వరకు మహమ్మారిని అరికట్టేందుకు జరుగుతోన్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్నారు. రోజువారీ పనులతోపాటు ఇంటింటి సర్వేలోనూ వర్కర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. కరోనా విలయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎక్కువగా ఇబ్బంది పడుతుండగా.. అధికారులూ వైరస్ బారిన పడుతున్నారు. కొందరు అధికారులు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు.
వారే కీలకం...
గ్రేటర్‌లో 18 వేల మందికిపైగా పారిశుధ్య, 2,200 మందికి పైగా ఎంటమాలజీ వర్కర్లు ఉన్నారు. కొవిడ్ నియంత్రణ చర్యల్లో వీరిది కీలకపాత్ర. ఈ క్రమంలో 800 మందికిపైగా ఇప్పటి వరకు వైరస్ బారిన పడ్డారు. వీరిలో మరణించిన వారి సంఖ్య 20కి పైగా ఉంటుందని ఓ యూనియన్ నాయకుడు తెలిపారు. మహమ్మారితో కార్మికులు మరణిస్తే.. దహన సంస్కారాల నిర్వహణ, తాత్కాలిక ఖర్చులకు కొంత నగదు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ చేపట్టే ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే కార్మికులు మరణించినా.. జీహెచ్‌ఎంసీ పరిహారం ఇస్తుందని, సొంత కార్మికులు ప్రాణాపాయం అని తెలిసి పనిచేస్తోన్నా పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా సేవలు గుర్తించకపోగా.. వారు చనిపోయినా పట్టించుకోని దైన్యస్థితిలో జీహెచ్‌ఎంసీ ఉంది. కార్మికులకు కటింగ్‌లు పోను రూ.14 వేలు చేతికందుతాయి. మహానగరంలో ఈ వేతనంతో కుటుంబం గడవడం సులువు కాదు. అప్పోసప్పో చేసి బతుకు బండి నెట్టుకొస్తున్న వారికి మహమ్మారి తీరని శోకాన్ని మిగులుస్తోంది. పెద్ద దిక్కువగా ఉన్న వారే ప్రాణాలు కోల్పోతుండడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
మాస్క్‌ల్లేవ్.. గ్లౌస్‌ల్లేవ్..
కరోనా మొదటి దశ వ్యాప్తి సమయంలో పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ వర్కర్లు, సూపర్ వైజర్లకు 4మాస్క్‌లు, గ్లౌస్‌లు, శానిటైజర్, టవళ్లు, కొబ్బరి నూనె, సబ్బులతో కూడిన కిట్‌లు అందజేశారు. గతం కంటే తీవ్ర స్థాయిలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నా ఉన్నతాధికారులు వారు పట్టించుకోవడం లేదు. కమిషనర్, అదనపు కమిషనర్, పాడకమండలి చొరవ తీసుకోవాల్సి ఉన్నా.. ఆ దిశగా ఆలోచన చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైరస్ సోకకుండా తప్పనిసరిగా వాడాల్సిన గ్లౌస్‌లు, మాస్క్‌లు, శానిటైజర్ కూడా ఇవ్వడం లేదని అంబర్‌పేటలో పనిచేసే ఓ ఎస్‌ఎ్‌ఫఏ తెలిపారు. ప్రధాన రహదారులపై పనిచేసే కొందరు సిబ్బందికి మాత్రమే గ్లౌస్‌లు ఇచ్చారు. కాలనీలు, బస్తీల్లోని అంతర్గత రోడ్లలో పనిచేసే కార్మికులకు కనీసం మాస్క్‌లు కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

కర్ణాటకలో కార్మికుల కోసం కొవిడ్ ఫండ్
కర్ణాటకలో కొవిడ్‌తో మరణించిన కార్మికులకు అక్కడి మునిసిపల్ కార్పొరేషన్లు రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నాయి. కార్మికుల సేవలను అక్కడి ప్రభుత్వం, కార్పొరేషన్లు గుర్తించాయి. కానీ ఇక్కడా పరిస్థితి లేదు. సఫాయన్నకు సలాం.. వాళ్ల కాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటామని చెబుతోన్న పెద్దలు.. అందరి కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నవారిని పట్టించుకోవడం లేదు. వైరస్ బారిన పడితే సరైన చికిత్స అందేలా.. పౌష్టికాహారం తినేలా చర్యలు తీసుకోవాలి. కరోనాతో మృతి చెందిన పారిశుధ్య, ఎంటమాలజీ కార్మికుల కుటుంబాలకు జీహెచ్‌ఎంసీ రూ.50 లక్షలు, సర్కారు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి. - ఊదరి గోపాల్, జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు
ఫాగింగ్ యంత్రంపై పని.. వైరస్‌తో మృతి
చార్మినార్ జోన్ పరిధిలో పనిచేసే ఎంఏ గఫార్ ఫాగింగ్ మిషన్‌పై పనిచేసే వాడు. కొన్నాళ్ల క్రితం కరోనా సోకడంతో తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇంటి పెద్ద దిక్కు మరణించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రస్తుతం ఎలాగోలా నెట్టుకొస్తున్నా.. మున్ముందు పరిస్థితేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురూ చిన్న పిల్లలే కావడంతో వారి చదువు, కుటుంబ పోషణ ఎలా..? అని బాధపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయమూ అందలేదు. ఫాగింగ్ యంత్రంపై పనిచేయడం వల్లే ఊపిరితిత్తులపై ప్రభావం పడిందని, అందుకే కరోనా నుంచి కోలుకోలేక పోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా ఫాగింగ్ యంత్రంపై పనికి వెళ్లేవాడని, ఈ క్రమంలోనే వైరస్ సోకిందన్నారు. ప్రజల కోసం పని చేసినా.. మమ్మల్ని పట్టించుకునే వారు లేరని వారు పేర్కొంటున్నారు. పూట గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో.. ఎలాంటి సాయమందకుంటే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
