RBI : సమస్యల మూలాలను పరిష్కరించండి... అంబుడ్స్‌మెన్‌కు ఆర్బీఐ గవర్నర్ సలహా...
ABN , First Publish Date - 2022-10-30T14:07:21+05:30 IST
డిజిటల్ లెండింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై ఫిర్యాదులను పరిష్కరించేటపుడు చాలా సున్నితంగా

న్యూఢిల్లీ : డిజిటల్ లెండింగ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ సంబంధిత అంశాలపై ఫిర్యాదులను పరిష్కరించేటపుడు చాలా సున్నితంగా వ్యవహరించాలని అంబుడ్స్‌మెన్‌ను భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) కోరారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఆర్బీఐ అంబుడ్స్‌మెన్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కస్టమర్లు చేసే ఫిర్యాదులకు మూల కారణాలను మొదట తెలుసుకోవాలని, ఆ తర్వాత వాటిని సరిదిద్దేందుకు అవసరమైన వ్యవస్థాగత చర్యలను తీసుకోవాలని చెప్పారు. ఈ ఫిర్యాదులకు పరిష్కారాలు వేగంగా, న్యాయంగా ఉండాలని చెప్పారు. ఆర్థిక రంగం పరిధి క్రమంగా వృద్ధి చెందుతోందని, పరివర్తన చెందుతోందని చెప్పారు. పారదర్శకత, న్యాయమైన ధరలు, నిజాయితీతో కూడిన లావాదేవీలు అనేవి మంచి కస్టమర్ సేవలు, వినియోగదారుల పరిరక్షణలకు ముఖ్యమైన సూత్రాలని తెలిపారు.
తప్పుడు సలహాలిచ్చి అమ్మకాలు జరపడం, ధరల్లో పారదర్శకత లేకపోవడం, మితిమీరిన సర్వీస్ ఛార్జీలు వంటివాటిపై తరచూ ఫిర్యాదులు వస్తుండటంపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. రికవరీ ఏజెంట్లు కండబలాన్ని ప్రదర్శిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయని, వీటివల్ల ఆర్బీఐ, నియంత్రణ సంస్థలు కస్టమర్ల రక్షణ కోసం చేపడుతున్న చర్యలు, చేస్తున్న కృషి బయటకు కనిపించడం లేదని చెప్పారు.
అత్యధిక ఫిర్యాదులు సంప్రదాయ బ్యాంకింగ్‌కు సంబంధించినవే ఉంటున్నాయని, దీనినిబట్టి రెగ్యులేటెడ్ ఎంటిటీస్‌లో కస్టమర్ సర్వీస్, సమస్యల పరిష్కార యంత్రాంగాలపై సునిశిత సమీక్ష నిర్వహించాలని స్పష్టమవుతోందని తెలిపారు. వేధిస్తున్న సమస్యల మూల కారణాలను అర్థం చేసుకోవాలని, వాటిని విశ్లేషించాలని, అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రెగ్యులేటెడ్ ఎంటిటీస్ బోర్డు, టాప్ మేనేజ్‌మెంట్ పాత్ర చాలా కీలకమని చెప్తూ, ప్రొడక్ట్ డిజైన్, సపోర్టింగ్ ప్రాసెసెస్, డెలివరీ మెకానిజం, అమ్మకాల తర్వాత సేవలు వంటివన్నీ కస్టమర్ కేంద్రంగా ఉండేలా దృష్టి పెట్టాలని కోరారు.