Satyendra jain: జైలులో సత్యేంద్ర జైన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్, ఈడీ ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-11-01T14:25:45+05:30 IST
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు తీహార్ జైలులో వీపీఐ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని, విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది.

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మంత్రి సత్యేంద్ర జైన్ (Satendra jain)కు తీహార్ జైలు (Tihar jail)లో వీపీఐ ట్రీట్‌మెంట్ (Vip treatment) ఇస్తున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కోర్టుకు ఈడీ సమర్పించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అవినీతి ఆరోపణలపై 2017లో సత్యేంద్ర జైన్‌పై సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కింద ఈడీ ఆయనను అరెస్టు చేసింది.
కాగా, తీహార్ జైలులో విలాసవంతమైన జీవితాన్ని సత్యేంద్ర జైన్ గడుపుతున్నారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యాన్ని కూడా కోర్టుకు అందజేసింది. జైలులో బాడీ మసాజ్ వంటి సౌకర్యాలు ఆయన పొందుతున్నట్టు ఈడీ తెలిపింది. ఆయన క్షేమసమాచారాలు తెలుసుకునేందుకు జైలు సూపరింటెండెంట్ రోజూ జైన్‌ను కలుస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని జైలులో ఆయనకు అందిస్తున్నారని కూడా ఈడీ ఆరోపించింది. జైన్ భార్య కూడా తరచు జైలులో ఆయనను కలుస్తోందని, ఇది జైలు నిబంధనలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తెచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం జైన్ తరచు ఇతర నిందుతులైన అంకుష్ జైన్, వైభవ్ జైన్‌లను తన సెల్‌లో కలుస్తున్నారని, ఇది కేసు పురోగతికి ఎంతమాత్రం మంచిది కాదని తెలిపింది. కాగా, ఈడీ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు.