Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం మంచిదే.. పవన్ కల్యాణ్ ప్రశంసలు
ABN , Publish Date - Mar 28 , 2025 | 10:20 PM
Pawan Kalyan: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. కోనోకార్పస్ చెట్లపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించారు. ఆ చెట్లను వెంటనే నిషేదించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంపై పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.

అమరావతి: కోనోకార్పస్ చెట్ల నిషేధంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ శుభపరిణామమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సభ్యులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ(శుక్రవారం) పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మానవాళికి ముప్పు తెచ్చే కోనోకార్పస్ చెట్ల పెంపకం నిషేధం అవసరమని చెప్పారు. చాలాకాలం ప్రయత్నం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కోనో కార్పస్ చెట్టుకు సంబంధించి ముప్పును గమనించి అసెంబ్లీ హాల్లో చర్చించడం అభినందనీయమని పవన్ కల్యాణ్ కొనియాడారు.
తెలంగాణ స్పీకర్ వెంటనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్లను త్వరితగతిన నిర్మూలించే విధంగా చర్యలకు ఆదేశించడం అభినందనీయని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ శాసన వ్యవస్థ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ వ్యవస్థకు ఈ మొక్కలు అనుగుణంగా లేనందున, స్వదేశీ చెట్లకు బదులుగా వీటిని నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
కోనోకార్పస్ చెట్లు మానవ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇవి శ్వాసకోశ సమస్యలు, అలర్జీలకు కారణమవుతాయన్నారు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఈ చెట్ల వల్ల ఆస్థమా రోగుల సంఖ్య పెరిగినట్లు పరిశోధనలు వెల్లడించాయని చెప్పారు. కరాచీ యూనివర్సిటీ అధ్యయనాల ప్రకారం ఈ చెట్ల వల్ల గాలి నాణ్యత దెబ్బతిని, ఆస్థమా కేసులు పెరిగాయని నిర్ధారించారు. ఈ అనుభవాల ఆధారంగా కొన్ని దేశాలు వీటి పెంపకాన్ని నిషేధించాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్
Metro Rail: రోజుకు రూ.కోటిన్నర నష్టం.. మెట్రో చార్జీలు పెంచేందుకు అనుమతి ఇప్పించండి
Youth Firing Gun: అర్ధరాత్రి కారులో వెళ్తూ ఆ యువకులు చేసిన పని తెలిస్తే
Read Latest Telangana News and Telugu news