కునుకు పట్టనివ్వవు..!

ABN , First Publish Date - 2022-08-25T05:41:54+05:30 IST

కరప, ఆగస్టు 24: కొరుపల్లి గోదాముల నుంచి గ్రామాలపై దండెత్తుతున్న పెంకు పురుగులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని నివారించాల్సిన గోదాము నిర్వాహకులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో నానాటికీ పెంకు పురుగులు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో అవి దండుగా ఇళ్లపై దాడి చేస్తూ ప్రజల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గోదాములున్న కొరుపల్లి గ్రామంతోపా

కునుకు పట్టనివ్వవు..!
కొరుపల్లిలో చిన్నారి తింటున్న అన్నం కంచంలో పడిన పురుగులు

గ్రామాలపై గుంపులుగా  పెంకు పురుగుల దండయాత్ర

పట్టించుకోని గోదాము నిర్వాహకులు, అధికారులు

కరప, ఆగస్టు 24: కొరుపల్లి గోదాముల నుంచి గ్రామాలపై దండెత్తుతున్న పెంకు పురుగులతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని నివారించాల్సిన గోదాము నిర్వాహకులు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో నానాటికీ పెంకు పురుగులు ఉధృతంగా పెరిగిపోతున్నాయి. రాత్రి సమయాల్లో అవి దండుగా ఇళ్లపై దాడి చేస్తూ ప్రజల కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గోదాములున్న కొరుపల్లి గ్రామంతోపాటు పక్కనే ఉన్న కరప, జడ్‌.బావారం, గొడ్డటిపాలెం, పెనుగుదురు గ్రామాలకు ఈ పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఈ పెంకు పురుగుల సమస్యను సచిత్రంగా వివరిస్తూ ఈనెల 8న ‘బాబోయ్‌ పురుగులు...!’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు సంబంధిత యాజమాన్యానికి మొక్కుబడిగా నోటీసు పంపించి వదిలేశారు. పెంకు పురుగుల తీవ్రతను వివరిస్తూ జిల్లా సివిల్‌ సప్లయిస్‌ అధికారులకు స్థానిక అధికారి ఒకరు లేఖ రాసినా ఎటువంటి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతోనే సంబంధిత యాజమాన్యం పెంకు పురుగుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటం 

గోదాముల్లో భారీగా నిల్వచేసిన పీడీఎఫ్‌ బియ్యంపై కవర్లు కప్పకుండా పెంకు పురుగుల నివారణకు కెమికల్‌ స్ర్పేయింగ్‌ చేయకుండా నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రాత్రి సమయాల్లో లైట్ల వెలుగుకు ఆకర్షింపబడి ఈ పురుగులు ఇళ్లపైకి దాడిచేస్తున్నాయి. నిద్రపోతున్న పిల్లల చెవులు, ముక్కుల్లోకి దూరిపోతూ ఇబ్బంది కలిగిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆహార పదార్థాలపై వాలుతూ, తాగునీటిలో తేలియాడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. పెంకు పురుగులు రాకుండా అవసరమైన నివారణా చర్యలు తీసుకోవాలని, గోదాము నిర్వాహకులకు చెప్తున్నా పట్టించుకోవడంలేదని సర్పంచ్‌ పలివెల నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ రెడ్డి వీరవెంకటసత్యనారాయణ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంబంధిత యాజమాన్యంపై చర్యలు తీసుకుని, పెంకు పురుగులను నివారించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై కొరుపల్లి పంచాయతీ కార్యదర్శి పినిశెట్టి ఉమామహేశ్వరిని వివరణ కోరగా గొడౌన్‌ యజమానులకు నోటీసులు పంపించామని, ఇప్పటివరకూ వారు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టలేద న్నారు. సివిల్‌ సప్లయిస్‌ డీఎం డి.పుష్పమణికి ఫోన్‌ చేయగా విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2022-08-25T05:41:54+05:30 IST