Sabarimala: శబరిమల వెళుతున్నారా.. ఈ సంగతి తెలిసిందా మరి..!
ABN , First Publish Date - 2022-12-12T13:08:38+05:30 IST
అయ్యప్ప స్వామి (Lord Ayyappa) కొలువుదీరిన ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలకు (Sabarimala) భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి..
శబరిమల: అయ్యప్ప స్వామి (Lord Ayyappa) కొలువుదీరిన ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలకు (Sabarimala) భక్తులు పోటెత్తారు. సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి 1,07,260 మంది భక్తులు (1 Lakh Above Devotees) బుకింగ్ చేసుకున్నారంటే భక్తుల రద్దీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీజన్లో ఈ నంబర్ రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్ అని తెలిసింది. దీంతో.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం, ఆలయ బోర్డు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనం (Ayyappa Darsan) కోసం బుకింగ్స్ లక్ష దాటడం ఈ సీజన్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. శనివారం ఏకంగా లక్షమంది దాకా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. రద్దీకి తోడు వర్షం కురవడంతో.. భక్తులు ఎటూ కదిలే దారి లేక పంపానది నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లలో ఎక్కడివారు అక్కడే తడిసి ముద్దయ్యారు. రద్దీ నియంత్రణలో పోలీసులకు గాయాలయ్యాయి. ఆది, సోమవారాల్లో కూడా ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌లో 1.10 లక్షల మంది దాకా బుక్ చేసుకున్నారు.
అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు కేరళ హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. ‘‘ఇంతలా రద్దీ పెరిగితే నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరో గంట పాటు దర్శన వేళలను పొడిగించలేరా?’’ అంటూ పోలీసులను ప్రశ్నించింది. దీనికి దేవాదాయ శాఖ అధికారుల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఈ అంశం దేవస్థానం ప్రధాన తంత్రి(అర్చకుడు) పరిధిలోనిదని చర్చించి, నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ అంశంపై సోమవారం సాయంత్రం అసెంబ్లీ హాలులో సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. అదనపు భద్రతా చర్యలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో దర్శన వేళలను మరో గంట పాటు పెంచాలని దేవస్వంబోర్డు, ప్రధాన తంత్రి నిర్ణయించినట్లు తెలిసింది.