ఏందిరొయ్యో..!
ABN , First Publish Date - 2022-02-13T06:04:27+05:30 IST
ఏందిరొయ్యో..!

రొయ్యల చెరువుల్లో మంత్రి అనుచరుడి పెత్తనం
బందరు మండలంలో ఎల్‌కే ట్యాక్స్ పేరిట వసూళ్లు
డిమాండ్ చేసినంత ఇస్తేనే ఆమోదముద్ర
చెరువుల తవ్వకాలు, మరమ్మతుల్లో చేతివాటం
వాడపాలెంలో 275 ఎకరాల సీలింగ్ ల్యాండ్‌పై కన్ను
తీరాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఎక్కడ రొయ్యల చెరువులు తవ్వితే అక్కడ వాలిపోతాడు. చేతివాటం ప్రదర్శించి వాటాలు కావాలంటాడు. ఎల్‌కే ట్యాక్స్ పేరిట వసూళ్లు చేస్తాడు. కాదూ.. కూడదు అంటే మంత్రి పేరుచెప్పి బెదిరిస్తాడు. బందరు మండలంలో చెరువుల తవ్వకాలు, మరమ్మతుల్లో దోచుకుతింటున్న మంత్రిగారి ముఖ్య అనుచరుడి అక్రమ వ్యవహారాలు ప్రస్తుతం తారస్థాయికి చేరాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : తీరంలో రొయ్యల చెరువులు తవ్వాలంటే రెవెన్యూ, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారుల అనుమతి కావాలి. ఇది చట్టప్రకారం జరగాల్సిన తంతు. కానీ, బందరు మండలంలో మాత్రం ఎల్‌కే ట్యాక్స్ వసూలు చేస్తారు. అందరూ ముద్దుగా ఎల్‌కే అని పిలుచుకునే స్థానిక మంత్రి ముఖ్య అనుచరుడు తనకు ట్యాక్స్ చెల్లిస్తేనే చెరువులు తవ్వుకోనిస్తాడు. కొత్త చెరువులైతే ఎకరాకు ఆయన వాటా రూ.15 వేలు. పాత చెరువుల్లో మరమ్మతు పనులైతే మరో రేటు. కాదని చెరువులు తవ్వితే రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తారంటూ తనదైనశైలిలో హెచ్చరిస్తాడు.
వెంకట దుర్గాంబపురంలో వసూళ్ల దందా
బందరు మండలం వాడపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట దుర్గాంబపురం గ్రామంపై మంత్రి అనుచరుడి కన్ను పడింది. తన అనుచరులు నలుగురైదుగురిని ఆ గ్రామంలో వేగులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ చెరువులకు రిపేర్లు చేస్తున్నా వారిచ్చిన సమాచారంతో వెంటనే అక్కడ వాలిపోతాడు. తనను కలవకుండా రిపేర్లు ఎలా చేస్తారంటూ బెదిరిస్తాడు. రైతులు బతిమాలుకున్నా వదలడు. రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపి, పనులు నిలిపివేయిస్తాడు. రెవెన్యూ అధికారులు సైతం ఈయన చెప్పిన పనులే చేస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎల్‌కే ట్యాక్స్ పేరుతో సాగుతున్న ఈ దందాకు అదుపులేకుండా పోతోందని ఆ ప్రాంత మత్స్యకారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గ్రామంలోని సర్వే నెంబరు 602లో ఇటీవల పది ఎకరాల్లో చెరువులు తవ్వారని, మంత్రి అనుచరుడు ఎకరాకు రూ.15 వేల చొప్పున తన వాటాగా తీసుకుని, పనులు చేయించాడని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో ఎవరు చెరువులు తవ్వినా తనను ప్రసన్నం చేసుకోవాలని నిబంధన పెట్టాడని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో 400 ఎకరాల రొయ్యల చెరువుల రిపేర్లకు మంత్రి అనుచరుడే అనుమతులు ఇచ్చేయడం గమనార్హం.
275 ఎకరాలపై దృష్టి
వాడపాలెం గ్రామ పరిధిలో 1,064 సర్వే నెంబరులో 275 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉంది. ఈ భూముల్లోకి ఎవరూ వెళ్లకుండా ఒకనాటి కలెక్టర్ లక్మీపార్థసారథి భాస్కర్ ఆంక్షలు విధించారు. ఈ భూములను గ్రామంలోని పేదలకు ఇవ్వాలని వాడపాలెం గ్రామస్థులు ఎన్నాళ్ల నుంచో కోరుతున్నారు. ఇటీవల ఈ భూములపై కన్నేసిన మంత్రి అనుచరుడు తన పేరున, తన అనుచరుల పేరున రెవెన్యూ రికార్డుల్లో రాయించుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఈ భూముల విషయంలో ఎక్కడైనా తప్పు జరిగినట్లు తెలిస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ వ్యవహారం అధికార పార్టీ నాయకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.