అండర్ గ్రాడ్యుయేషన్ చదివే వారికి ఇకపై ఇంటెన్షిప్ కోర్సులు తప్పనిసరి
ABN , First Publish Date - 2022-08-24T05:07:41+05:30 IST
అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా ఇంటెన్షిప్ కోర్సులు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ స్పష్టంచేశారు.

చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 23: అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా ఇంటెన్షిప్ కోర్సులు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ స్పష్టంచేశారు. సెప్టెంబరు ఒకటో తేది నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఎస్వీయూ పరిధిలో ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ 10,717 మంది చదువుతున్నారని యూనివర్సిటీ అధికారులు చెప్పారన్నారు. విద్యారంగంలో ప్రభుత్వం కొత్త మార్పులు తెచ్చిందన్నారు. ఈ విద్యార్థులను ఐదు విభాగాలుగా చేసి వివిధ పరిశ్రమలు, సంస్థలు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, వివిధ సంస్థల పనితీరు పట్ల రెండు నెలలపాటు ఇంటెన్షిప్ కల్పించనున్నట్లు చెప్పారు. ఎస్వీయూ రిజిస్ట్రార్ మొహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ బీజడ్‌సీ కోర్సులు చేసే విద్యార్థులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా పట్టు, ఉద్యానవన శాఖలపై అవగాహన కల్పించి చిన్నచిన్న ప్రాజెక్టుల గురించి లింకేజి కల్పిస్తామన్నారు. కంప్యూటర్ సైన్సు చదువుతున్న విద్యార్థులకు డేటా ఎంట్రీ, తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సచివాలయాల్లో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్లు తెలుసుకునేలా విద్యాబోధనలో మార్పులు తీసుకొస్తామన్నారు. హెచ్‌ఈపీ చదివే వారికి ప్లానింగ్ సెక్షన్, ఎండోమెంట్, సీపీవోలతో పాటు గ్రామాల్లో కొనసాగుతున్న గడపగడప కార్యక్రమం అమలు తీరుపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు జిల్లా నోడల్ అధికారులుగా డీఆర్వో రాజశేఖర్, జడ్పీ సీఈవో ప్రభాకర్ రెడ్డిని నియమిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సమావేశంలో లేబర్ డిపార్ట్‌మెంట్ అధికారి ఓంకార్ రావు, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, డీఐసీ జీఎం చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ తులసి, మెప్మా టీఈ బాబా తదితరులు పాల్గొన్నారు.
63శాతం డ్రోన్ ఫ్లై సర్వే పూర్తి
జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న భూహక్కు - భూరక్ష పథకం కింద చేపట్టిన రీసర్వే కార్యక్రమంలో భాగంగా 63శాతం డ్రోన్ ఫ్లై సర్వే పూర్తయినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలు నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8.2 లక్షల ఎకరాల్లో డ్రోన్ ఫ్లై పూర్తయ్యిందని వివరించారు. వందశాతం భూరికార్డుల స్వచ్చీకరణ కార్యక్రమం చేపట్టగా 134 గ్రామాలకు సంబంధించి అక్టోబరు 2న గాంధీజయంతి నాడు భూయజమానులకు హక్కు పత్రాలు పెద్దఎత్తున పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్, డీఆర్వో ఎన్. రాజశేఖర్, ఆర్డీవోలు రేణుక, సృజన, శివయ్య తదితరులు పాల్గొనగా, మండలాల నుంచి తహసీల్దార్లు, సర్వేయర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
చురుగ్గా ప్రభుత్వ భవన నిర్మాణాలు
జిల్లాలో ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, బీఎంసీయూ, ఏఎంసీయూలు, డిజిటల్ లైబ్రరీ భవనాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయని కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తాడేపల్లె క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం సీఎం జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ పథకాల గురించి సీఎం సూచనలు చేశారు. కలెక్టరేట్ నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ వెంకటేశ్వర్, డ్వామా పీడీ చంద్రశేఖర్, హౌసింగ్ పీడీ పద్మనాభం, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ చంద్రశేఖర్, ఎస్‌ఎ్‌సఏ పీడీ వెంకటరమణా రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.