కల్తీకల్లు బాధితులు @ 304
ABN , First Publish Date - 2021-01-11T08:05:08+05:30 IST
తియ్యగా గొంతు దిగిన ఆ కల్లు, ఇప్పుడు వారి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తోంది. ఉన్నట్టుండి నిల్చున్న చోటే కిందపడటం, మూర్ఛతో కొట్టుకోవడం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి

కొత్తగా మరో 82 మందికి అస్వస్థత
వికారాబాద్, పరిగి ఆస్పత్రుల్లో 153 మంది
వీరిలో చికిత్స అనంతరం 20 మంది ఇంటికి
బాధితుల్లో విత్‌డ్రాయల్ సిండ్రోమ్ సమస్య
500 చెట్లకు 3వేల లీటర్ల కల్లు సరఫరా ఏంటి?
ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు?
చిట్టిగిద్ద డిపో విషయంలో ఎక్సైజ్ కమిషనర్ ఫైర్
వికారాబాద్, నవాబుపేట, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తియ్యగా గొంతు దిగిన ఆ కల్లు, ఇప్పుడు వారి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తోంది. ఉన్నట్టుండి నిల్చున్న చోటే కిందపడటం, మూర్ఛతో కొట్టుకోవడం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలవుతున్నారు. ప్రభావిత గ్రామాల్లో కుటుంబసభ్యుల ఏడ్పులు, బాఽధితులను తరలించేందుకు వచ్చిన అంబులెన్స్ సైరన్లే వినినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా నవాబుపేట, వికారాబాద్ మండలాల్లోని 13 గ్రామాల్లో కల్లీ కల్లు బాధితులు పెరుగుతున్నారు. ఈ రెండు మండలాల్లో శనివారం 212 మంది అస్వస్థతకు గురవగా, ఆదివారం మరో 82 మంది అనారోగ్యం బారిన పడ్డారు. మొత్తంగా కల్తీకల్లు బాధితుల సంఖ్య 304కు చేరింది. వీరిలో నవాబుపేట మండలానికి చెందిన 159 మంది, వికారాబాద్ మండలానికి చెందిన 145 మంది ఉన్నారు. తీవ్ర అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నవారిలో 153 మందిని వికారాబాద్, పరిగి ఆస్పత్రుల్లో చేర్పించారు. వీరిలో 20 మందిని ఇంటికి పంపారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వికారాబాద్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ యాదయ్య చెప్పారు. లక్షణాలను బట్టి బాఽధితులు విత్‌డ్రాయల్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోందని తెలిపారు.
బాధితుల్లో వికారాబాద్ మండలం ఎర్రవల్లి, కామారెడ్డిగూడ, నారాయణపూర్, పెండ్లిమడుగు... నవాబుపేట మండలం వట్టిమీనపల్లి, నవాబుపేట, ఆర్కతల, చిట్టిగిద్ద, కేశవపల్లి, నాగిరెడ్డిపల్లి, ఎకమామిడి, మూలమడ, మమ్మదాన్‌పల్లి, కుమ్మరిగూడకు చెందిన వారున్నారు. చిట్టిగిద్ద, ఆర్కతల, వట్టిమీనపల్లి, నవాబుపేట, ఎకమామిడి, మాదిరెడ్డిపల్లి, ఎర్రవల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, కొత్తగడి, పులుసుమామిడి గ్రామాలకు చెందిన వారిలో కల్తీ కల్లు లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనారోగ్య లక్షఽణాలపై ఫోన్లు వస్తే గ్రామాలకు అంబులెన్స్‌లను పంపించి బాధితులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఆదివారం ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ వికారాబాద్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటలకు రంజిత్‌రెడ్డి ఫోన్ చేసి బాధితుల పరిస్థితిని వివరించారు. కల్తీకల్లు ఘటనకు సంబంధించి సర్కారు సీరియ్‌సగా ఉంది. నిఘా వర్గాల నుంచి ఉన్నతాధికారులు నివేదిక తెప్పించుకున్నారు.
బాధ్యులపై చట్టపరమైన చర్యలు
ల్యాబ్ రిపోర్టులు వచ్చాక.. కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహమ్మద్ స్పష్టం చేశారు. ఆదివారం చిట్టిగిద్ద కల్లు డిపోను ఆయన తనిఖీ చేశారు. చిట్టిగిద్ద సొసైటీలో 500 ఈత చెట్లు ఉంటే ఒక్కో చెట్టుకు 2 లీటర్ల చొప్పున రోజుకు గరిష్ఠంగా వెయ్యి లీటర్ల కల్లు రావాలని, అందుకు భిన్నంగా 3వేల లీటర్ల కల్లును సరఫరా చేస్తుంటే ఏం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ జిలానీబేగం, ఇతర అధికారులపై మండిపడ్డారు. అందరిపైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిట్టిగిద్ద కల్లు డిపో, మూడు దుకాణాలతో పాటు కల్తీకల్లు ప్రభావిత మిగతా గ్రామాల్లోని కల్లు దుకాణాలను సీజ్ చేశామని, దీనికి కారణమైన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వికారాబాద్ ఏరియా ఆస్పత్రితో బాధితులను పరామర్శించారు.