Terrorism : భారత్‌కు ఐరాస కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ ధన్యవాదాలు
ABN , First Publish Date - 2022-10-29T15:49:57+05:30 IST
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ
న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ నాయకత్వం నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ పట్ల ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఐరాస భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ చీఫ్ డేవిడ్ స్చరియా (David Scharia) చెప్పారు. ముఖ్యమైన సమస్యగానూ, ప్రధానంగా దృష్టి సారించవలసిన అంశంగానూ నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని చూస్తుందన్నారు. ఈ కమిటీ సమావేశాల అనంతరం ఓ వార్తా సంస్థతో డేవిడ్ మాట్లాడారు.
ఉగ్రవాదం వల్ల సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రపంచం మొత్తానికి ఉగ్రవాద సమస్య ఉండకూడదనే లక్ష్యంతో అంతర్జాతీయ పరిష్కారాలపై దృష్టి పెట్టినందుకు భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇది చాలా అద్భుతమైన విషయమని తెలిపారు. ఈ సమస్యలను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నదీ తెలిపే ప్రకటనను ఈ సమావేశాల అనంతరం విడుదల చేస్తామన్నారు. ఉగ్రవాదులు నూతన, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను ఉపయోగించుకుంటుండటంపై అత్యున్నత స్థాయిలో ఈ సమావేశాల్లో చర్చించడం చాలా గొప్ప విజయమని చెప్పారు.
అంతకుముందు ఈ సమావేశాల్లో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) మాట్లాడుతూ, ఉగ్రవాదం ముప్పు పెరుగుతోందని, ఈ జాఢ్యాన్ని నివారించేందుకు రెండు దశాబ్దాల నుంచి ఐక్య రాజ్య సమితి చెప్పుకోదగ్గ కృషి చేస్తున్నప్పటికీ, అది విస్తరిస్తోందన్నారు. ఈ టెక్నాలజీలు ప్రభుత్వాలకు, రెగ్యులేటరీ వ్యవస్థలకు నూతన సవాళ్లను విసురుతున్నాయన్నారు. ఉగ్రవాద నిరోధం లక్ష్యంగా ఆంక్షలను విధిస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ నిధులతో నడిచే వ్యవస్థగా మార్చిన దేశాలను ఎత్తి చూపేందుకు ఈ కృషి దోహదపడుతోందని చెప్పారు. ఇటువంటి కృషి జరుగుతున్నప్పటికీ ఉగ్రవాదం పెరుగుతూనే ఉందన్నారు. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఉగ్రవాదం విస్తరిస్తోందని చెప్పారు.
ఐరాస కౌంటర్ టెర్రరిజం ట్రస్ట్‌కు భారత దేశం ఈ ఏడాది 5 లక్షల డాలర్లను అందజేస్తుందని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో సభ్య దేశాల సత్తాను పెంచేందుకు సహాయపడటం కోసం ఈ నిధులను ఇస్తామని తెలిపారు.
ఈ సమావేశాలు మొదటి రోజు ముంబైలోనూ, రెండో రోజు ఢిల్లీలోనూ జరిగాయి.