Kerala journalist : జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్‌కు బెయిలు మంజూరు
ABN , First Publish Date - 2022-12-23T18:38:59+05:30 IST
కేరళ పాత్రికేయుడు సిద్ధిఖ్ కప్పన్ (Siddique Kappan)కు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.
లక్నో : కేరళ పాత్రికేయుడు సిద్ధిఖ్ కప్పన్ (Siddique Kappan)కు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నమోదైన కేసులో ఆయన దాదాపు రెండేళ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆయనపై నమోదైన ఇతర కేసులన్నిటిలోనూ సుప్రీంకోర్టు గతంలో బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆయన ఇప్పుడు జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమం అయింది.
లక్నో కోర్టు బెయిలు దరఖాస్తును తిరస్కరించడంతో కప్పన్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ దినేశ్ కుమార్ సింగ్ సింగిల్ జడ్జి బెంచ్ ఆయనకు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.
పీఎంఎల్ఏ కేసులో కప్పన్, కేఏ రవుఫ్ షెరీఫ్, అతికుర్ రహమాన్, మసూద్ అహ్మద్, మహమ్మద్ అలం, అబ్దుల్ రజాక్, అష్రఫ్ ఖాదిర్‌లపై లక్నో కోర్టు ఇటీవల ఆరోపణలను నమోదు చేసింది. ఈ నిందితులపై ప్రాసిక్యూషన్ కంప్లయింట్ (ఛార్జిషీటుతో సమానం)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో దాఖలు చేసింది.
ఈ నిందితులంతా నిషిద్ధ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), దాని అనుబంధ విభాగం కేంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులని పోలీసులు ఆరోపించారు. కప్పన్‌ను 2020 అక్టోబరులో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్రంలోని హత్రాస్‌లో ఓ దళిత యువతి అత్యాచారానికి గురై, ఆ తర్వాత హత్యకు గరికావడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కప్పన్, మరికొందరు ఆ గ్రామానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.