బెల్లం ధర పతనం
ABN , First Publish Date - 2022-11-13T03:48:25+05:30 IST
దేశంలోనే రెండో అతిపెద్దదైన అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో బెల్లం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 100 కిలోల బెల్లం ధర రూ.500 వరకూ పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.
100 కిలోల బెల్లానికి రూ.500 తగ్గుదల
అనకాపల్లి టౌన్, నవంబరు 12: దేశంలోనే రెండో అతిపెద్దదైన అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో బెల్లం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే 100 కిలోల బెల్లం ధర రూ.500 వరకూ పడిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి మార్కెట్‌కు శనివారం 4,674 బెల్లం దిమ్మలు వచ్చాయి. శుక్రవారం ఒకటో రకం వంద కిలోల రూ.4000 ధర పలకగా, శనివారం రూ. 3,500లకు పడిపోయింది. రెండో రకం రూ.3,300 నుం చి రూ.3,220కు దిగింది. అయితే నల్ల బెల్లం ధర రూ.2,900 వద్ద నిలకడగా ఉంది. ఇంతలా ధరలు పడిపోవడానికి ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. అనకాపల్లి మార్కెట్ నుంచి ప్రస్తుతం బెల్లం ఒడిసాకు మాత్రమే రవాణా అవుతోంది. అక్కడ డిమాండ్ అంతంతమాత్రంగానే ఉందని చెబుతున్నారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఒడిసాకి బెల్లం దిగుమతి అవుతుండడంతో అనకాపల్లి బెల్లానికి డిమాండ్ తగ్గిందని వర్తకుల చెబుతున్నారు. గత సీజన్‌లో ఎగుమతి వర్తకులు కొనుగోలు చేసిన బెల్లం కోల్డ్ స్టోరేజిలో 60 లారీల వరకు ఉన్నట్టు సమాచారం. ఆ బెల్లం రవాణా అయ్యాకే ఎగుమతి వర్తకులు కొత్తగా కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.