నువ్వే... కాదు నువ్వే!

ABN , First Publish Date - 2022-11-19T23:56:06+05:30 IST

వాళ్లిద్దరూ కుప్పం టౌన్‌ బ్యాంకు ఉద్యోగులే. కాకపోతే అందులో ఒకరు ప్రస్తుతం ఉద్యోగి కాగా, మరొకరు గోల్డ్‌ లోన్ల అవకవకల వ్యవహారంలో సస్సెన్షన్‌కు గురై, మాజీ అయిన ఉద్యోగి. అవకవకలకు నువ్వే కారణమంటూ శనివారం సాయంత్రం పరస్పరం రోడ్డున పడి కొట్టుకున్నారు.

నువ్వే... కాదు నువ్వే!
కుప్పం నడిరోడ్డులో గొడవ పడుతున్న కిరణ్‌, శివ

పిడిగుద్దులతో ద్వంద్వ పోరాటం

కుప్పం, నవంబరు 19: వాళ్లిద్దరూ కుప్పం టౌన్‌ బ్యాంకు ఉద్యోగులే. కాకపోతే అందులో ఒకరు ప్రస్తుతం ఉద్యోగి కాగా, మరొకరు గోల్డ్‌ లోన్ల అవకవకల వ్యవహారంలో సస్సెన్షన్‌కు గురై, మాజీ అయిన ఉద్యోగి. అవకవకలకు నువ్వే కారణమంటూ శనివారం సాయంత్రం పరస్పరం రోడ్డున పడి కొట్టుకున్నారు.

కుప్పం టౌన్‌ బ్యాంకులో బంగారం రుణాల విషయంలో జరిగిన అవకవకలపై మూడేళ్ల క్రితం సహకార శాఖ అధికారులు విచారణ జరిపారు. కోటి రూపాయల పైగా అప్పట్లో బయట పడ్డాయని ప్రకటించి అందుకు బాధ్యులను చేస్తూ ఐదుగురు ఉద్యోగులను సస్పెండు చేశారు. అప్పట్లో రెగ్యులర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న కిరణ్‌ కూడా ఉన్నారు. శివ అనే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ప్రస్తుతం టౌన్‌ బ్యాంకు మేనేజరుగా వ్యవహరిస్తూ, అకౌంట్స్‌ వ్యవహారాల సహా సకలం చక్కబెడుతున్నారు. ఈయన ఉద్యోగాన్ని రెగ్యులర్‌ చేస్తూ ఇటీవలే ఆర్డర్స్‌ వచ్చాయంటున్నారు. ఈ సంగతి ఎలా ఉన్నా... ప్రస్తుత మేనేజరు శివ, మాజీ అకౌంటెంట్‌ కిరణ్‌ శనివారం సాయంత్రం కుప్పంలోని ఓ టీ బంకు దగ్గర ఒకరికొకరు ఎదురయ్యారు. ఈ సందర్భంగా టౌన్‌ బ్యాంకులో గతంలో జరిగిన గోల్డ్‌ లోన్‌ అవకతవకలపై వారిద్దరి మధ్యా వాగ్వాదం మొదలైంది. అసలు బంగారు లోన్ల కుంభకోణంలో నేరస్తులు నకిలీ బంగారు ఆభరణాలు లాకర్లలో ఉంచింది నువ్వు... నువ్వేనంటూ పరస్పరం దూషించుకున్నారు. ‘నన్ను పాత మనిషిని చేయద్దురా...’ అని ఒకరంటే, ‘ఆ, అయితే ఏం చేస్తావ్‌...’ అంటూ దుర్భాషలాడుకున్నారు. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కలియబడ్డారు. ఒకరినొకరు పిడిగుద్దులు కూడా గుద్దులు కూడా గుద్దుకున్నారు. చివరికి అక్కడున్న వారు కలుగజేసుకుని వారిద్దరినీ విడదీశారు. తర్వాత కామ్‌గా ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. కొసమెరుపేమటంటే టౌన్‌ బ్యాంకు ఛైర్మన్‌ భాగ్యరాజ్‌ ఆ సమీపంలోనే ఉండి వీళ్ల ద్వంద్వ యుద్ధం చూసి కూడా ఏమాత్రం కలుగజేసుకోకుండా మౌనంగా ఉండిపోవడం.

Updated Date - 2022-11-19T23:56:08+05:30 IST