AG&P Pratham: శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏజీ అండ్ పి ప్రథమ్ రూ.220 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-12-02T19:36:08+05:30 IST

భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో అగ్రగామి సంస్థ ఏజీ అండ్ పి ప్రథమ్ (AG&P Pratham) ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది.

AG&P Pratham: శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏజీ అండ్ పి ప్రథమ్ రూ.220 కోట్ల పెట్టుబడులు

విజయవాడ: భారతీయ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD) పరిశ్రమలో అగ్రగామి సంస్థ ఏజీ అండ్ పి ప్రథమ్ (AG&P Pratham) ఏపీలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లాలో గ్యాస్ పంపిణీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వచ్చే ఆరేళ్లలో 220 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మంది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

సహజవాయు ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసందుకు అవిశ్రాంతంగా కృష్టి చేస్తున్న ఏజీ అండ్ పీ.. ఇప్పటికే అనంతపురం, చిత్తూరు, శ్రీ సత్యసాయి, శ్రీ బాలాజీ (తిరుపతి), అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా గృహ వినియోగదారులకు సహజ వాయువును అందిస్తోంది. అలాగే, సీఎన్‌జీ ఫ్యూయలింగ్ స్టేషన్ల ద్వారా రవాణా రంగ అవసరాలను కూడా తీరుస్తోంది.

ఏపీలో తమ వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఇప్పుడు స్టీల్‌ గ్రిడ్‌ పైప్‌లైన్‌ను కర్ణాటకలోని సిరా నగరం నుంచి హిందూపురానికి వేయడం ద్వారా శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో సహజవాయువు డిమాండ్‌ను తీర్చనుంది. ఈ గ్రిడ్‌ పైప్‌లైన్‌తో స్ధిరంగా సహజవాయువును గృహ, వాణిజ్య, రవాణా రంగాలకు సమర్ధవంతంగా సరఫరా చేసే వీలుంటుంది. మొదటి దశ పైప్‌లైన్‌ సదుపాయాలతో హిందూపురం ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. పెట్రోల్‌, డీజిల్‌‌తో పొలిస్తే ఇంధన బిల్లులను 30 శాతం వరకు, ఇళ్లలో వాడే ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంధనంతో పోలిస్తే 20 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, పారిశ్రామికీకరణకు తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు సృష్టించడం, కాలుష్యం తగ్గడం, పర్యావరణ అనుకూల వాతావరణం మెరుగుపరచడం, తద్వారా నగర ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడం సాధ్యమవుతుంది.

సత్యసాయి జిల్లాతో సుదీర్ఘ అనుబంధం కలిగిన ఏజీ అండ్ పీ ప్రథమ్ ఈ ప్రాంతంలో ప్రస్తుతం రోజూ 3 వేల కేజీల సహజ వాయువును 8 సీఎన్‌జీ స్టేషన్ల ద్వారా పంపిణీ చేస్తోంది. హిందూపురం పట్టణం, అనంతపురం, పుట్టపర్తిలలో గృహాలకు సహజ వాయువును అందించడమే కంపెనీ లక్ష్యం. ఇప్పటికే 15వేల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. త్వరలోనే డీసీయూ (డీ-కంప్రెషన్‌ యూనిట్‌) ద్వారా 8,266 పీఎన్‌జీ కనెక్షన్లును అందించనున్నారు.

Updated Date - 2022-12-02T19:37:18+05:30 IST