HIV positive: విడాకుల కోసం భర్త అబద్ధం.. హైకోర్టు తీర్పు ఇదీ!
ABN , First Publish Date - 2022-11-25T21:09:15+05:30 IST
తన భార్యకు హెచ్ఐవీ (HIV) ఉందన్న కారణాన్నిచూపుతూ తనకు విడాకులు కావాలన్న ఓ వ్యక్తి పిటిషన్‌ను బాంబే హైకోర్టు (Bomby High Court)
ముంబై: తన భార్యకు హెచ్ఐవీ (HIV) ఉందన్న కారణాన్నిచూపుతూ తనకు విడాకులు కావాలన్న ఓ వ్యక్తి పిటిషన్‌ను బాంబే హైకోర్టు (Bomby High Court) కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాల్లోకి వెళ్తే.. 16 మార్చి 2003లో పిటిషనర్‌కు వివాహమైంది. ఉన్నదానికి, లేనిదానికి ఆమె చిరాకు పడుతుండడం, మొండిపట్టుదల వంటి వైఖరిని ఆమెలో గుర్తించాడు. దీంతో ఆమెకు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఆ తర్వాత కూడా వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
డిసెంబరు 2004లో ఆమె ‘హెర్పిస్’ వ్యాధికి గురికావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు. ఈ సందర్భంగా వైద్యులు ఆమెకు హెచ్ఐవీ పరీక్ష చేశారు. అందులో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇది అతడిని, ఆయన కుటుంబ సభ్యులను ఇది తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2005లో ఆమె ఇంటిని విడిచి వెళ్లిపోయింది.
ఆమె కోలుకున్న తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చానని, కానీ ఆమె వచ్చిన తర్వాత మానసికంగా మరింత వేదన మొదలైందని పేర్కొన్నాడు. దానిని భరించలేక తిరిగి వాళ్లింటికి వెళ్లిపొమ్మని చెప్పానని ఆయన తెలిపాడు. రెండు నెలల తర్వాత ఆమె కోసం అత్తింటికి వెళ్లానని, అప్పుడామె అనారోగ్యంతో కనిపించిందన్నాడు. దీంతో ఆమెను వెనక్కి తీసుకురాలేదని వివరించాడు. ఆమె ఇప్పటికీ హెచ్ఐవీతో బాధపడుతోందని డాక్టర్ చెప్పాడని, దీంతో ఆమెతో వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.
అయితే, తనపై భర్త చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. వైద్యులు ఇచ్చిన నివేదికలో ‘గుర్తించలేదు’ అని మాత్రమే ఉందని, హెచ్ఐవీ ఉన్నట్టుగా నిర్దారణ కాలేదని వాదించింది. అయితే, తన భర్త మాత్రం అందరికీ తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనివల్ల తాను మానసికంగా, సామాజికంగా తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు తెలిపింది.
అంతేకాదు, భర్తపై గృహ హింస కింద కేసు పెట్టడమే కాకుండా, పూణెలో తాను ఉండేందుకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, రూ. 5 లక్షలు ఇప్పించాలని డిమాండ్ చేసింది. అయితే, ఆమె ఆరోపణలను భర్త ఖండించాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ దేశ్‌ముఖ్ ధర్మాసనం భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టిపడేసింది. అతడు చేసిన ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించడంలో విఫలం కావడం, అతడి భార్య మెడికల్ రిపోర్టుల్లో హెచ్ఐవీగా నిర్ధారించినట్టు లేకపోవడంతో కేసును కొట్టివేసింది.