Share News

ఆక్వా గ్రామసభలో రచ్చరచ్చ.. ఇరు వర్గాల ఘర్షణ

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:12 AM

సన్నవిల్లి ఆక్వా గ్రామ సభలో రెండు వర్గాలు దెబ్బలాడుకున్నాయి. ఆక్వా సాగు అంశం కోర్టులో ఉండగా గ్రామ సభ ఏమిటంటూ ఒక వర్గం, ఆక్వా జోన్‌లో ఉండి కూడా ఎన్నో ఏళ్లుగా సాగులేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని మరో వర్గం పరస్పరం అధికారుల సమక్షంలో గొడవకు దిగారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి కొంత మేర సద్దుమణిగింది.

  ఆక్వా గ్రామసభలో రచ్చరచ్చ..  ఇరు వర్గాల ఘర్షణ

ఉప్పలగుప్తం, మార్చి 26(ఆంధ్రజ్యోతి): సన్నవిల్లి ఆక్వా గ్రామ సభలో రెండు వర్గాలు దెబ్బలాడుకున్నాయి. ఆక్వా సాగు అంశం కోర్టులో ఉండగా గ్రామ సభ ఏమిటంటూ ఒక వర్గం, ఆక్వా జోన్‌లో ఉండి కూడా ఎన్నో ఏళ్లుగా సాగులేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని మరో వర్గం పరస్పరం అధికారుల సమక్షంలో గొడవకు దిగారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి కొంత మేర సద్దుమణిగింది. 2010లో ఆక్వా సాగు ప్రారంభిస్తే ఇప్పుడు అడ్డుకోవడమేమిటని మహిళలు వాదించారు. బుధవారం సర్పంచ్‌ చిక్కం జంగమయ్య అధ్యక్షతన ఆక్వా గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో 70ఎకరాల చెరువులు ఆక్వా జోన్‌లో ఉన్నాయని కరెంటు రాయితీకి సంబంధించి సమస్యలున్నా, కొత్తగా చెరువుల తవ్వుకోవాలన్నా దరఖాస్తులు చేసుకోవచ్చని ఎఫ్‌డీవో బి.హేమానందకుమార్‌ అన్నారు. వెంటనే ఒక వర్గం గ్రామంలో ఆక్వాసాగు చేయరాదని హైకోర్టు ఉత్తర్వులుండగా గ్రామసభ ఎందుకని ప్రశ్నించడంతో మరో వర్గం ఎదురుతిరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కేకలు వేయడంతో తోపులాట జరిగింది. వెంటనే సర్పంచ్‌, గ్రామ పెద్దలు, పోలీసులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేశారు. ఏమైనా చెప్పాలంటే ఫిర్యాదు రూపంలో సంతకాలతో ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎఫ్‌డీవో చెప్పడంతో రెండు వర్గాలు రాతపూర్వకంగా ఫిర్యాదులు సమర్పించారు. గ్రామసభకు హాజరైన పలువురు మహిళలు కొన్ని సంవత్సరాలుగా తమ భూములపై ఆదాయం లేక ఆర్ధిక ఇక్కట్లు పడుతున్నామంటూ ఎఫ్‌డీవో ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తమకు పుట్టింటి వారు కానుకగా ఇచ్చిన భూములు వ్యవసాయానికి పనికి రాకపోవడంతో 2010 లో చెరువులుగా మార్చుకున్నామన్నారు. కనీసం చేపలు పెంచుకునేందుకు అడ్డు చెప్పడంతో ఆదాయం లేక అత్తింట్లో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా సాగుకు వ్యతిరేకంగా ఒక వర్గం రోడ్డుపై ఆందోళన చేసింది. ఆక్వా సాగుకు అనుకూలంగా మరో వర్గం పంచాయతీ ఆవరణలో ఆందోళన చేపట్టింది. కార్యక్రమంలో వ్యవసాయాధికారి జి.కుమార్‌బాబు, వీఆర్వో పెట్టా బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 01:12 AM