Share News

ఉద్రిక్తత... ఉత్కంఠ!

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:05 AM

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడు ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్తత, ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు, ప్రవీణ్‌ ఫాలోవర్స్‌తో పాటు తెలంగాణ జిల్లాలు, ఖమ్మం ప్రాంతానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో ఆ ప్రా

ఉద్రిక్తత... ఉత్కంఠ!
పాస్టర్‌ ప్రవీణ్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు

రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి

వద్ద రోజంతా టెన్షన్‌ టెన్షన్‌

భారీగా మోహరించిన పోలీసులు

పోస్టుమార్టం అనంతరం పాస్టర్‌ ప్రవీణ్‌ మృతదేహం హైదరాబాద్‌ తరలింపు

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ క్రైస్తవ సువార్తీకుడు ప్రవీణ్‌ పగడాల అనుమానాస్పద మృతి నేపథ్యంలో బుధవారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనాసుపత్రి వద్ద రోజంతా ఉద్రిక్తత, ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ సంఘాల నాయకులు, క్రైస్తవులు, ప్రవీణ్‌ ఫాలోవర్స్‌తో పాటు తెలంగాణ జిల్లాలు, ఖమ్మం ప్రాంతానికి చెందిన క్రైస్తవ ప్రముఖులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకోవడంతో ఆ ప్రా ంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్ప డ్డాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆసుపత్రి ఆవరణలోని పోలీస్‌ అవుట్‌పోస్టు సమీపంలో క్రైస్తవ విశ్వాసులు పెద్దసంఖ్యలో మోకాలి ప్రార్థనలతో, నినాదాలతో ప్రవీణ్‌కు న్యాయం జరగాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అన్ని ఫార్మాలిటీస్‌ ముగిసిన అనంతరం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సువార్తీకుడు ప్రవీణ్‌ పగడాల మృతదేహాన్ని ఒక ప్రైవేట్‌ అంబులెన్స్‌లో హైదరాబాద్‌ తరలించారు. జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌ ప్రభుత్వ బోధనాసుపత్రికి చేరుకుని శాంతిభద్రతలు, ఇతర అంశాలను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కూడా ఆసుపత్రికి వచ్చి బాధిత క్రైస్తవ సంఘీయులకు న్యా యం జరిగేలా చూస్తామని ప్రకటించారు. ప్రవీణ్‌ పగడాల మృతి విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్‌, హోంమంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ విషయంలో సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని, మృతి కారణాలు సాధ్యమైనంత త్వరగా బయటకు వస్తాయన్నారు. కాగా ప్రభుత్వ బోధనాసుపత్రి ఆవరణలోని పోలీస్‌ అవుట్‌పోస్టులో ప్రవీణ్‌ మృతదేహానికి శవ పంచనామా జరిపారు. అనంతరం మార్చురీలో పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ ప్రక్రియ మొత్తం సాయంత్రం 4.30 గంటల వరకూ కొనసాగడంతో ఆసుపత్రి ఆవరణతోపాటు మెయిన్‌గేటు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

కేఏ పాల్‌ను అడ్డుకున్న పోలీసులు

సాయంత్రం మూడున్నర ప్రాంతంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌ రాజమహేంద్రవరం ప్రభుత్వబోధనాసుపత్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీగది లోపలకు వెళ్లడానికి ప్రయత్నించగా కేఏ పాల్‌ను పోలీసులు అనుమతించలేదు. ఈ సమయంలో కేఏ పాల్‌కు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ తనయునికి కొంత వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఆసుపత్రి మార్చురీ వద్ద కేఏ పాల్‌ హైడ్రామా కొనసాగింది. ఓపెన్‌టాప్‌ జీపుపై కేఏ పాల్‌ తన మద్దతుదారులు, క్రైస్తవ సంఘీయులకు అభివాదం చేస్తూ సువార్తీకుడు ప్రవీణ్‌ పగడాలది ప్రమాదం కాదని, హత్య అని భావిస్తున్నామని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొద్దిరోజులుగా అన్‌నెస్ససరీగా మాట్లాడడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రవీణ్‌ మర ణం విషయంలో రాష్ట్రంలోని కోర్టుల్లో న్యాయం జరగపోతే అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆందోళనా కార్యక్రమం వద్దకు చేరుకుని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌తో మా ట్లాడారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. పోస్టుమార్టం కార్యక్రమాలను సైతం పర్యవేక్షించారు.

ఆఖరి క్షణాలు.. ఇలా!

వీడియో కెమెరాల్లో నమోదైన సీసీ ఫుటేజ్‌ ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై వస్తున్న పాస్టర్‌ ప్రవీణ్‌ సోమవారం రాత్రి 11 గంటల 31 నిమిషాలకు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్‌ గేటు దాటారు. ఆ సమయంలో బుల్లెట్‌ హెడ్‌లైటు వెలగడం లేదు. కుడివైపు సిగ్నల్‌ లైటు మాత్రమే బ్లింక్‌ అవుతోంది. తర్వాత 11 గంటల 42 నిమిషాల 6 సెకన్లకు(11 నిమిషాలు) బుల్లెట్‌ నయారా పెట్రోల్‌ బంక్‌ వద్దకు చేరుకుంది(ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 10-11 కిలో మీటర్లు.) సరిగ్గా బంకుకు ఎదురుగా రోడ్డు పైనుంచి ఎడమవైపు గట్టు కిందకు ప్రవీణ్‌ బుల్లెట్‌తో సహా పడిపోయారు. బుల్లెట్‌ కింద పడిపోతున్న సమయంలో దాని పక్క నుంచి ఎరుపు రంగు కారు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆ వెంటనే లారీ కూడా వెళ్లింది.

రంగంలోకి ఐదు బృందాలు : ఎస్పీ

పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మృతి కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోందని ఎస్పీ నరసింహ కిశోర్‌ తెలిపారు. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకు మార్‌ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు నిజం నిగ్గుతేల్చే పనిలో నిమగ్నమయ్యాయని చెప్పారు. అధునాతన సాంకేతికత సహా యంతో అన్ని కోణాల్లో పరిశీలన చేస్తున్నామన్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ చివరిసారి మోహన్‌రావు అనే స్థానిక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడారని గుర్తించినట్టు తెలిపారు. శవ పరీక్షను వీడియో తీసినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఎవరి వద్ద ఎలాంటి సమాచా రం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు. వదంతులు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనా స్థలంలో కర్రలపై ఉన్న రక్తపు మరకలను, దుస్తులను ఫోరెన్సిక్‌ నిపుణులకు పంపించామని ఆయన వెల్లడించారు.

క్రైస్తవులు 29న రాజమహేంద్రవరం తరలిరండి

మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 25( ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణం దురదృష్టకరమని, దీనిపై భవిష్యత్‌ కార్యాచరణ చేపట్టి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసేందుకు ఈనెల 29న రాజమహేంద్రవరం హోలీట్రినిటి చర్చ్‌ గ్రౌండ్‌ వద్దకు క్రైస్తవ సోదరులంతా తరలిరావాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్‌ పిలుపునిచ్చారు. ప్రవీణ్‌ పోస్టుమార్టం రిపోర్టు ఈనెల 29న వస్తుంద ని ప్రభుత్వాసుపత్రి సూపరింటిండెంట్‌ చెప్పారన్నారు.

ప్రవీణ్‌ మరణం కలచివేసింది : షఫీ

పాస్టర్‌ ప్రవీణ్‌ మరణం తమను కలచివేసిందని అంతర్జాతీయ ముస్లీం మైనార్టీ సువార్తీకుడు షఫీ అన్నారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయ న విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం సమగ్ర విచారణజరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:05 AM