Share News

Tariff Reduction: అమెరికాకు సుంకాల తగ్గింపు ఆఫర్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 05:43 AM

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాల మోత మోగించడం, దానికి ప్రతిగా ఆయా దేశాలు కూడా అదే స్థాయిలో స్పందిస్తుండడం చూశాం.

Tariff Reduction: అమెరికాకు సుంకాల తగ్గింపు ఆఫర్‌

పలు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌ కోతకు భారత్‌ అంగీకారం

న్యూఢిల్లీ, మార్చి 28: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాల మోత మోగించడం, దానికి ప్రతిగా ఆయా దేశాలు కూడా అదే స్థాయిలో స్పందిస్తుండడం చూశాం. అయితే ఇందుకు భిన్నంగా భారత్‌ ముందుకు వెళుతోంది. తాజాగా ఆ దేశానికి మరింత రాయితీ కల్పిస్తూ.. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు బాదం, క్రాన్‌బెర్రీస్‌ వంటి వాటి దిగుమతులపై సుంకాల తగ్గింపునకు భారత్‌ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు దేశాల ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. దీనిపై దక్షిణ, మధ్య ఆసియాకు అమెరికా ట్రేడ్‌ ప్రతినిధిగా ఉన్న బ్రెండెన్‌ లించ్‌తో ఢిల్లీలో జరిగిన వరుస సమావేశాల్లో చర్చలు జరిగినట్లు తెలిసింది. బోర్బన్‌ విస్కీతో పాటు బాదం, వాల్‌నట్స్‌, క్రాన్‌బెర్రీస్‌, పిస్తా, కాయధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు భారత్‌ అంగీకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది వచ్చే వారం ట్రంప్‌ నిర్ణయించిన పరస్పర సుంకాలను తప్పించడంపై ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, గత నెల బోర్బన్‌ విస్కీపై సుంకాన్ని భారత్‌ 150 శాతం నుంచి 100 శాతానికి తగ్గించింది. ఇక క్రాన్‌బెర్రీస్‌, బాదం, వాల్‌నట్స్‌పై సుంకాలు 30 నుంచి 100 శాతం వరకు ఉండగా, కాయధాన్యాలపై 10 శాతం వరకు ఉన్నాయి. చైనా, కెనడా, ఈయూ వంటి దేశాల మాదిరిగా కాకుండా భారత్‌ మాత్రం.. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు చురుకుగా ప్రయత్నిస్తోందని, 23 బిలియన్‌ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై సగానికి పైగా సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని రాయిటర్స్‌ ఇటీవల పేర్కొంది.

Updated Date - Mar 29 , 2025 | 05:43 AM